Share News

ఒకే రోజు 7 కేసులు

ABN , Publish Date - Jul 22 , 2026 | 04:57 AM

రాష్ట్రంలో ఒకే రోజు ఏడు కొవిడ్‌ కేసులు బయటపడ్డాయి. గుంటూరు జిల్లాలో 4, తూర్పుగోదావరిలో 2, బాపట్లలో ఒక కేసు వెలుగు చూసినట్టు ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది.

ఒకే రోజు 7 కేసులు

  • గుంటూరులో 4, తూర్పున 2, బాపట్లలో 1

  • మొత్తం 26కి చేరిన కరోనా పాజిటివ్‌లు

  • అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ

  • 17 బోధనాస్పత్రుల్లో 255 పడకలు సిద్ధం

  • అందుబాటులో 10 లక్షల మాస్క్‌లు

  • రెమ్‌డెసివిర్‌ కొనుగోలుకు అనుమతి

అమరావతి/గుంటూరు మెడికల్‌/బాపట్ల, జూలై 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఒకే రోజు ఏడు కొవిడ్‌ కేసులు బయటపడ్డాయి. గుంటూరు జిల్లాలో 4, తూర్పుగోదావరిలో 2, బాపట్లలో ఒక కేసు వెలుగు చూసినట్టు ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. కొత్తగా నమోదైన ఈ ఏడు కేసులతో కలిపి రాష్ట్రంలో నమోదైన కొవిడ్‌ కేసుల సంఖ్య 26కి చేరింది. ప్రస్తుతం పది మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా... తొమ్మిది మంది హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. ముగ్గురు కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకూ నలుగురు మరణించారు. కాగా, రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యలను వేగవంతం చేసింది. కేసుల సంఖ్యపై ఎప్పటికప్పుడు నిఘా కొనసాగిస్తూనే... అనుమానిత లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు నిర్వహిస్తోంది. అవసరమైన వారికి తక్షణ చికిత్స అందించేలా ప్రభుత్వాస్పత్రులను పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తోంది. వైద్య పరీక్షల కిట్లు, అత్యవసర మందులు, ప్రత్యేక పడకలు, రక్షణ సామగ్రి అందుబాటులో ఉంచేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పని చేస్తున్నాయి. రాష్ట్రంలోని 17 బోధనాస్పత్రుల్లో మొత్తం 255 ప్రత్యేక కొవిడ్‌ పడకలను సిద్ధం చేశారు. సెకండరీ ఆస్పత్రుల్లోనూ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక పడకలు కేటాయించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ఆరోగ్యశాఖ కార్యదర్శి వీరపాండియన్‌ మంగళవారం కూడా డీఎ్‌సహెచ్‌ డైరెక్టర్‌ చక్రధర్‌బాబు, డీఎంఈ డాక్టర్‌ విష్ణువర్థన్‌, ప్రజారోగ్య శాఖ, ఏపీఎంఎస్ఐడీసీ తదితర విభాగాల అధికారులతో వర్చువల్‌ విధానంలో సమీక్ష నిర్వహించారు. కొవిడ్‌ను సమర్థవంతగా ఎదుర్కొనేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని దశల వారీగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. బోధనాస్పత్రుల్లో 6,77,939 ట్రిపుల్‌ లేయర్‌ మాస్కులు, సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌లో 5.26 లక్షల మాస్కులు అందుబాటులో ఉన్నాయన్నారు. వీటితో పాటు 58,790 ఎన్‌-95 మాస్కులు, 4436 పీపీఈ కిట్లు, 2572 శానిటైజర్లు అందుబాటులో ఉంచామన్నారు.


అత్యవసర మందులు స్థానికంగానే కొనుగోలు..

రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్లు, టెస్టింగ్‌ కిట్లు, శానిటైజర్లు తదితర అత్యవసర సామగ్రిని వెంటనే కొనుగోలు చేసేందుకు ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు లోకల్‌ పర్చేజ్‌ అధికారాలు కల్పిస్తూ డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) డాక్టర్‌ విష్ణువర్థన్‌ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రస్థాయి సరఫరా కోసం వేచి చూడకుండా అవసరమైన సామగ్రిని స్థానికంగానే సమకూర్చుకోవాలని సూచించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 51,700 ఆర్‌ఎన్‌ఏ ఎక్స్‌ట్రాక్షన్‌ కిట్లు, 27,552 ఆర్టీపీసీఆర్‌ కిట్లతో పాటు మరికొన్ని పరికరాల కొనుగోళ్లకు ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎంఎస్ఐడీసీ) ఆర్డర్లు జారీ చేసింది.

Updated Date - Jul 22 , 2026 | 04:58 AM