Share News

డిగ్రీ కనీస ఫీజు 13 వేలు

ABN , Publish Date - Aug 06 , 2026 | 05:05 AM

డిగ్రీ కోర్సుల కనీస ఫీజును పెంచాలని విద్యా శాఖ ప్రతిపాదించింది. డిగ్రీలో అన్ని గ్రూపుల ఫీజులను కనీసం 17.5 శాతం పెంచేలా చర్యలు ప్రారంభించింది.

డిగ్రీ కనీస ఫీజు 13 వేలు

  • అన్ని గ్రూపులకు 17.5శాతం పెంపు ప్రతిపాదన

  • బీకాం రూ.14 వేలు.. బీఎస్సీ 17,500

  • బీసీఏ, బీబీఏ, బీబీఎం 21 వేలు

  • బీఫార్మసీ, ఫార్మా-డి 45 వేలు

  • అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం

  • 11 వరకు రిజిస్ర్టేషన్లకు గడువు

అమరావతి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): డిగ్రీ కోర్సుల కనీస ఫీజును పెంచాలని విద్యా శాఖ ప్రతిపాదించింది. డిగ్రీలో అన్ని గ్రూపుల ఫీజులను కనీసం 17.5 శాతం పెంచేలా చర్యలు ప్రారంభించింది. ఉన్నత విద్యా కోర్సుల తుది ఫీజుల ప్రక్రియ ఇటీవల ప్రారంభమైంది. ఫీజుల ఖరారుకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున ఈలోగా కౌన్సెలింగ్‌ కోసం కనీస ఫీజును పెంచారు. ఇటీవల ఇంజనీరింగ్‌ కోర్సుల కనీస ఫీజులను కూడా ప్రభుత్వం పెంచింది. ఈ తాత్కాలిక ఫీజులతో కౌన్సెలింగ్‌ పూర్తి చేసి, అనంతరం నిర్ణయించే తుది ఫీజులను ఈ అడ్మిషన్లకు అమలు చేస్తారు. కొత్త ప్రతిపాదనల ప్రకారం బీఏ ఫీజు రూ.11 వేల నుంచి రూ.13 వేలకు పెరిగింది. బీకాం ఫీజు రూ.12 వేల నుంచి రూ.14 వేలకు పెరిగింది. బీఎస్సీకి రూ.17,500, బీబీఏ, బీబీఎం ఫీజు రూ.21 వేలు, బీసీఏకు రూ.21 వేలుగా ప్రతిపాదించారు. ఒకేషనల్‌ కోర్సు ఫీజు రూ.17,500, బీహెచ్‌ఎం/బీహెచ్‌ఎంసీటీకి రూ.35 వేలుగా ప్రతిపాదించారు. అలాగే లా కోర్సుల్లో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీకు రూ.16 వేలు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీకు రూ.15 వేలు, ఎంఎల్‌/ఎల్‌ఎల్‌ఎం ఫీజు రూ.22 వేలుగా ప్రతిపాదన చేశారు. బీఫార్మసీ, ఫార్మా-డి ఫీజు రూ.45 వేలుగా ఉంటుంది. ఈ ప్రతిపాదనలకు మంత్రి లోకేశ్‌ ఆమోదం లభించాల్సి ఉంది. ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారు. అనంతరం ఉన్నత విద్యాశాఖ ఫీజులపై జీవోలు జారీ చేస్తుంది. డిగ్రీ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైనందున వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.


కౌన్సెలింగ్‌ ప్రారంభం

డిగ్రీ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌కు ఉన్నత విద్యా శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. బుధవారం విద్యార్థుల రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ నెల 11 వరకు విద్యార్థులు కామన్‌ అడ్మిషన్స్‌ పోర్టల్‌లో రిజిస్ర్టేషన్‌ చేసుకోవచ్చు. 20 వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. 15 నుంచి 19 వరకు విద్యార్థులు ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలి. గతేడాది తరహాలోనే ఆన్‌లైన్‌లో, కాలేజీ లాగిన్‌ ద్వారా రెండు రూపాల్లో విద్యార్థులు ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చు. కాలేజీ లాగిన్‌లో ఆప్షన్లు పెట్టుకుంటే అదే మొదటి ప్రాధాన్యం అవుతుంది. 20న ఆప్షన్ల మార్పునకు అవకాశం ఉంటుంది. 26న సీట్లు కేటాయిస్తారు. 27 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. 27 నుంచి 29 వరకు విద్యార్థులు తమ అడ్మిషన్లను ధ్రువీకరించుకోవాలి.

Updated Date - Aug 06 , 2026 | 05:06 AM