Share News

నాసిరకం మందుల కట్టడి సాధ్యమేనా..?

ABN , Publish Date - Jul 06 , 2026 | 05:34 AM

రాష్ట్రంలో నాసిరకం మందులు లేకుండా చేస్తామంటున్న ఔషధ నియంత్రణ(డ్రగ్‌ కంట్రోల్‌) విభాగం అధికారుల మాటలు నీటి మూటలవుతున్నాయి. ఔషధ నియంత్రణ పరిపాలనా(డ్రగ్‌ కంట్రోల్‌..

నాసిరకం మందుల కట్టడి సాధ్యమేనా..?

  • ఔషధ తయారీ హబ్‌ విశాఖపట్నం రీజియన్‌పై నిర్లక్ష్యం

  • ఇన్‌చార్జిలతో కాలం వెళ్లదీస్తున్న వైనం

  • విశాఖలో అందుబాటులో ఉండని జేడీ

  • విశాఖ డీడీకి రెండు జిల్లాల బాధ్యతలు

  • శ్రీకాకుళంలో ఏడీకే ఇన్‌స్పెక్టర్‌ డ్యూటీ పరిశీలించేదీ.. లైసెన్సులు ఇచ్చేదీ ఆయనే

  • అధికారులు ఉన్నా సర్దుబాటుపై శీతకన్ను

రాష్ట్రంలో నాసిరకం, నకిలీ ఔషధాలను కట్టడి చేసేందుకు, ప్రజారోగ్యాన్ని పరిరక్షించేందుకు ఉద్దేశించిన ‘ఔషధ నియంత్రణ విభాగం’ పాలనా పరమైన ఇబ్బందులతో అల్లాడుతోంది. ఒక్కరికే ఎక్కువ పనులు అప్పగించడంతో పనిభారం పెరిగి నకిలీ మందుల నియంత్రణపై విభాగం పట్టుకోల్పోతోందన్న విమర్శలు వస్తున్నాయి. అధికారుల సంఖ్యాబలం ఉన్నప్పటికీ వారిని సరిగా వినియోగించుకోకపోవడం సమస్యగా మారింది. ముఖ్యంగా ఔషధ తయారీ హబ్‌గా ఉన్న విశాఖలో ఈ సమస్యల మరింత ఎక్కువగా ఉందని సిబ్బంది చెబుతున్నారు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో నాసిరకం మందులు లేకుండా చేస్తామంటున్న ఔషధ నియంత్రణ(డ్రగ్‌ కంట్రోల్‌) విభాగం అధికారుల మాటలు నీటి మూటలవుతున్నాయి. ఔషధ నియంత్రణ పరిపాలనా(డ్రగ్‌ కంట్రోల్‌ ఆడ్మినిస్ట్రేషన్‌) విభాగం లోపాల పుట్టగా మారింది. రాష్ట్రానికి ఔషధ కేంద్రం(డ్రగ్‌ హబ్‌)గా ఉన్న విశాఖపట్నం రీజియన్‌ మొత్తాన్ని అధికారులు గాలికి వదిలేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్ల కొరత తీవ్రంగా ఉంది. దీనికి తోడు విభాగం మొత్తాన్నీ ఇన్‌చార్జిలతో నడిపిస్తున్నారు. దీంతో డ్రగ్‌ విభాగంలో పరిపాలన పడకేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతిమంగా ఇది నకిలీ మందులు ఇష్టారాజ్యంగా మార్కెట్‌లోకి పోటెత్తేందుకు అవకాశం కల్పిస్తోందన్న విమర్శలు వచ్చేలా చేస్తోంది. విశాఖపట్నంలో దాదాపు 120పైగా ఔషధ తయారీ యూనిట్లు ఉన్నాయి. ఆ ప్రాంతంలో డ్రగ్‌ విభాగం మరింత పటిష్టంగా పని చేయాలి. కానీ, ఈ రీజియన్‌ మొత్తం ఇన్‌చార్జిలతోనే నడుస్తోంది. జాయింట్‌ డైరెక్టర్‌(జేడీ) నుంచి డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌(డీఐ) వరకు ఇన్‌చార్జిలే ఉన్నారు. విశాఖలో జేడీ పోస్టు అత్యంత కీలకం.


