మళ్లీ అదే బరి తెగింపు!
ABN , Publish Date - Jul 01 , 2026 | 05:10 AM
దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణ కీలక దశకు చేరుకోవడంతో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మరింత బరి తెగించేశారు. సాక్షులను బెదిరించి, భయపెట్టిన కేసులో ఆయన బెయిల్ రద్దయి..
అనంతబాబు కోసం రంగంలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే
సుప్రీం ఆదేశాలతో అనంతబాబుపై విచారణ కీలక దశకు
దీంతో బేరసారాల జోరు పెంచిన వైనం
హత్యకు వాడిన కారు ఓనర్ కుటుంబానికి ఆఫర్
మధ్యవర్తుల సాక్షులుగా 12 మంది చిరుద్యోగులు
వారందరినీ బెదిరించి లొంగదీసుకునే యత్నం
దళిత డ్రైవర్ హత్య కేసులో సాక్షులపై ఒత్తిళ్లు
తొలుత బేరాలు.. ఆపై బెదిరింపులు
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణ కీలక దశకు చేరుకోవడంతో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మరింత బరి తెగించేశారు. సాక్షులను బెదిరించి, భయపెట్టిన కేసులో ఆయన బెయిల్ రద్దయి రాజమండ్రి సెంట్రల్‌జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నప్పటికీ, ఏమాత్రం తగ్గడం లేదు. కేసులో కీలకమైన సాక్షులను తన మనుషుల ద్వారా బెదిరించే చర్యలకు పాల్పడుతున్నారని తెలిసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేసులో విచారణ ప్రారంభం కావడంతో.. సాక్షులను లోబర్చుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆయన తరఫున సాక్షులను బెదిరించే పనిని ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ వైసీపీ మాజీ ఎమ్మెల్యే తలకెత్తుకున్నారని తెలిసింది.. డ్రైవర్ హత్యకు, ఆ తర్వాత మృతదేహాన్ని డోర్ డెలివరీ చేయడానికి అనంతబాబు వినియోగించిన కారు యజమాని ఈ కేసులో కీలక సాక్షి. దీంతో ఆ కుటుంబాన్ని సదరు నేత ప్రలోభాలకు గురి చేస్తున్నారు. అలాగే ఈ కేసులో మధ్యవర్తుల సాక్షులుగా 12 మంది చిరు ప్రభుత్వ ఉద్యోగులున్నారు. వీరిలో తొమ్మిది మంది వీఆర్వోలు, ముగ్గురు వార్డు రెవెన్యూ కార్యదర్శులు. వీరిని సైతం అనంతబాబుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకుండా ఉండేలా బెదిరింపులు, ప్రలో భాలకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం మారాక ఇబ్బందులు పడతారంటూ పరోక్షంగా బెదిరిస్తున్నారు.
ఎక్కడికక్కడ అరాచకం..
కేసు విచారణలో జాప్యాన్ని సుప్రీంకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో తీవ్రంగా తప్పుబట్టింది. ఈ ఏడాది నవంబరు 18 లోపు కేసు విచారణను పూర్తి చేయాలని దిగువ కోర్టును ఆదేశించింది. ఈ నేపథ్యంలో మే 20నుంచి సుబ్రహ్మణ్యం హత్య కేసులో విచారణను రాజమహేంద్రవరం జిల్లా కోర్టు వేగవంతం చేసింది. కేసులో మొత్తం 87మంది సాక్షులుండగా, వారందరినీ దఫదఫాలుగా విచారణకు పిలుస్తోంది. ఇప్పటివరకు 12 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది. మిగిలిన సాక్షులను జూలై 9, 10, 11 తేదీల్లో విచారించనుంది. ఈ నేపథ్యంలో సాక్షులను దారికి తెచ్చుకోకపోతే శిక్ష ఖరారై శాశ్వతంగా జైలు ఖాయం అనే ఆందోళనలో అనంతబాబు ఉన్నారని తెలిసింది. 2022లో సుబ్రహ్మణ్యం హత్య జరిగినప్పుడు డ్రైవర్ ఇంటికి అనంతబాబు ఐ 20 కారులో వచ్చారు. అదే కారులో డ్రైవర్‌ను అనంతబాబు తీసుకువెళ్లి హత్య చేశాడు. తిరిగి అదే కారులో మృతదేహాన్ని ఉంచి తన అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు. అక్కడ కారును పార్కు చేసి తన భార్యను ఇంట్లో వదిలేశారు. తిరిగి అదే కారులో మృతుడి ఇంటికి వెళ్లి డ్రైవర్ మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశాడు. సుబ్రహ్మణ్యం కుటుంబీకులు ఎదురుతిరగడంతో అనంతబాబు కారు అక్కడే వదిలేసి పారి పోయాడు. ఆ కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు హత్య కేసులో కారు యజమాని అయిన మహిళను కీలక సాక్షిగా చేర్చారు. త్వరలో ఆమె సాక్ష్యం చెప్పాల్సి రావడంతో ఆమెను, ఆమె భర్తను దారికి తెచ్చుకునేందుకు సదరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రలోభాలకు దిగారు. ఈయనకు అనంతబాబుతో బంధుత్వం కలిగిన ఓ పార్టీ నేత కూడా తోడయ్యారు. వీరిద్దరూ సదరు సాక్షిని దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుండడంతో ఆ కుటుంబం బెంబే లెత్తిపోతోంది. అయితే విషయం పోలీసులకు తెలియడంతో సాక్షులకు రక్షణ కల్పించారు. అయినా వాట్సాప్ కాల్స్ ద్వారా టచ్‌లోకి వెళ్తూ వ్యతిరేక సాక్ష్యం చెప్పకుండా ఉండేందుకు భారీ ఆఫర్ ప్రకటించారు. సాక్షులను బెదిరించిన కేసులో అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేయడానికి తిరుగుతుంటే, ఆయనను అప్పట్లో ఆ వైసీపీ మాజీ ఎమ్మెల్యే దాచిపెట్టారు.
మధ్యవర్తులనూ వదలని వైనం
హత్య కేసులో 50వ సాక్షి నుంచి 79వ సాక్షి వరకు 12 మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. ఇప్పుడు వీరిని సైతం సదరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే బెదిరింపులకు గురిచేస్తున్నారు. వీరికి నగదు ఆఫర్ ఇస్తున్నారు. ఈ కేసులో తమకు ఏం తెలియదని సాక్ష్యం చెప్పాలని ఒత్తిడి తెస్తున్నారు. వచ్చే వైసీపీ ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడతారంటూ బెదిరిస్తున్నారు. వాస్తవానికి హత్య కేసులో మధ్యవర్తుల సాక్ష్యం చాలా కీలకం. ఎందుకంటే నేరస్థలి నివేదిక రాసేట ప్పుడు, అక్కడ దొరికిన ఆధారాల నమోదు, శవపంచనామా రిపోర్టు, నేరానికి సంబంధించి సీసీ కెమెరాల పరిశీలనప్పుడు, నిందితుడి ఒప్పుకోలు స్టేట్‌మెంట్.. ఇలా ప్రతి కీలక దశలో ప్రభుత్వ ఉద్యోగులుగా అప్పట్లో వీరంతా విధి నిర్వహణలో ఉన్నారు. దీంతో కేసు విచారణలో వీరందరి సాక్ష్యం చాలా కీలకం కావడంతో వారిని బెదిరించి దారికితెచ్చుకునేందుకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారు.