‘ఎస్సీ హోదా రద్దు’ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలి
ABN , Publish Date - Apr 08 , 2026 | 04:16 AM
షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారితే... ఎస్సీ హోదా తక్షణమే పూర్తిగా రద్దవుతుందనే 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని...
వేరే మతంలోకి వెళ్లిన వారికి షెడ్యూల్డ్ కుల హోదా ఉండదని చెప్పడం దురదృష్టకరం: మంద కృష్ణ మాదిగ
గుంటూరు(తూర్పు), ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): షెడ్యూల్ కులాలకు చెందిన వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారితే... ఎస్సీ హోదా తక్షణమే పూర్తిగా రద్దవుతుందనే 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కోరారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ చొరవ చూపాలన్నారు. గుంటూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దళితులు క్రైస్తవం, ఇస్లాం మతాలకు మారితే ఎస్సీ హోదా ఇవ్వకపోవడం స్పష్టమైన వివక్ష అని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛ హక్కు ఉందని, ఈ ఆర్డర్ దాన్ని హరిస్తోందని పేర్కొన్నారు. ఆర్టికల్ 14, 15లో పేర్కొన్న సమానత్వ సూత్రాలకు కూడా విరుద్ధమని అభిప్రాయపడ్డారు. లేదంటే ఈ అధికరణలను రద్దు చేసిన తర్వాతే.. ఆ ఉత్తర్వులను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 341 ద్వారా ఎస్సీలను, 342 ద్వారా ఎస్టీలను గుర్తించినప్పటికీ.. అమలులో మాత్రం వివక్ష కొనసాగుతోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలకు బీసీ, ఈడబ్ల్యూఎస్ కోటాల్లో అవకాశాలు కల్పిస్తున్నారని గుర్తుచేసుకున్నారు. ఈశాన్య రాష్ర్టాల్లో అధిక శాతం ఎస్టీలు క్రైస్తవులేనని, అయినప్పటికీ వారి హోదా ఎక్కడా రద్దు కాలేదని చెప్పారు.