Share News

సముద్ర భద్రతపై పటిష్ఠ పర్యవేక్షణ: డీజీపీ

ABN , Publish Date - May 20 , 2026 | 04:00 AM

సముద్ర భద్రతను పటిష్ఠంగా పర్యవేక్షించడానికి ఆధునిక సాంకేతికతను వినియోగించాలని డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా ఆదేశించారు.

సముద్ర భద్రతపై పటిష్ఠ పర్యవేక్షణ: డీజీపీ

మద్దిలపాలెం(విశాఖపట్నం), మే 19 (ఆంధ్రజ్యోతి): సముద్ర భద్రతను పటిష్ఠంగా పర్యవేక్షించడానికి ఆధునిక సాంకేతికతను వినియోగించాలని డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా ఆదేశించారు. నగరంలోని త్రీటౌన్‌ పోలీస్ స్టేషన్ ఓల్డ్‌ సీబీఐ రోడ్డులో నిర్మించిన ఆంధ్రప్రదేశ్‌ కోస్టల్‌ సెక్యూరిటీ పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తీర ప్రాంతాలపై విస్తృత పర్యవేక్షణ, గూఢచార సమాచార సేకరణ, అత్యవసర ప్రతిస్పందన కార్యకలపాలకు ప్రధాన కేంద్రంగా పనిచేయడానికి ఆధునిక సదుపాయాలతో హెడ్‌క్వార్టర్స్‌ను నిర్మించామన్నారు. తీరప్రాంత భద్రతా పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయలు, ఇతర అవసరాలను సమకూరుస్తామని హామీ ఇచ్చారు. అనంతరం తీరభద్రతా పోలీస్‌ పనితీరును సమీక్షించారు. మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమాలు, దీవుల్లో జాతీయ పతాకావిష్కరణ, నావల్‌ ఎన్‌సీసీ కార్యక్రమాలు పరిశీలించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐజీపీ గోపినాథ్‌ జెట్టి, తీరభద్రతా విభాగం ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2026 | 04:06 AM