రేర్ ఎర్త్ కారిడార్‌తో రాష్ట్రం అభివృద్ధి
ABN , Publish Date - Feb 08 , 2026 | 04:54 AM
ఉడాన్ పథకం ద్వారా సామాన్యులకు విమానయానం అందుబాటులోకి వచ్చిందని పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్‌నాయుడు చెప్పారు.
ఉడాన్‌తో సామాన్యులకు విమానయానం
కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 6(ఆంధ్రజ్యోతి): ఉడాన్ పథకం ద్వారా సామాన్యులకు విమానయానం అందుబాటులోకి వచ్చిందని పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్‌నాయుడు చెప్పారు. కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రేర్ ఎర్త్ కారిడార్ ఇవ్వడం మంచి అవకాశం అని చెప్పారు. అరుదైన ఖనిజాల తవ్వకంతో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పర్యావరణానికి ఇబ్బందులు లేకుండా ఎక్కడ ఖనిజం తవ్వితే అక్కడే ప్రాసెసింగ్ చేసేటట్టు ఈ కారిడార్‌ను అమలు చేస్తామన్నారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వచ్చిన సందర్భంగా ఆయన ఓ ప్రైవేటు హోటల్‌లో మీడియాతో మాట్లాడారు. కేంద్రం సహకారంతో సీఎం చంద్రబాబు 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే నంబర్ 1 చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. దేశీయంగా విమానాలు తయారు చేయనున్నామని చెప్పారు. సాధారణంగా కేంద్ర బడ్జెట్‌ను ఎన్నికల జరిగే రాష్ర్టాలకు అనుకూలంగా పెడతారనే అపోహ ఉందని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ రాజకీయాలకు అతీతంగా 144 కోట్ల మంది ప్రజల భవిష్యత్ నిర్ణయించేలా ఉందని కితాబునిచ్చారు. లక్షలాది మంది యువత అభిప్రాయాలు, ఆలోచనలు, ఆకాంక్షలు తెలుసుకుని ఈ బడ్జెట్ ప్రవేశపెట్టామన్నారు. ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగడం వెనుక ప్రధాని మోదీ దార్శనికత ఉందన్నారు. హెల్త్, సర్వీసు, ఐటీ, ఏఐ, డేటా సెంటర్లు, సెమీ కండక్టర్ పరిశ్రమలను కేంద్రం ప్రోత్సహిస్తోందన్నారు. యువతకు ఉపాధి కల్పన లక్ష్యంతో జిల్లాల్లో వనరుల ఆధారంగా ఆయా రంగాలను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు.