Share News

వైసీపీ నుంచి వారసత్వంగా అరాచకం

ABN , Publish Date - Feb 14 , 2026 | 02:47 AM

గత వైసీపీ ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన అరాచక, అసమర్థ, అవినీతి పాలన కూటమి ప్రభుత్వానికి పెను సవాలుగా మారిందని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

వైసీపీ నుంచి వారసత్వంగా అరాచకం

  • చంద్రబాబు నేతృత్వంలో దాన్ని అధిగమించాం

  • అభివృద్ధికి, సంక్షేమానికీ సమ ప్రాధాన్యం

  • రికార్డు స్థాయిలో రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం

  • ‘జల్‌ జీవన్‌’ను నిర్లక్ష్యం చేసిన వైసీపీ

  • అప్పట్లో వాడని 23 వేల కోట్లకు కేంద్రాన్ని ఒప్పించి గడువు పెంచేలా చూశాం

  • ప్రతి ఇంటికీ కుళాయిని తెచ్చి చూపిస్తాం

  • ధన్యవాదాల తీర్మానంపై మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

అమరావతి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి) : గత వైసీపీ ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన అరాచక, అసమర్థ, అవినీతి పాలన కూటమి ప్రభుత్వానికి పెను సవాలుగా మారిందని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా అనుభవంతో అన్నింటినీ అధిగమిస్తున్నామని, ప్రతి హామీనీ నిలబెట్టుకుంటూ, సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా శుక్రవారం అసెంబ్లీలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. గవర్నర్‌ ప్రసంగం సమయంలో వైసీపీ సభ్యులు వెల్‌లోకి వచ్చి గొడవ చేయడం బాధాకరమన్నారు. ప్రతిష్ఠాత్మకమైన సుప్రీంకోర్టు న్యాయమూర్తి బాధ్యతలు నిర్వహించిన గవర్నర్‌ ఎదుట వారి చేష్టలు హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేయడంలా ఉన్నాయని మండిపడ్డారు. మరో మూడు నెలల్లో రెండేళ్ల పాలనను ఎన్డీయే పూర్తి చేసుకుంటున్నదంటూ రాష్ట్ర ప్రజలకు, ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ‘‘నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా..?’ అని కవి శేషేంద్ర అన్నారు. ఈ వాక్యానికి నిలువెత్తు ప్రతిరూపం ప్రధాని మోదీ. ఆయన సహకారంతో రాష్ట్రం ముందుకుపోతోంది. గవర్నర్‌ ప్రసంగం ప్రేరణను అందించింది. రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసింది. ‘వికసిత్‌ భారత్‌’లో భాగంగా ‘వికసిత్‌ ఆంధ్రప్రదేశ్‌’ను సాధించాలనే గవర్నర్‌ పిలుపు అందరికీ స్ఫూర్తిదాయకం కావాలి. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు సమాజంలోని చివరి వ్యక్తి వరకూ చేరాలని మాజీ ప్రధాని వాజపేయి ఆకాంక్షించారు. ఇదే స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్‌ను రూ.3 వేల నుంచి రూ.6 వేలకు పెంచింది. సామాజిక పెన్షన్లను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రూ.2,738 కోట్లను పెన్షన్ల రూపంలో అందిస్తున్నాం. రూ.10 వేల కోట్ల నిధులను ‘తల్లికి వందనం’ కోసం అందిస్తున్నాం. మెగా డీఎస్సీ ద్వారా 16 వేల టీచర్‌ ఉద్యోగాలను భర్తీ చేశాం. అన్నం పెట్టే రైతాంగాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. వారి నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లించాల్సిన రూ.1674 కోట్లను ఎగ్గొట్టింది. ఆ బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించింది’’ అని పవన్‌ కల్యాణ్‌ వివరించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..


మీ వాడిగా చెబుతున్నా..

’కౌలు రైతుల కష్టాలు, కన్నీళ్లు తెలిసివాడిగా అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నా. మీ కోసం ఈ ప్రభుత్వం నిరంతరం పని చేస్తుందని హామీ ఇస్తున్నా. ఉమ్మడి ఏపీలో మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా ప్రభుత్వ ఉద్యోగుల నిరాశానిస్పృహలు నేను అర్థం చేసుకోగలను. అందువల్లే పంచాయతీ రాజ్‌ శాఖ బాధ్యతలు తీసుకోగానే 10 వేల మందికి పైగా ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాను. 77 మందికి తొలిసారి జిల్లా పరిషత్‌ సీఈవోలుగా పదోన్నతులు కల్పించాను. సంస్కరణలో భాగంగా 77 డీడీవో కార్యాలయాలను ప్రారంభించాం.’’

‘జల జీవన్‌’కు మళ్లీ జీవం పోశాం

‘‘రాష్ట్రంలో రికార్డుస్థాయిలో రోడ్ల నిర్మాణం చేపడుతున్నాం. అంధుల మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌, ఉదయగిరి నియోజకవర్గ స్కూల్‌ పిల్లలు తమ గ్రామాలకు రోడ్డు వేయమని కోరగా, అప్పటికప్పుడు అనుమతులు ఇచ్చాను. జాతీయ ఉపాధి హామీ నిధులతో ‘అడవి తల్లి బాట’ పేరుతో 625 గిరిజన గ్రామాలను అనుసంధానం చేస్తూ, రూ.1,005 కోట్లతో 1,069 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం ప్రారంభించి.. సగానికిపైగా పూర్తి చేశాం. కొన్ని రోడ్లకు గంటల వ్యవధిలోనే అనుమతులు ఇచ్చాను. ప్రతి ఇంటికీ కుళాయి పథకం కోసం జల్‌ జీవన్‌ మిషన్‌ కింద 2019-24 మధ్య కాలంలో ఏపీకి రూ.27 వేల కోట్ల మేర కేటాయించగా, గత ప్రభుత్వం రూ.4 వేల కోట్ల విలువైన పనులు మాత్రమే చేసింది. పైపులైన్‌ వేయడం తప్ప ఒక్క గ్రామానికీ నీరు ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర నాయకత్వాన్ని అడిగి... అప్పట్లో వినియోగించుకోని రూ.23 వేల కోట్లు ఖర్చు చేసేందుకు గడువును పొడిగించుకున్నాం. ప్రతి ఇంటికీ కుళాయి అందించి తీరుతాం.ఈ పథకం కింద రూ.1,242 కోట్లతో ఉద్ధానం, డోన్‌, పులివెందుల బహుళ గ్రామ ప్రాజెక్టులను పూర్తి చేయనున్నాం. చిత్తూరు, పల్నాడు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో రూ.7,910 కోట్లతో వచ్చే రెండేళ్లలో నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టనున్నాం.’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తన ప్రసంగంలో ఆయన మాజీ ప్రధాని వాజపేయి, మహాకవి శేషేంద్ర సహా పలువురు ప్రముఖులు, కవుల సూక్తులను, కవితా చరణాలను ఉటంకించారు.

గవర్నర్‌ను కలిసిన పవన్‌..

గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం సాయంత్రం లోక్‌ భవన్‌కు వెళ్లిన పవన్‌కు అధికారులు స్వాగతం పలికారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై వారిద్దరు చర్చించుకున్నారని తెలిసింది.

Updated Date - Feb 14 , 2026 | 02:47 AM