స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధంకండి
ABN , Publish Date - Jun 27 , 2026 | 04:49 AM
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి పోలీసు అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో సమాయత్తం కావాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా సూచించారు.
డీజీపీ ఆదేశం.. శీవారిని దర్శనం
తిరుపతి(నేరవిభాగం), జూన్ 26(ఆంధ్రజ్యోతి): త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి పోలీసు అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో సమాయత్తం కావాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా సూచించారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సాగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గురువారం తిరుపతికి వచ్చిన ఆయన కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో డీజీపీలతో సెప్టెంబరులో నిర్వహించనున్న కాన్ఫరెన్స్‌కు అనువైన వేదికను పరిశీలించారు. ఇంటెలిజెన్స్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్ ఎన్.అంబిక, ఏఐజీ కృష్ణకాంత్ పటేల్, లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మధుసూదనరెడ్డి తదితరులతో కలసి ఏర్పేడు సమీపంలోని ఐసర్, ఐఐటీ ప్రాంగణాలను పరిశీలించారు. అక్కడినుంచి తిరుమల వెళ్లిన ఆయన సతీమణి సీమాగుప్తాతో కలసి శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుపతి చేరుకుని జిల్లా పోలీసు కార్యాలయంలో సెంట్రల్ పోలీస్ క్యాంటీన్ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. తరువాత నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సాంకేతిక ఆధారిత పోలీసింగ్, పోలీసు సంక్షేమంపై సమీక్షించారు.