25 ఏళ్లుగా నిరీక్షణ..
ABN , Publish Date - Jul 26 , 2026 | 04:37 AM
‘పాతికేళ్లుగా సేవలు అందిస్తున్నాం. రెగ్యులర్ జూనియర్ లెక్చరర్లతో సమానంగా పనిచేస్తున్నాం. ఇప్పటికైనా మాకు న్యాయం చేయండి’.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న 3532 మంది కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల ఆవేదన ఇది.
క్రమబద్ధీకరణ కోసం 3532 మంది కాంట్రాక్టు జేఎల్స్ ఎదురుచూపులు
2000 నుంచి ప్రభుత్వ కాలేజీల్లో సేవలు
దాదాపు సగం మంది రిటైర్మెంట్‌కు దగ్గరగా
వారితో పాటు చేరిన వారికి ఇతర శాఖల్లో క్రమబద్ధీకరణ
ఇప్పటికైనా న్యాయం చేయాలని వినతి
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
‘పాతికేళ్లుగా సేవలు అందిస్తున్నాం. రెగ్యులర్ జూనియర్ లెక్చరర్లతో సమానంగా పనిచేస్తున్నాం. ఇప్పటికైనా మాకు న్యాయం చేయండి’.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న 3532 మంది కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల ఆవేదన ఇది. చాలా మంది ఇప్పటికే రిటైర్మెంట్‌కు దగ్గర్లో ఉన్నందున ఇప్పుడైనా తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించి తమ కుటుంబాల్లో వెలుగులు నింపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇంటర్ విద్యా శాఖలో కాంట్రాక్టు జేఎల్స్ సేవలు కీలకం. ఎందుకంటే రెగ్యులర్ జేఎల్స్‌కు దాదాపు రెట్టింపు సంఖ్యలో కాంట్రాక్టు జేఎల్స్ పనిచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 470 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 3532 మంది పనిచేస్తున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో బోధన దాదాపుగా వీరిపైనే ఆధారపడి సాగుతోంది. 2000 సంవత్సరం నుంచి కాంట్రాక్టు జేఎల్స్ నియామకాలు ప్రారంభమయ్యాయి. ఆఏడాది నుంచి వివిధ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీల్లో జరిగిన నియామకాల్లో అనేక మంది ఉద్యోగాలు రెగ్యులరైజ్ అయ్యాయి. కానీ వివిధ కారణాలతో కాంట్రాక్టు జేఎల్స్ ఉద్యోగాలు మాత్రం క్రమబద్ధీకరణకు నోచుకోలేదు. వీరితో పాటు ఉమ్మడి రాష్ట్రంలో కాంట్రాక్టు జేఎల్స్‌గా తెలంగాణలో నియామకం అయిన వారిని ఆ రాష్ట్ర ప్రభుత్వం 2023లో రెగ్యులరైజ్ చేసింది. ఏపీ ప్రభుత్వం కూడా కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టి 10,117 మంది కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే ప్రయత్నాలు ప్రారంభించింది. 2024లో ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. అనంతరం కూటమి ప్రభుత్వంలోనూ వీరికి న్యాయం చేసేందుకు చర్యలు చేపట్టారు. అయితే వివిధ కారణాలతో ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఇప్పటికైనా క్రమబద్ధీకరణ చర్యలు వేగవంతం చేసి వీలైనంత త్వరగా న్యాయం చేయాలని కాంట్రాక్టు జేఎల్స్ కోరుతున్నారు. మరోవైపు రెండు మూడేళ్లలో దాదాపు 1500 మందికిపైగా రిటైరవుతారు. కాగా ప్రస్తుతం రెగ్యులైజేషన్ అంశం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉంది. 2006 నుంచి తీసుకున్న కాంట్రాక్టు జేఎల్స్‌ను రోస్టర్ ప్రకారమే నియమించారని, అందువల్ల క్రమబద్ధీకరణ రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు అనుగుణంగానే జరుగుతుందని కాంట్రాక్టు జేఎల్స్ చెబుతున్నారు.
డీఆర్ నియామకాలూ లేవు
కాంట్రాక్టు జేఎల్స్ ఉండటంతో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఏపీపీఎస్సీ ద్వారా జేఎల్స్ భర్తీ కూడా పెద్దగా జరగటం లేదు. 2023లో ఇచ్చిన నోటిఫికేషన్‌తో ఇటీవల 47 పోస్టులు భర్తీ చేశారు. కాలేజీల్లో వేల సంఖ్యలో ఖాళీలు ఉన్నప్పటికీ కాంట్రాక్టు జేఎల్స్ ఉన్న కారణంగానే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కు కూడా చర్యలు కనిపించడం లేదు. దీంతో ప్రస్తుతం ఉన్న తమను రెగ్యులరైజ్ చేసి ఇకపై డీఆర్ కోటాలో పోస్టులు భర్తీ చేయాలని జేఎల్స్ కోరుతున్నారు. ఒకప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలోనే కాంట్రాక్టు జేఎల్స్ నియామకాలు ప్రారంభయ్యాయని, ఇప్పుడు తిరిగి ఆయనే సీఎంగా ఉన్నందున తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.