‘సోషల్’ గీత దాటితే వేటే
ABN , Publish Date - Apr 15 , 2026 | 04:52 AM
సోషల్ మీడియాలో హద్దులు దాటి పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా హెచ్చరించారు. కొందరు సైకో నెటిజెన్లు ఇష్టారాజ్యంగా బూతులతో రెచ్చిపోతుంటే...
నకిలీ ఖాతాలతో వదంతులు వ్యాప్తి చేస్తే తప్పించుకోలేరు
ఏఐ విశ్లేషణ, ఫోరెన్సిక్‌లతో గుర్తిస్తామని డీజీపీ హెచ్చరిక
1,549 కేసుల్లో 1,344 మంది అరెస్టు
వదంతులు వ్యాప్తి చేస్తే తప్పించుకోలేరు: డీజీపీ
అమరావతి, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియాలో హద్దులు దాటి పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా హెచ్చరించారు. కొందరు సైకో నెటిజెన్లు ఇష్టారాజ్యంగా బూతులతో రెచ్చిపోతుంటే, మరికొందరు వదంతులు వ్యాప్తి చేయడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. నకిలీ ఖాతాలతో వదంతులు ప్రచారం చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎక్కడ దాక్కున్నా అరెస్టు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. అసభ్య పదజాలం వాడటం.. సమాజంలో వర్గాల మధ్య చిచ్చు రేపేలా పోస్టులు పెట్టడం.. వంటి చర్యలకు పాల్పడిన 1,344 మందిని అరెస్టు చేసి, 1549 కేసులు పెట్టామని, 4,529 అభ్యంతరకర పోస్టులను తొలగించామని వివరించారు. సోషల్ మీడియా ఖాతాల్లో తప్పుడు ప్రచారాలు, వదంతులపై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంభిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఐటీ యాక్ట్‌తో పాటు బీఎన్‌ఎస్ కింద కేసులు నమోదు చేస్తున్నామని, నకిలీ ఖాతాల్లో పోస్టులు పెట్టి తప్పించుకు తిరిగే వారిపై ‘ట్రయల్ ఇన్ అబ్సెంటియా’ విధానాన్ని అమలు చేస్తామని తెలిపారు. సోషల్ ట్రబుల్ మాంగర్స్‌పై ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థ ద్వారా నిఘా పెట్టామని, ఏఐ విశ్లేషణ, రియల్ టైమ్ పర్యవేక్షణ, డిజిటల్ ఫోరెన్సిక్ విధానాలతో గుర్తిస్తున్నట్లు డీజీపీ వివరించారు.