ఔషధ తయారీ యూనిట్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేసి.. నాసిరకం మందుల తయారీకి అడ్డుకట్ట వేయాల్సింది ఈ అధికారే. అయితే, విశాఖలో జేడీ లేకపోవడంతో తయారీ యూనిట్లలో ఆకస్మిక తనిఖీలు నిలిచిపోయాయి. యూనిట్లకు సంబంధించిన లైౖసెన్సులు, రెన్యువల్స్‌ కూడా నిలిచిపోయాయి. ప్రస్తుతం విశాఖ జేడీగా ఉన్న పాండురంగ ప్రసాద్‌ డ్రగ్‌ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో ఆయన డ్రగ్‌ విభాగం ప్రధాన కార్యాలయానికే పరిమితం అవుతున్నారు. విశాఖపట్నం వైపు కన్నెత్తి చూడడం లేదు. దీంతో అక్కడి పరిపాలన మొత్తం అస్తవ్యస్తగా మారింది.


ప్రతిపాదనకు, లైసెన్సుకు ఒక్కరే!

శ్రీకాకుళం జిల్లాలో ఒకే అధికారికి విచిత్రమైన బాధ్యతలు అప్పగించారు. శ్రీకాకుళం డ్రగ్‌ విభాగం అసిస్టెంట్‌ డైరెక్టర్‌(ఏడీ)గా విధులు నిర్వహిస్తున్న అధికారికే డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌(డీఐ) బాధ్యతలు కూడా అప్పగించారు. ఇలాంటి విచిత్రమైన పరిస్థితి డ్రగ్‌ విభాగంలో ఎప్పుడూ లేదని సిబ్బంది చెబుతున్నారు. ఒకే అధికారి జిల్లా ఏడీతో పాటు డీఐగా విధులు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని కూడా అంటున్నారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ హోదాలో మెడికల్‌ షాపులకు లైసెన్స్‌ కోసం ఆయనే ప్రతిపాదనలు సిద్ధం చేస్తారు. వాటి అనుమతి కోసం ఏడీకి పంపిస్తారు. ఏడీ హోదాలో ఆయనే లైసెన్సులు మంజూరుచేస్తారు. ఇది ఎలా ఆమోదయోగ్యమో అధికారులే చెప్పాలని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం మొత్తం ఇలాంటి విచిత్రమైన ఇన్‌చార్జి పోస్టులు చాలా ఉన్నాయని అంటున్నారు. మరోవైపు ఏడీ, డీడీ, జేడీ స్థాయి అధికారులు సరిపడా ఉన్నా వారిని సరిగా వినియోగించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.

ఒక్కరికే అన్ని పనులు

విశాఖపట్నంలో డ్రగ్‌ డిప్యూటీ డైరెక్టర్‌(డీడీ) ఉన్న మహిళా అధికారికి ఇతర బాధ్యతలు కూడా అప్పగించారు. విశాఖపట్నం, విజయనగరం అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఆమె అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ పోస్టులతో పాటు రెండు జిల్లాల ఏడీ విధులను కూడా ఆమే చూస్తున్నారు. దీంతో తనకు పనిభారం పెరిగిపోయిందని ఆమె వాపోతున్నారు. మూడు నెలల నుంచి విశాఖలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మరికొన్ని రోజులు ఇన్‌చార్జిలతో నడిపిస్తే విశాఖ రీజియన్‌లో డ్రగ్‌ విభాగం మొత్తానికి తాళం వేసుకోవాల్సిన పరిస్థితి వస్తోందనే చర్చ జోరుగా సాగుతోంది. ఇన్‌చార్జిల పాలనలో నాసిరకం మందులను ఎలా నివారిస్తారో అధికారులే చెప్పాలని పలువురు వైద్య నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.

Updated Date - Jul 06 , 2026 | 05:35 AM