Share News

మండలిలో మూడో రోజూ అదే తీరు

ABN , Publish Date - Aug 20 , 2026 | 04:25 AM

డీఎస్పీపై ప్రతిపక్ష సభ్యుల నిరసనలు, సభా నియమావళిపై మంత్రి మనోహర్‌, చైర్మన్‌ మోషేన్‌రాజు మధ్య సంవాదం, డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన తూమాటి మాధవరావు బాధ్యతల స్వీకరణ..

మండలిలో మూడో రోజూ అదే తీరు

  • డీఎస్సీపై వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన చైర్మన్‌

  • ప్లకార్డులతో పోడియం వద్ద వైసీపీ నిరసన

  • వారిపై చర్యకు మంత్రి మనోహర్‌ డిమాండ్‌

  • డిప్యూటీ చైర్మన్‌గా ‘తూమాటి’ బాధ్యతలు

  • ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన వర్ల

అమరావతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): డీఎస్పీపై ప్రతిపక్ష సభ్యుల నిరసనలు, సభా నియమావళిపై మంత్రి మనోహర్‌, చైర్మన్‌ మోషేన్‌రాజు మధ్య సంవాదం, డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన తూమాటి మాధవరావు బాధ్యతల స్వీకరణ, ఎమ్మెల్సీగా వర్ల రామయ్య ప్రమాణ స్వీకారం వంటి అంశాలు బుధవారం శాసన మండలిలో చోటుచేసుకున్నాయి. మండలి డిప్యూటీ చైర్మన్‌గా మాధవరావును సీటులో కూర్చోబెట్టే సమయంలో మంత్రులతో సహా అధికార పక్ష సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లిపోవడంతో.. విపక్ష వైసీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. సభ ప్రారంభంలో మెగా డీఎస్సీపై చర్చకు వైసీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్‌ మోషేన్‌రాజు తిరస్కరించి, ప్రశ్నోత్తరాలు చేపట్టారు. పేదలకు గృహాల మంజూరుపై టీడీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి పార్ధసారథి సమాధానం ఇస్తుండగా.. నల్లకండువాలతో వచ్చిన వైసీపీ సభ్యులు చైర్మన్‌ పోడియంలోకి వచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ, డీఎస్సీపై చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. తిరస్కరించిన అంశాన్ని అనుమతించడం కుదరదని, ప్రొసీజర్‌ ఫాలో అవ్వాలని చైర్మన్‌ చెప్పారు. మంత్రి పార్ధసారథి మాట్లాడుతూ మూడు రోజులుగా ఒకే అంశంపై గొడవ చేస్తున్న ప్రతిపక్ష సభ్యుల్ని సస్పెండ్‌ చేసి, బయటకు పంపాలని కోరారు. దీంతో వైసీపీ సభ్యులు పోడియంపైకి ఎక్కి, నినాదాలు చేశారు. వాయిదా తీర్మానాన్ని తిరస్కరించాక.. సభా మర్యాద పాటించి, సభ్యులు తమ స్థానాల్లో కూర్చోవాలని చైర్మన్‌ సూచించారు. అయినా డీఎస్సీపై చర్చించాలని, విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు.


ఈ నేపథ్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్‌ జోక్యం చేసుకుని, వాయిదా తీర్మానాన్ని తిరస్కరించాక కూడా ప్రతిపక్ష సభ్యులు పోడియంపైకి వచ్చి, చైర్మన్‌ను అడ్డుకుంటూ, సభా మర్యాదకు భంగం కలిగిస్తున్నందున, సభా మర్యాదను కాపాడేవిధంగా నిర్ణయం తీసుకోవాలని చైర్మన్‌ను కోరారు. దీనిపై చైర్మన్‌ మాట్లాడుతూ ‘మీరూ మంత్రిగా, స్పీకర్‌గా చేశారు. పదే పదే చైర్‌ను అడ్డుకుంటున్నారంటూ.. పెద్ద స్వరంతో మాట్లాడుతూ ఏమీ చేయలేకపోతున్నాననడం సరికాదు. మీకు రూల్స్‌ తెలుసు. దాన్ని ఫాలో అవ్వండి. నాకేమీ అభ్యంతరం లేదు’ అన్నారు. మంత్రి మనోహర్‌ స్పందిస్తూ ‘నేనన్నది.. సభ మిమ్మల్ని పూర్తిస్థాయిలో గౌరవించాలని. సభ్యులు పోడియంపైకి వచ్చి, మీ టేబుల్‌పై కొట్టి, ప్లకార్డులు ప్రదర్శించడం సబబు కాదు. వాళ్లని కిందకు పంపండి’ అన్నారు. సమాధానం కొనసాగించాలని మంత్రి పార్ధసారథిని చైర్మన్‌ కోరగా, ‘సభను ఆర్డర్‌లో పెట్టండి. గత ప్రభుత్వంలో మార్షల్స్‌ను పెట్టి, ఏవిధంగా సభను ఆర్డర్‌లో పెట్టారో.. ఇప్పుడూ అలాగే చర్య తీసుకోండి’ అని చెప్పారు. మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని.. ‘ప్రతిపక్ష సభ్యులపై మీ అధికారాలను ఉపయోగించి, వెంటనే చర్య తీసుకోవాలని కోరుతున్నాం’ అన్నారు. ఈ సమయంలో చైర్మన్‌ సభను పది నిమిషాలు వాయిదా వేయడంతో ప్రశ్నోత్తరాలు సాగలేదు.


