కూటమిదీ అప్పుల బాటే!
ABN , Publish Date - Mar 22 , 2026 | 04:41 AM
బడ్జెట్లో కూటమి ప్రభుత్వం వేసే అప్పుల అంచనా ఒకటి. వాస్తవంలో కనిపించే దృశ్యం మాత్రం దీనికి పూర్తి భిన్నం. కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు రెండు బడ్జెట్లు అమలు చేసింది.
గత రెండు బడ్జెట్లలో రూ.లక్ష కోట్ల రుణాలు
బడ్జెట్ అంచనాకు మించి ఖర్చు చేసిన ఫలితం
అప్పులను రెవెన్యూ ఖర్చులకు వాడిన వైసీపీ
వారసత్వంగా కూటమికి వేలకోట్ల అప్పులు, వడ్డీలు
అయినా, ఖర్చుల్లో ఏ మాత్రం తగ్గని దూకుడు
మరో 1.25 లక్షల కోట్ల రుణాలకు గ్యారంటీలు
ఆదాయంలో మాత్రం ఎదుగూబొదుగూ లేదు
ఖర్చులపై నియంత్ర ణలేదు
11 నెలలకే 183 శాతానికి రెవెన్యూ లోటు
జగన్ హయాంలో అప్పులను తిరిగి ఖజానాకు పైసా ఆదాయం కూడా తెచ్చిపెట్టలేని రెవెన్యూ ఖర్చుల కోసమే ఎక్కువగా వినియోగించారు. నాడు వైసీపీ నిర్వాకం వల్ల ఈనాడు కూటమి ప్రభుత్వం వేలకోట్ల రూపాయల అప్పులు, వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి. అప్పులు అంచనాలు దాటిపోతే జరిగేదిదే. అయినా, కూటమి సర్కారు కూడా రెవెన్యూ ఖర్చులను పెంచుకుంటూ పోతోంది. గత రెండు బడ్జెట్లలో అప్పుల పద్దును రూ. లక్ష కోట్లు చొప్పున దాటించేసింది.
(అమరావతి, ఆంధ్రజ్యోతి)
బడ్జెట్లో కూటమి ప్రభుత్వం వేసే అప్పుల అంచనా ఒకటి. వాస్తవంలో కనిపించే దృశ్యం మాత్రం దీనికి పూర్తి భిన్నం. కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు రెండు బడ్జెట్లు అమలు చేసింది. ఏ బడ్జెట్ అంచనాల్లోనూ అప్పులు రూ.లక్ష కోట్లు చూపించలేదు. కానీ, వాస్తవానికి ఈ రెండేళ్లు కూడా బడ్జెట్ అప్పులే రూ.లక్ష కోట్లు దాటాయి. 2024-25లో రూ లక్షా ఐదువేల కోట్లు, 2025-26లో మార్చి 18వ తేదీ నాటికి రూ.లక్షా నాలుగు వేల కోట్లు అప్పులు చేశారు. మార్చి ముగిసేలోపు ఇవి మరింత పెరగొచ్చు. రెండేళ్లలో ప్రభుత్వం చేసిన బడ్జెట్ అప్పులే రూ.2 లక్షల 9 వేల కోట్లు ఉన్నాయి. ఇవి కాకుండా ఈ రెండేళ్లలో రూ.1.25 లక్షల కోట్లకు గ్యారంటీలు ఇచ్చింది. వీటిలో సగానికి పైగా తెచ్చి వాడారు. వీటిని బడ్జెట్లో చూపకపోయినా, కాగ్ కు సమర్పించకపోయినా చెల్లించాల్సింది ప్రభుత్వమే. తెచ్చిన అప్పులను తిరిగి ఖజానాకు డబ్బు తెచ్చిపెట్టే మూలధన వ్యయంపై ఖర్చు చేస్తే ఎలాంటి ఆందోళనా అక్కర్లేదు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో అందుకు భిన్నంగా జరుగుతోంది.
