Share News

శ్రీశైలం, సాగర్‌లలో 150 టీఎంసీలు క్యారీఓవర్‌గా ఉంచాల్సిందే

ABN , Publish Date - Jul 23 , 2026 | 05:03 AM

ఆకస్మికంగా కరువు ఛాయలు కమ్ముకున్నప్పుడు ఆరుతడి పంటలు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో 150 టీఎంసీలను క్యారీఓవర్‌గా ఉంచాల్సిందేనని..

శ్రీశైలం, సాగర్‌లలో 150 టీఎంసీలు క్యారీఓవర్‌గా ఉంచాల్సిందే

  • ప్రాజెక్టులకు కేటాయించేందుకు వీల్లేదు.. దుర్భిక్షం ఎదురైతే అవసరం

  • 80 టీఎంసీలు చాలన్న తెలంగాణ వాదన సరికాదు

  • పోతిరెడ్డిపాడు కాలువ విస్తరణ కుదించాల్సిన అవసరం లేదు

  • తెలంగాణ వాదనలన్నీ ఒట్టిమాటలే.. ట్రైబ్యునల్‌ ముందు ఏపీ వాదన

అమరావతి, జూలై 22(ఆంధ్రజ్యోతి): ఆకస్మికంగా కరువు ఛాయలు కమ్ముకున్నప్పుడు ఆరుతడి పంటలు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో 150 టీఎంసీలను క్యారీఓవర్‌గా ఉంచాల్సిందేనని బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌-2 ముందు ఆంధ్రప్రదేశ్‌ బలమైన వాదనలు వినిపించింది. బుధవారం ఢిల్లీలో ట్రైబ్యునల్‌ ముందు ఆంధ్రప్రదేశ్‌ తరఫున జైదీప్ గుప్తా, ఉమాపతి, ప్రదీప్ కుమార్‌ కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులలోని క్యారీఓవర్‌ జలాలపై వాదనలు వినిపించారు. క్వారీఓవర్‌ కింద 150 టీఎంసీలు కేటాయించాల్సిన అవసరంలేదని, 80 టీఎంసీలు చాలని తెలంగాణ చేస్తున్న వాదన మూర్ఖత్వమేనని వాదించారు. కృష్ణా నదీ జల వివాదాల మొదటి, రెండో ట్రైబ్యునల్‌ (కేడబ్ల్యుటీఏ) క్యారీఓవర్‌ ఉండాల్సిందేనని ఆదేశాలు ఇచ్చాయని జైదీప్ గుప్తా గుర్తు చేశారు. ఈ ఆదేశాలకు విరుద్ధంగా 80 టీఎంసీలు ఉంచితే చాలునని తెలంగాణ చెప్పడం న్యాయవిరుద్ధమని అన్నారు. క్యారీఓవర్‌ను ప్రాజెక్టులకు కేటాయించేందుకు వీల్లేదని ఏపీ పేర్కొంది. ఇక పోతిరెడ్డిపాడు కాలువ విస్తరణ కుదించాల్సిన అవసరం లేదని ఏపీ వాదించింది. కడప జిల్లాలోని చిన్నముక్కలపల్లి వద్ద తెలుగుగంగ కాలువ ద్వారా కృష్ణా జలాలను చెన్నైకు తరలిస్తారని ఏపీ పేర్కొంది. తెలంగాణ చేస్తున్న వాదనలన్నీ ఒట్టిమాటలేనని వాదించింది. పట్టిసీమ ద్వారా కృష్ణా నదికి గోదావరి జలాలను తరలించడంపై గురువారం వాదనలు జరగనున్నాయి.

Updated Date - Jul 23 , 2026 | 05:06 AM