Share News

నేడు, రేపు కలెక్టర్ల సదస్సు!

ABN , Publish Date - May 07 , 2026 | 04:11 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం నుంచి రెండు రోజుల పాటు ఏడో విడత జిల్లా కలెక్టర్ల సమావేశాలు నిర్వహించనున్నారు. సచివాలయంలో...

నేడు, రేపు కలెక్టర్ల సదస్సు!

  • అజెండాలో కీలకాంశాలు.. మంత్రుల సింగపూర్‌ పర్యటనపై చర్చ

  • చర్చకు వేసవి కార్యాచరణ ప్రణాళిక.. కలెక్టర్‌, విభాగాధిపతులు, కార్యదర్శుల క్షేత్రస్థాయి పర్యటనలపైనా కేంద్రీకరణ

  • జలధారపై సీఎస్‌, శాంతిభద్రతలపై డీజీపీ ప్రజంటేషన్‌

అమరావతి, మే 6 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం నుంచి రెండు రోజుల పాటు ఏడో విడత జిల్లా కలెక్టర్ల సమావేశాలు నిర్వహించనున్నారు. సచివాలయంలో ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ముందుగా నిర్దేశించిన అజెండాలో పలు కీలక మార్పులు చేశారు. తొలుత జీఎ్‌సడీపీ నుంచే చర్చ మొదలు కానుంది. ఇటీవల రాష్ట్ర మంత్రులు సింగపూర్‌ పర్యటనకు వెళ్లివచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపఽథ్యంలో వారు అక్కడ నేర్చుకున్న అంశాలు, ఇక్కడ వాటి అవసరాలపై ప్రత్యేక ప్రజంటేషన్‌ ఇప్పించాలని నిర్ణయించారు. తొలి రోజు అజెండాలో రెండో అంశంగా దీన్ని చేర్చారు. సింగపూర్‌ పర్యటనకు వెళ్లివచ్చిన మంత్రులు కింజారపు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్‌, బీసీ జనార్దన్‌రెడ్డి, పొంగూరు నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్‌ యాదవ్‌తో మాట్లాడించనున్నారు. మూడో అంశంగా స్వర్ణాంధ్ర-2047 పది సూత్రాలపై ఆర్థిక, ప్రణాళిక కార్యదర్శి పీయూశ్‌ కుమార్‌ ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు. వేసవి కార్యాచరణ ప్రణాళికను తొలిరోజే చర్చకు తీసుకోనున్నారు. భోజన విరామం తర్వాత సంజీవని, వేసవి కార్యాచరణ ప్రణాళిక, ఆహారం, తాగునీటి సంరక్షణ వంటి అంశాలను అజెండాలోకి తీసుకుంటారు. వీటిపై వైద్య, ఆరోగ్యశాఖ, ఇతర అధికారులు నివేదికలు సమర్పించి కీలక అంశాలు, కార్యాచరణ ప్రణాళికపై చర్చ చేయనున్నారు. జలధారను కూడా అజెండాలో చేర్చారు. ఈ అంశంపై సీఎస్‌ సాయిప్రసాద్‌ ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు.

రెండో రోజు...

శుక్రవారం, రెండో రోజు, ఉదయం సమావేశంలో ఈ-ఆఫీసు, ఆర్టీజీఎస్‌, ఇతర సాంకేతిక అంశాలు, పీజీఆర్‌ఎ్‌సపై చర్చ ఉంటుంది. దీనిపై ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్‌ ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు. కలెక్టర్లు, విభాగాధిపతులు, కార్యదర్శులు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలని గత సమావేశాల్లో సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేసిన విషయం తెలిసిందే. అయితే, దీని అమలును స్వీయ పర్యవేక్షణ చేయాలని సీఎ్‌సను సీఎం ఆదేశించారు. కానీ తొలుత ఈ అంశం అజెండా పరిధిలో లేదు. సవరించిన అజెండాలో మాత్రం దీనికి స్థానం కల్పించారు. ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్‌ ఈ అంశంపై ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు. అనంతరం సూపర్‌సిక్స్‌ సంక్షేమ పథకాలపై చర్చ ఉంటుంది. ఈ సారి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అంశం కూడా చర్చకు రానుంది. టీటీడీ పరిధిలో ఏఐ సహాయంతో సమీకృత కమాండ్‌ కంట్రోల్‌ను ఏర్పాటు చేసున్న సంగతి తెలిసిందే. దీనిపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు. చివరిగా శాంతిభద్రతలపై కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు విభాగాధిపతులు, కార్యదర్శులతో సమీక్ష ఉంటుంది. డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా శాంతిభద్రతలపై ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు. అనంతరం రెండురోజుల సమావేశాలను ఉద్దేశించి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు.

Updated Date - May 07 , 2026 | 04:12 AM