నియమావళిపై సంవాదం

సభా నియమావళిపై చైర్మన్‌ మోషన్‌రాజు, మంత్రి మనోహర్‌ మధ్య కొద్దిసేపు సంవాదం జరిగింది. సభ పునఃప్రారంభమయ్యాక.. మనోహర్‌ మాట్లాడుతూ సభ నిబంధనలను ప్రస్తావిస్తూ.. ‘చైర్మన్‌కే సర్వాధికారాలు ఉంటాయి. సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించాక.. వాళ్లు నిరసన తెలపడానికి అధికారం ఉంది. అయితే సభ్యులు చైర్మన్‌ను ధిక్కరిస్తూ.. పోడియంపైకి వచ్చినప్పుడు చర్య తీసుకునే అధికారం చైర్మన్‌కు ఉంది’ అని చెప్పారు. దీనిపై మోషేన్‌రాజు స్పందిస్తూ.. సభ్యులు కిందకు వెళ్లి, తమ స్థానాల్లో కూర్చోవాలని స్పష్టంగా చెప్పానన్నారు. విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ‘డీఎస్సీపై చర్చ కోరుతుంటే.. ప్రభుత్వం అనుమతించకపోగా, చైర్మన్‌కు పాఠాలు చెప్పడం ఏమిటి?’ అన్నారు.

డీఎస్సీ ఉద్యోగాలను అంగట్లో అమ్మేసింది: బొత్స

కూటమి ప్రభుత్వం డీఎస్సీ ఉద్యోగాలను అంగట్లోపెట్టి అమ్మేసిందని శాసన మండలిలో వైసీపీపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. బుధవారం అసెంబ్లీ గేటు బయట ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మండలిలో దీనిపై చర్చకు అధికారపక్షం రావడం లేదు. డీఎస్సీ అవకతవకలు, పేపర్‌ లీకేజీపై సీబీఐతో విచారణ జరిపించాలి. మంత్రి లోకేశ్‌ రాజీనామా చేయాలి’ అని అన్నారు.


మండలి డిప్యూటీ చైర్మన్‌గా మాధవరావు బాధ్యతలు

మండలి డిప్యూటీ చైర్మన్‌గా తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు చైర్మన్‌ మోషేన్‌రాజు సభలో ప్రకటించారు. అధ్యక్ష పదవిని అలంకరించాలని మాధవరావును కోరారు. ఆయన్ని చైర్మన్‌ సీటు వద్దకు తీసుకురావాలని అన్ని పార్టీల నాయకులను కోరారు. అయితే ఆ సమయంలో మంత్రులు, కూటమి పార్టీల సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. దీంతో విపక్ష నేత బొత్స సత్యనారాయణతోపాటు ఇతర సభ్యులు మాధవరావును చైర్మన్‌ను తోడ్కొని వచ్చి, సీటులో కూర్చోబెట్టి, శుభాకాంక్షలు తెలిపారు. బొత్స మాట్లాడుతూ ‘డిప్యూటీ చైర్మన్‌గా సభను హుందాగా నడిపించాలి. డిప్యూటీ చైర్మన్‌ను తోడ్కొని రావటానికి అధికారపక్షం రాకపోవడం దురదృష్టకరం’ అన్నారు. చైర్‌ గౌరవాన్ని కాపాడి, మండలి విలువలు పెరిగేలా కృషిచేస్తానని మాధవరావు చెప్పి, కొద్దిసేపు విరామం ప్రకటించారు.

Updated Date - Aug 20 , 2026 | 04:29 AM