‘జేఎల్స్’ క్రమబద్ధీకరణలో కదలిక!
ABN , Publish Date - Aug 10 , 2026 | 03:39 AM
సుదీర్ఘకాలంగా క్రమబద్ధీకరణ కోసం వేచిచూస్తున్న కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల (జేఎల్స్) అంశంలో కదలిక కనిపిస్తోంది. ఎంతమందిని క్రమబద్ధీకరించాలి?. దీనికి అర్హతలు ఏమిటి?.
సందిగ్ధంగా మారిన నాలుగు అంశాలు
ఈ నాలుగింటిపై స్పష్టత ఇవ్వండి
రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటర్ విద్యా శాఖ లేఖ
2,128 మంది జేఎల్స్ వివరాల అందజేత
సర్కారు నిర్ణయంతో 20 ఏళ్ల నిరీక్షణకు తెర
అమరావతి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): సుదీర్ఘకాలంగా క్రమబద్ధీకరణ కోసం వేచిచూస్తున్న కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల (జేఎల్స్) అంశంలో కదలిక కనిపిస్తోంది. ఎంతమందిని క్రమబద్ధీకరించాలి?. దీనికి అర్హతలు ఏమిటి?. రిజర్వేషన్ వర్తింపు ఎలా?. వంటి కీలక అంశాలపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ఇంటర్ విద్యాశాఖ డైరెక్టర్ పి. రంజిత్ బాషా ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,532 మంది కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. 2024లో క్రమబద్ధీకరణ ప్రతిపాదనలు వచ్చినప్పుడు అప్పటికి పనిచేస్తున్న సుమారు 3,600 మంది జేఎల్స్ జాబితాను ప్రభుత్వానికి పంపారు. ఆ తర్వాత మళ్లీ తాజాగా క్రమబద్ధీకరణకు అర్హులైన జేఎల్స్ వివరాలను పంపాలని ప్రభుత్వం ఇంటర్ విద్యాశాఖకు సూచించింది. జూలై నెలాఖరులో వివరాలు పంపాల్సి ఉంది. కానీ, క్రమబద్ధీకరణకు అర్హతలైన వారి విషయంపై స్పష్టత లేకపోవడంతో ఇంటర్ విద్యాశాఖ ప్రభుత్వానికి లేఖ రాసింది. మొత్తంగా 2,128 మంది జేఎల్స్‌కు సంబంధించి తాజాగా స్పష్టత కోరింది.
జేఎల్స్ వాదన ఇదీ..
మొత్తం కాంట్రాక్టు నియామకాలు పారదర్శకంగానే జరిగాయని కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లు అంటున్నారు. 2000-2006 వరకు కాలేజీ యూనిట్‌గా నియమించారని, ప్రతి కాలేజీలో ఒక సబ్జెక్టుకు ఒక పోస్టును మాత్రమే భర్తీ చేయడం వల్ల రోస్టర్ అమలు కాలేదని చెబుతున్నారు. అనంతరం నోషనల్ రోస్టర్ అమలుచేశారని తెలిపారు. విద్యార్హతలు పరిశీలించి, రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించిన తర్వాతే నియమించారని తెలిపారు. కాగా, 2007 నుంచి జోనల్ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి రోస్టర్ పాటిస్తూ నియామకాలు చేసినందున 2006 తర్వాత నియామకాలు పొందిన జేఎల్స్‌కు అడ్డంకులు కనిపించడం లేదు. అయినప్పటికీ ఇంటర్ విద్యాశాఖ ప్రధానంగా లేవనెత్తిన 4 అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇస్తే క్రమబద్ధీకరణ అంశం ముందుకుసాగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే దాదాపు 20 ఏళ్ల నుంచి కాంట్రాక్టు జేఎల్స్ క్రమబద్ధీకరణ కోసం వేచిచూస్తున్నారు. ఇప్పటికైనా తమ ఉద్యోగాల రెగ్యులరైజేషన్‌పై సానుకూల నిర్ణయం తీసుకుని న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని వారు కోరుతున్నారు.
ఈ నాలుగే సందిగ్ధం
1) 2000-2007 మధ్య 1,430 మంది కాంట్రాక్టు జేఎల్స్ నియామకాలు జరిగాయి. వయసు, అర్హతల పరంగా చూస్తే క్రమద్ధీకరించేందుకు వారు అర్హులే. అయితే, వారి నియామకాల్లో రిజర్వేషన్ పాటించలేదు. కాలేజీ స్థాయిలో ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో ఈ నియామకాలు జరిగాయి. అనంతరం 2007లోనే జోనల్ స్థాయి ఎంపిక కమిటీలను నియమించారు. అప్పటి నుంచి రిజర్వేషన్ పాటించారు. రిజర్వేషన్ పాటించలేదనే కారణంతో 2000-2007 మధ్య కాలంలో జరిగిన నియామకాలకు ఆ జేఎల్స్‌ను బాధ్యులను చేయలేమని ఇంటర్ విద్యాశాఖ లేఖలో పేర్కొంది. అనంతరం ‘నిధి పోర్టల్’లో వివరాలు అప్‌లోడ్ చేసే సమయంలో నోషనల్ రోస్టర్ అమలు చేశారని స్పష్టంచేసింది. దీనివల్ల ఈ అంశంలో తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది.
2) 124 మంది కాంట్రాక్టు జేఎల్స్ నియామక సమయంలోనే ఉద్యోగ వయోపరిమితిని మించిపోయినట్లు తెలిపింది. వివరాలు ఇప్పటికే సమర్పించామని, దీనిపై ప్రభుత్వస్థాయిలో నిర్ణయం తీసుకోవాలని కోరింది.
3) ఒకేషనల్ కోర్సుల్లో 350 మంది కాంట్రాక్టు జేఎల్స్ పార్ట్‌టైమ్ సెకెండ్ పోస్టుల్లో నియామకమయ్యారని, అయితే, వీరు క్రమబద్ధీకరణకు అన్ని అర్హతలు సాధించారని వివరించింది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో సూచించాలని కోరింది.
4) అసలు మంజూరుకాని పోస్టుల్లో నియమించిన 224 మంది కాంట్రాక్టు జేఎల్స్ చేరారు. అయితే మంజూరుకాని పోస్టుల్లో చేరినందున వీరిని ఏంచేయాలో తెలపాలని కోరింది. దానికి అనుగుణంగా చర్యలు చేపడతామని ఇంటర్ విద్యాశాఖ ప్రభుత్వానికి వివరించింది.