1న గుంటూరులో భారీ ర్యాలీ : ఏపీ సీపీఎస్ఈఏ
ABN , Publish Date - Aug 24 , 2026 | 05:59 AM
పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా సెప్టెంబరు 1న ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరులో భారీ నిరసన చేపట్టాలని..
విజయవాడ (గాంధీనగర్), ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా సెప్టెంబరు 1న ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరులో భారీ నిరసన చేపట్టాలని నిర్ణయించినట్టు సంఘ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాజీ పఠాన్, కరిమి రాజేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబరు 1 ఉదయం 10 గంటలకు గుంటూరు కలెక్టరేట్ నుంచి వేంకటేశ్వర మందిరం వరకు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి సమర శంఖం పూరిస్తామని పేర్కొన్నారు. రెండు దశాబ్దాలు నష్టపోయామని, ఇక తమ సహనం నశించిందని, ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల ముందే ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకుంటే భారీమూల్యం చెల్లించక తప్పదని తెలిపారు.
ఏపీ అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ మద్దతు
సీపీఎస్ ఉద్యోగులు సెప్టెంబరు 1న గుంటూరులో తలపెట్టిన నిరసన ర్యాలీకి ఏపీ అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ మద్దతు ప్రకటించింది. జేఏసీ చైర్మన్ భూపతిరాజు రవీంద్రరాజు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో రెవెన్యూ ఉద్యోగులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.