క్రైం రేటు 14.1శాతం తగ్గింది
ABN , Publish Date - Jun 17 , 2026 | 04:27 AM
గతంతో పోలిస్తే ఈ రెండేళ్లలో రాష్ట్రంలో క్రైమ్ రేట్ 14.1 శాతం తగ్గిందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత చెప్పారు.
మహిళలపై నేరాలు 6.9 శాతం తగ్గాయి
రాష్ట్రంలో గంజాయి సాగు లేకుండా చేశాం
సైబర్ నేరాల కట్టడికి వార్ రూం: అనిత
అమరావతి, జూన్ 16(ఆంధ్రజ్యోతి): గతంతో పోలిస్తే ఈ రెండేళ్లలో రాష్ట్రంలో క్రైమ్ రేట్ 14.1 శాతం తగ్గిందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత చెప్పారు. మహిళలపై నేరాల్లో 6.9 శాతం తగ్గుదల నమోదైందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. సాంకేతిక పరిజ్ఞానం, సమర్థవంతమైన నిఘా వ్యవస్థ, శాస్త్రీయ దర్యాప్తు పద్ధతులు, అంతర్‌శాఖ సమన్వయాన్ని మెరుగుపర్చడం ద్వారా రాష్ట్రంలో నేరాల శాతం తగ్గిందన్నారు. అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు పెట్టాలని టార్గెట్‌గా పెట్టుకున్నామన్నారు. మంగళవారం అమరావతి సచివాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రయోజనాలకు పరిమితమైన వ్యవస్థలను ప్రజా సేవా దృక్పథంతో పునర్నిర్మిస్తూ, ప్రజలకు జవాబుదారీగా పనిచేసే పరిపాలనా వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం నెలకొల్పిందన్నారు. మహిళల రక్షణ కోసం రూపొందించిన శక్తి యాప్‌ను కోటీ 50 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారని తెలిపారు.
డ్రగ్స్.. గంజాయి నిర్మూలనలో..
గంజాయి, మాదక ద్రవ్యాల సమస్యపై ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఇతర రాష్ట్రాలు మన ఈగల్ బృందాన్ని మోడల్‌గా తీసుకుని పని చేస్తున్నాయన్నారు. 56,674 గంజాయి కేసుల నమోదు, 2366 మందిపై చట్టపరమైన చర్యలు చేపట్టామని, రూ.4 కోట్లకుపైగా విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
సైబర్ వార్‌రూం ఏర్పాటుకు నిర్ణయం
సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు వార్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సైబర్ వార్ రూమ్స్ ఏర్పాటు, బ్యాంకులు, టెలికాం సంస్థలతో సమన్వయం, 1930 సైబర్ హెల్ప్‌లైన్, ఆన్‌లైన్ మోసాలపై రియల్‌టైమ్ స్పందన వంటి చర్యల ఫలితంగా సుమారు రూ.247 కోట్ల ప్రజల సొమ్ము మోసగాళ్లబారినపడకుండా చేశామన్నారు. ఫోరెన్సిక్ వ్యవస్థను బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. 6 వేల మందికిపైగా పోలీసు నియామకాలు చేపట్టామని, పదోన్నతులు కల్పించామని, కానిస్టేబుల్ శిక్షణార్థులకు స్టైఫండ్ పెంచామని మంత్రి చెప్పారు. వచ్చే జాబ్ క్యాలెండర్‌లో 2700 పోస్టులను భర్తీ చేస్తామన్నారు. విపత్తుల నిర్వహణలో దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు.
అమర్నాథ్ విజ్ఞత లేకుండా మాట్లాడారు
వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలపై విలేకరుల అనితను ప్రశ్నించగా.. మహిళలను గౌరవించడం మన సంప్రదాయం అని, ఆ విజ్ఞత కూడా లేకుండా మాట్లాడారని, విజ్ఞత లేని వాళ్ల గురించి మాట్లాడి తనను తాను తగ్గించుకోదల్చుకోలేదన్నారు. మహిళల్ని కించపరిచేలా మాట్లాడుతున్న వారికి మరో వేదికపై సమాధానం చెబుతానన్నారు.