Share News

అహ్మద్‌బాబుకు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు

ABN , Publish Date - May 07 , 2026 | 03:58 AM

వాణిజ్య పన్నులశాఖ ప్రధాన కమిషనర్‌ (సీసీఎస్టీ) అహ్మద్‌బాబును తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ వాణిజ్య పన్నులశాఖ సర్వీసెస్‌ అసోసియేషన్‌ ...

అహ్మద్‌బాబుకు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు

అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): వాణిజ్య పన్నులశాఖ ప్రధాన కమిషనర్‌ (సీసీఎస్టీ) అహ్మద్‌బాబును తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ వాణిజ్య పన్నులశాఖ సర్వీసెస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ‘అయ్యా బాబు గారూ.. మాకొద్దు ఈ బాబు’ అంటూ బ్యానర్లను ప్రదర్శిస్తూ బుధవారం భోజన విరామ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా వాణిజ్య పన్నులశాఖ కార్యాలయాల్లో ఉద్యోగులు నిరసన తెలిపారు. అహ్మద్‌బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అహ్మద్‌బాబు అహంకారపూరిత చర్యలకు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని వివిధ రూపాల్లో కొనసాగిస్తామని అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కాశీభట్ల రామ సూర్యనారాయణ తెలిపారు. మరోవైపు, సీసీఎస్టీ అహ్మద్‌బాబు పనితీరు బాగుందంటూ పలు సంఘాలు మద్దతు ప్రకటించాయి. వాణిజ్య పన్నులశాఖ గెజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు తోట రాజశేఖర్‌, ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్‌ సంఘం అధ్యక్షురాలు నిర్మలజ్యోతి, జీఎస్టీ ఆఫీసర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ గౌరవాధ్యక్షుడు పురుషోత్తమనాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతల కల్యాణ్‌కుమార్‌, ఆలిండియా స్టేట్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ కన్వీనర్‌ రాజ్యలక్ష్మి, ఏపీ ఎన్‌జీజీవో అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్‌.వేణుగోపాల్‌ తదితరులు బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి అహ్మద్‌బాబు పనితీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.

Updated Date - May 07 , 2026 | 03:58 AM