Share News

అహ్మద్‌బాబూ.. ఇదేం పని?!

ABN , Publish Date - May 01 , 2026 | 03:39 AM

వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్‌ అహ్మద్‌బాబుకు, ఉద్యోగులకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం పతాక స్థాయికి చేరుకుంటోంది. అహ్మద్‌బాబును తప్పించాలని ఉద్యోగులు గత..

అహ్మద్‌బాబూ.. ఇదేం పని?!

  • వాణిజ్య పన్నుల శాఖలో ప్రతీకార చర్యలు

  • 2022 నాటి ధర్నా కేసుపై నివేదిక కోరిన జీఏడీ

  • అదే కేసులో 72 మందిపై అహ్మద్‌బాబు చర్యలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కమిషనర్‌ అహ్మద్‌బాబుకు, ఉద్యోగులకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం పతాక స్థాయికి చేరుకుంటోంది. అహ్మద్‌బాబును తప్పించాలని ఉద్యోగులు గత రెండు రోజులుగా ఉద్యమాలు చేస్తుండగా, 2023లోనే హైకోర్టు సస్పెండ్‌ చేసిన ఓ మోమోతో ముడిపడిన కేసును అడ్డంపెట్టుకొని అహ్మద్‌బాబు ప్రతీకార చర్యలకు దిగా రు. ఒకేరోజు 72 మంది ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు కట్‌ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం కలకలం రేపుతోంది. అహ్మద్‌ బాబు తమపై తీవ్ర ప్రతీకార చర్యలకు దిగుతున్నారని, ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని వాణిజ్య పన్నుల ఉద్యోగుల సంఘం నేతలు కోరుతున్నారు. వివరాలు.. తమకు పదోన్నతులు ఇవ్వాలని, సర్వీ సు అంశాలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ 2022 డిసెంబరు 27న వాణిజ్య పన్నుల ఉద్యోగులు కార్యాలయాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు చేశా రు. ఈ చర్యలను అప్పటి జగన్‌ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో సంజాయిషీ ఇవ్వాలంటూ ఉద్యోగుల సంఘానికి 2023 ఏప్రిల్‌ 18న మెమో జారీ చేసింది. దీన్ని ఉద్యోగుల సంఘం హైకోర్టులో సవాల్‌ చేసింది. విచారణ అనంతరం ఈ మెమోను సస్పెండ్‌ చేయడంతో పాటు అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. కూటమి సర్కారు వచ్చిన తర్వాత ఉద్యోగుల సంఘం వినతి మేరకు జగన్‌ ప్రభుత్వంలో జారీ చేసిన మోమోను ఉపసంహరించుకుంది. ఈ మేరకు గతేడాది సెప్టెంబరు 10న జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎస్‌ రా వత్‌ మెమో జారీ చేశారు. అంతటితో ఆ కేసు ముగిసిపోయిం ది. ప్రభుత్వ ఆలోచనలకు తగినట్లుగానే ఈ అంశంపై తదుపరి చర్యలు తీసుకునేందుకు కీలక సమాచారం కోరుతూ జీఏడీ పలుమార్లు వాణిజ్య పన్నుల శాఖకు యూవో నోట్‌లు పంపించింది. చివరగా ఈ నెల 24న రావత్‌ మరో నోట్‌ పంపిస్తూ తాము అడిగిన అంశాలపై సమాచారం రావడం లేదని, ఇప్పుడైనా బదులివ్వాలని కోరారు. ఇన్నాళ్లుగా వాటిపై స్పందించని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు.. ప్రధాన కమిషనర్‌ వ్యవహారం రచ్చకెక్కిన తర్వాత ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు దిగడం చర్చనీయాంశంగా మారింది. అప్పటి మోమో నేపథ్యంలో జరిగిన విచారణ ఆధారంగా ఉద్యోగులపై అహ్మద్‌బాబు ఇప్పుడు చర్యలకు దిగారు. జగన్‌ ప్రభుత్వంలో ధర్నాలో పాల్గొన్నారని, సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాలతో 72 మందికి ఒక వార్షిక ఇంక్రిమెంట్‌ కోతపెడుతూ ఉత్తర్వులు ఇచ్చారు. 2022లో జరిగిన ధర్నాకు మూలమైన మెమోను ప్రభుత్వమే ఉపసంహరించుకుంటే, నాటి విచారణను చూపి ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం ఏమిటని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇది ఉద్యోగులపై అహ్మద్‌బాబు ప్రతీకార చర్య అని మండిపడుతున్నాయి.

Updated Date - May 01 , 2026 | 03:39 AM