మండపేట టూ బనగానపల్లె
ABN , Publish Date - Jul 10 , 2026 | 04:52 AM
తూర్పు గోదావరి జిల్లా మండపేటకు చెందిన ముత్యాల సాయిదీప్తి గురువారం బనగానపల్లె వచ్చి సీఎంను కలిశారు. తమ కుటుంబ ఆస్తికి సంబంధించిన సమస్యపై..
22-ఏ సమస్యపై సీఎంకు మహిళ వినతిపత్రం
తక్షణం స్పందించిన చంద్రబాబు
నేడు బాధిత కుటుంబాన్ని కలవనున్న కలెక్టర్
అమరావతి, జూలై 9(ఆంధ్రజ్యోతి): తూర్పు గోదావరి జిల్లా మండపేటకు చెందిన ముత్యాల సాయిదీప్తి గురువారం బనగానపల్లె వచ్చి సీఎంను కలిశారు. తమ కుటుంబ ఆస్తికి సంబంధించిన సమస్యపై వినతిపత్రం ఇచ్చారు. మండపేట ప్రధాన రహదారిలో ఉన్న స్థలానికి 2003లో దీప్తి తల్లి పేరుపై ప్రభుత్వం పట్టా మంజూరు చేసింది. అనంతరం ఆమె తల్లి 2015లో గిఫ్డ్ డీడ్ ద్వారా ఆస్తిని దీప్తి తండ్రి పేరుకు బదిలీ చేశారు. అప్పటి నుంచి పన్నులు క్రమం తప్పకుండా చెల్లిస్తూ, చట్టబద్ధ హక్కుదారులుగా ఆ స్థలాన్ని అనుభవిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న పట్టా రెగ్యులరైజేషన్ స్కీం-2025 కింద తమ ఆస్తిని కూడా రెగ్యులరైజ్ చేయించుకోవాలనే ఉద్దేశంతో తహశీల్దార్‌ను సంప్రదించారు. ఆ స్థలం 22ఏలో ఉన్నందున రెగ్యులరైజేషన్ సాధ్యం కాదని తహశీల్దార్ తెలిపారు. దీంతో బాధిత కుటుంబం తమ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు గురువారం మండపేట నుంచి బనగానపల్లె వచ్చింది. దీప్తి సమస్యపై వెంటనే స్పందించిన సీఎం.. తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి కలెక్టర్ బాధిత కుటుంబాన్ని శుక్రవారం కలసి నిబంధనల మేరకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. కడప జిల్లా రామరాజుపల్లెకు చెందిన రామలక్ష్మమ్మ కూడా 22 ఏ నుంచి తన భూమిని విడిపించాలంటూ సీఎంకు మొరపెట్టుకుంది. తక్షణమే స్పందించిన చంద్రబాబు కడప కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.