రెవెన్యూ లోటు 183 శాతానికి..
అంచనాలంటే ఐదో పదో అటూఇటూ అవుతాయి. కానీ, రాష్ట్ర బడ్జెట్ అంచనాలు మాత్రం పూర్తిగా తలకిందులవడం గమనార్హం. 2025-26 బడ్జెట్లో రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు అని అంచనా వేశారు. అది రూ.40,000 కోట్లకు పెరిగితే అంచనాలే కదా అనుకోవచ్చు. కానీ, 11 నెలలకే లోటు రూ.60,812 కోట్లకు పెరిగింది. అంచనాల ప్రకారం, లోటు ప్రతి నెలా రూ.2,765 కోట్లు ఉండాలి. కానీ, రూ.5,528 కోట్లకు చేరిపోయింది. అంచనాలకు మించి 183 శాతానికి చేరిందని ‘కాగ్’ తన నివేదికలో వెల్లడించింది.
ఆదాయంలో రివర్స్..
అప్పులు, లోటు విషయంలో పెరిగే అంచనాలు, ఆదాయం విషయంలో మాత్రం రివర్స్ అవుతాయి. 12 నెలల్లో రూ.2.17 లక్షల కోట్ల ఆదాయం అంచనా వేస్తే, 11 నెలల్లో అది రూ.1.49 లక్షల కోట్ల వద్దే నిలిచిపోయింది. అంచనాల ప్రకారం నెలకి రూ.18,164 కోట్లు రావాలి. కానీ, ఆదాయం రూ.13,595 కోట్ల వద్దే ఆగిపోయింది. మార్చిలో రూ.20,000 కోట్ల ఆదాయం వస్తుందనుకుంటే 2025-26 మొత్తం రెవెన్యూ ఆదాయం రూ.1,70,000 కోట్లకు చేరుతుంది. అంచనాలు మాత్రం రూ.2.17 లక్షల కోట్లు. గత ఆర్థిక సంవత్సరంలో కూడా ఇంచుమించు ఇదే ఆదాయం వచ్చింది. ఆదాయం అంచనాలకు తగ్గట్టు లేకపోయినా అప్పులు మాత్రం ప్రతి బడ్జెట్లోనూ అంచనాలను దాటుతున్నాయి. 2025-26 బడ్జెట్లో కూడా అప్పులు రూ.79,952 కోట్లుగా అంచనా వేశారు. కానీ, ఈ ఏడాది ఫిబ్రవరి నాటికే రూ.94,436 కోట్లు చేశారు. మార్చిలో 18వ తేదీనాటికి ఇంకో రూ.10,000 కోట్లు అప్పు చేశారు. దీంతో బడ్జెట్ అప్పులే రూ.లక్ష కోట్లు దాటిపోయాయి.
నియంత్రణ లేని ఖర్చులు
ప్రభుత్వ రెవెన్యూ ఖర్చుల్లో జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లు, పింఛన్ల వాటా, వేల కోట్లు పంచిపెట్టే సంక్షేమ పథకాలే అత్యధికం. వీటిలో ఏది తగ్గించాలో తెలియని పరిస్థితి. పథకాలకు అనర్హులను ఏరివేయడం, అవసరం లేని పథకాలను ఆపేయడం ద్వారా రెవెన్యూ లోటును చాలా వరకు కట్టడి చేయవచ్చు. కానీ, ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా సంక్షేమ పథకాల జోలికి వెళ్లడం లేదు. కుదిరితే మరో నాలుగు పథకాలు పెంచడమేగానీ అనవసరమైన వాటిని ఆపడం లేదు. రూ.లక్షల కోట్లు అప్పులు తెచ్చి అనవసర పథకాల కోసం ఖర్చు పెట్టడం కంటే విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన, చిన్న, మధ్యతరహా, భారీ ప్రాజెక్టులకు కేటాయిస్తే సంక్షేమానికి మించిన ఫలితాలు ప్రజలకు అందుతాయని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.