పొగాకుపై పన్నుల విధానాన్ని పునఃసమీక్షించండి
ABN , Publish Date - May 18 , 2026 | 06:22 AM
రాష్ట్రంలో పొగాకు రైతుల సమస్యలపై కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయుష్ గోయల్‌కు సీఎం చంద్రబాబు ఆదివారం లేఖలు రాశారు.
ఆక్వా రైతుల సమస్యలను పట్టించుకోండి
కేంద్ర మంత్రులు నిర్మల, పీయు్‌షకు సీఎం చంద్రబాబు లేఖ
అమరావతి, మే 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పొగాకు రైతుల సమస్యలపై కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయుష్ గోయల్‌కు సీఎం చంద్రబాబు ఆదివారం లేఖలు రాశారు. రాష్ట్రంలోని వర్జీనియా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పేర్కొన్నారు. ఫిబ్రవరి 1 నుంచి సిగరెట్లపై సవరించిన పన్నుల విధానంవల్ల పొగాకు రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు పేర్కొన్నారు. ‘గతేడాది వేలంలో కిలో పొగాకు ప్రారంభ ధర రూ.280 ఉంటే ప్రస్తుత ఏడాది రూ.250కి పడిపోయింది. పొగాకు కొనుగోలు చేసే కంపెనీలు కొనుగోలు పరిమాణాన్ని తగ్గించుకోవడంతో రైతులకు నష్టం జరుగుతోంది. అంతర్జాతీయంగా ఏర్పడిన భౌగోళిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎగుమతిదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో దాదాపు 43 వేల మంది రైతులతోపాటు, దీనిపై ఆధారపడిన లక్షలాది మంది కార్మికుల జీవనోపాధి ప్రమాదంలో పడింది’ అని లేఖలో పేర్కొన్నారు.
రొయ్యల ఎగుమతుల్లో సంక్షోభాన్ని నివారించాలి
ఏపీలో ఆక్వా రైతులు, రొయ్యల ఎగుమతుల సంక్షోభంపై కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయు్‌షగోయల్‌కు సీఎం చంద్రబాబు మరో లేఖ రాశారు. రొయ్యల ఎగుమతులపై అమెరికా విధిస్తున్న 50శాతం సుంకంతో భారత ఎగుమతులపై 60శాతం పన్ను భారం పడుతోందన్నారు. ప్రస్తుతం ఏపీ నుంచి రూ.25వేల కోట్ల ఎగుమతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్రంలోని 2.5 లక్షల ఆక్వా రైతు కుటుంబాలు, 30లక్షలపైగా కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. దేశీయ మార్కెట్‌లోనూ ఆక్వా ఉత్పత్తుల ధరలు 20-25శాతం మేర పడిపోయాయని సీఎం వివరించారు. ఏపీలో ఫ్రాన్ ప్రొడ్యూసర్స్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు కోసం ఎన్‌ఎఫ్‌డీబీ ద్వారా రూ.100కోట్ల కార్పస్ ఫండ్ మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు మరో లేఖ రాశారు. ఏపీలో అదనపు రీజనల్ ఫిషరీస్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేయాలని కోరారు.