అడ్మిషన్లలో ‘స్థానికత’ ఉత్తర్వులు కొనసాగింపు
ABN , Publish Date - Jul 01 , 2026 | 04:48 AM
రాష్ట్రంలోని ఉన్నత విద్య సీట్లు ఏపీకి చెందిన విద్యార్థులకే దక్కేలా గతేడాది జారీచేసిన ‘స్థానికత’ ఉత్తర్వులను కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ ఏడాదీ ఉన్నత విద్యలో మన సీట్లు మనకే..
అమరావతి, జూన్ 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఉన్నత విద్య సీట్లు ఏపీకి చెందిన విద్యార్థులకే దక్కేలా గతేడాది జారీచేసిన ‘స్థానికత’ ఉత్తర్వులను కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో గతేడాది మన రాష్ట్రంలోని ఉన్నత విద్య సీట్లు మన విద్యార్థులకే దక్కేలా ప్రభుత్వం జీవోలు ఇచ్చింది. అయితే స్థానికత రాష్ట్రపతి ఉత్తర్వులతో ముడిపడి ఉన్నందున, ఆ జీవోలను 2025-26కే పరిమితం చేశారు. ఈ ఏడాది కూడా అవే నిబంధనలు కొనసాగించాలని ఉన్నత విద్య కమిషనర్, ఉన్నత విద్యామండలి కోరగా, ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీచేసింది. దీని ప్రకారం.. రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థల్లోని సీట్లు ఆంధ్ర, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ల మధ్య 85:15 నిష్పత్తిలో స్థానిక, అన్ రిజర్వ్‌డ్‌గా గుర్తిస్తారు. రెండు వర్సిటీ రీజియన్ల మధ్య పరస్పరంగా ఈ పంపిణీ జరుగుతుంది. 2026-27కి మాత్రమే ఇది వర్తిస్తుంది. మరోవైపు పూర్తిగా స్థానికులు కాని విద్యార్థులు స్థానికతను క్లెయిమ్ చేసుకునే అంశంలో స్వల్ప సవరణ చేసింది. అర్హత పరీక్షకు ముందు ఏడేళ్ల పాటు రాష్ట్రంలో చదివినా, నివసించినా వారు స్థానికతకు క్లెయిమ్ చేసుకోవచ్చని గతేడాది జీవోలో పేర్కొంది. ఒకవేళ రాష్ట్రంలో ‘రెండు లేదా అంత కంటే ఎక్కువ’ ప్రాంతాల్లో సమానంగా చదివినా, నివసించినా అందులో చివరిగా చదివిన లేదా నివసించిన ప్రాంతాన్ని స్థానికంగా గుర్తిస్తారని పేర్కొంది. ఇప్పుడు దానిని కేవలం ‘రెండు ప్రాంతాలు’గా తాజా జీవోలో పేర్కొన్నారు.