Share News

ఆఖరి రోజూ అదే తంతు.. మండలిలో వైసీపీ రచ్చ

ABN , Publish Date - Aug 21 , 2026 | 05:16 AM

మెగా డీఎస్సీ-2025పై చర్చించాలని శాసన మండలిలో వైసీపీ సభ్యులు వరుసగా నాలుగో రోజైన గురువారం ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్‌ తిరస్కరించారు.

ఆఖరి రోజూ అదే తంతు.. మండలిలో వైసీపీ రచ్చ

  • డీఎస్సీపై చర్చకు డిమాండ్‌.. చైర్మన్‌ ముఖానికి అడ్డుగా ప్లకార్డులు

అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): మెగా డీఎస్సీ-2025పై చర్చించాలని శాసన మండలిలో వైసీపీ సభ్యులు వరుసగా నాలుగో రోజైన గురువారం ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్‌ తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు డీఎస్సీపై చర్చించాలని పట్టుబట్టారు. నల్ల కండువాలు ధరించి సభకు వచ్చిన వైసీపీ సభ్యులు చైర్మన్‌ పోడియం వద్ద నిరసన తెలిపారు. ప్రశ్నోత్తరాలు, ప్రభుత్వ బిల్లులు ప్రవేశపెట్టే సమయంలోనూ టేబుల్‌ను చరుస్తూ, ప్లకార్డులను చైర్మన్‌ ముఖానికి అడ్డుగా పెట్టి, చైర్మన్‌ చెవి దగ్గరగా.. పెద్దగా నినాదాలు ఇచ్చారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ నినాదాలు హోరెత్తించారు. సభ్యులు పోడియం దిగి, తమ స్థానాల్లో కూర్చోవాలని చైర్మన్‌ పదేపదే చెప్పినా.. ఆందోళన కొనసాగించారు. దీంతో కొంతసేపు సభను వాయిదా వేయగా, విపక్ష సభ్యులు పోడియం ముందు బైఠాయించి నినాదాలు చేశారు. సభ తిరిగి ప్రారంభమయ్యాక, ఎమ్మెల్సీగా రమాదేవి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ప్రభుత్వ బిల్లులను ప్రవేశపెట్టడానికి చైర్మన్‌ అనుమతివ్వగా, మంత్రులు బిల్లులను ప్రవేశపెడుతుండగానే వైసీపీ సభ్యులు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ, పోడియంను చుట్టుముట్టారు. దీంతో సభను వాయిదా వేశారు. ఆ తర్వాత మంత్రులు బిల్లులను ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో ఆమోదం పొందిన12 బిల్లులకు మండలిలోనూ ఆమోదం లభించింది.


మండలిలో సైడ్‌లైట్స్‌

  • మండలి సమావేశం ప్రారంభానికి ముందు మంత్రి లోకేశ్‌ ఎమ్మెల్సీలతో సరదాగా సంభాషిస్తూ.. వర్ల రామయ్యను ఉద్దేశించి.. మా సౌండ్‌ బాక్స్‌ ఏరీ అని అడిగారు.

  • మిమ్మల్ని చూసి అందరూ స్లిమ్‌ అయిపోవాలనుకుంటున్నారని మంత్రి లోకేశ్‌ను ఉద్ధేశించి చైర్మన్‌ మోషేన్‌రాజు చమత్కరించారు.

  • విపక్ష సభ్యుల రచ్చతో మండలిని కొద్దిపేపు వాయిదా వేయగా, పోడియం ముందు కూర్చున్న వైసీపీ సభ్యులు నినాదాలు చేస్తూ సెల్ఫీలు తీసుకుని, బయటకు వెళ్లారు. దీంతో ఫొటో సెషన్‌ అయిపోయిందా అంటూ వర్ల రామయ్య సెటైర్‌ వేశారు.

  • మండలిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు చైర్మన్‌ ప్రకటించాక.. వైసీపీ సభ్యులు జై జగన్‌ అంటూ నినాదాలు చేస్తుండగా... ‘మీ ఎమ్మెల్యేలను ఈసారైనా అసెంబ్లీకి రమ్మనండి’ అని లోకేశ్‌ అన్నారు.

Updated Date - Aug 21 , 2026 | 05:17 AM