అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి
ABN , Publish Date - Jan 21 , 2026 | 04:07 AM
అభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేయాలన్న సంకల్పంతోనే వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రైన్యూర్ విధానాన్ని అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఒక తరం అభివృద్ధి చెందేలా ప్రభుత్వ నిర్ణయాలు
‘వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రైన్యూర్’పై చర్చలో సీఎం చంద్రబాబు
అభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేయాలన్న సంకల్పంతోనే వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రైన్యూర్ విధానాన్ని అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కుటుంబంలోని ఒక తరానికి మేలు చేయాలన్నారు. తన ఆలోచనలు ఎప్పుడూ ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధిపైనే ఉంటాయని చెప్పారు. దావోస్ ఆర్థిక సదస్సులో పలువురు పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ అయ్యారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రైన్యూర్ విధానంపై చర్చ జరిగింది. భారతదేశం ఇప్పుడు ఉత్పత్తి రంగం వైపు చూస్తోందని, దానిని అందిపుచ్చుకునే దిశగా ఈ సరికొత్త విధానం తెచ్చామని చంద్రబాబు అన్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా పారిశ్రామికవేత్తలు కావాలనుకునేవారికి మార్గనిర్దేశం చేస్తున్నామన్నారు. పారిశ్రామికాభివృద్ధికి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు. ఎంఎ స్‌ఎంఈలను ప్రోత్సహించడం ద్వారా లోకల్ బ్రాండ్లకు మద్దతుగా ఉంటున్నామని చెప్పారు. గతేడాది మహిళా దినోత్సవం నాడు లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తలను చేస్తామని ప్రకటించామని, విడతల వారీగా మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేస్తామని చెప్పారు.
ఉత్పత్తి.. బ్రాండింగ్ ముఖ్యం
‘‘నైపుణ్యం ఉన్న మానవ వనరులను కంపెనీలకు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇలా చేయగలిగితేనే రాష్ట్రాభివృద్ధితో పాటు ప్రజలు కూడా అభివృద్ధి సాధిస్తారు. ఎన్నో రంగాల్లో అభివృద్ధి జరుగుతోంది పారిశ్రామికవేత్తలుగా ఎదిగాక ఉత్పత్తులను తయారు చేయడంతో పాటు బ్రాండింగ్‌నూ మార్కెట్ చేయడం అత్యవసరం. డ్వాక్రా మహిళల ఉత్పత్తులకూ బ్రాండింగ్ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం’’ అని సీఎం అన్నారు.
స్టార్ట్‌పకు డబ్ల్యూఐపీఓ సహకారం అందించాలి
రాష్ట్రంలో స్టార్టప్ వ్యవస్థకు వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ సహకారం అందించాలని సంస్థ డైరెక్టర్ జనరల్ డారెన్ టాంగ్, డైరెక్టర్ అనిల్ మార్తిని చంద్రబాబు కోరారు. దావోస్ పర్యటనలో ఉన్న చంద్రబాబును వారు కలిశారు. ఆవిష్కరణలకు ప్రోత్సాహం, మేధోసంపత్తి హక్కుల రక్షణ, స్టార్టప్ ఎకోసిస్టమ్, పరిశోధన-అభివృద్ధి, పేటెంట్ వ్యవస్థ బలోపేతం అంశాలపై చర్చించారు. ఏపీని నాలెడ్జ్ ఎకానమీ, ఇన్నోవేషన్ ఆధారి త రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.
అత్యుత్తమ నగరంగా అమరావతి
ప్రపంచంలో అత్యుత్తమ, అత్యంత సుందరమైన నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతామని, ఈ ప్రయత్నంలో అందరూ భాగస్వాములు కావచ్చని చంద్రబాబు ఆహ్వానించారు. పెట్టుబడిదారులకు ఏపీ కంటే మెరుగైన గమ్యస్థానం లేదన్నారు. ప్రధాని మోదీ రూపంలో దేశానికి బలమైన నాయకత్వం ఉందని అన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఏపీ మరింత వేగంగా ముందుకు సాగుతోందని అన్నారు.
జీవితాలను ఏఐ మెరుగుపరచాలి: సత్య నాదెళ్ల
విద్యా రంగం ఫలితాల నుంచి ప్రభుత్వ రంగ సామర్థ్యం వరకు ప్రతి ఒక్కరి జీవితాలను మెరుగుపరచడమే కృత్రిమ మేధస్సు (ఏఐ) లక్ష్యండగా ఉండాలని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అన్నారు. దావోస్ సదస్సులో ఆయన మాట్లాడారు. జీవితంలో అన్ని అంశాలలో ఏఐ పాత్రను పరిశీలించాల్సిన అవసరముందన్నారు.