వైసీపీ రాజకీయం.. విధ్వంసం, అవినీతే!
ABN , Publish Date - May 01 , 2026 | 03:50 AM
రాజధాని అమరావతి,, మంత్రుల సింగపూర్ పర్యటన.. చివరకు పెట్రోల్, డీజిల్ ఇబ్బందులపైనా గొడ్డలిపార్టీ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు.
వారికి రాష్ట్రాభివృద్ధి గిట్టదు: సీఎం
గొడ్డలి పార్టీ విమర్శలను తిప్పికొట్టండి
క్యాబినెట్ సహచరులతో చంద్రబాబు
అమరావతి, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి,, మంత్రుల సింగపూర్ పర్యటన.. చివరకు పెట్రోల్, డీజిల్ ఇబ్బందులపైనా గొడ్డలిపార్టీ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. గురువారం రాష్ట్రమంత్రివర్గ సమావేశంలో ఎజెండా అంశాలు ముగిశాక.. తాజా రాజకీయ పరిణామాలపై ఆయన మంత్రులతో చర్చించారు. వైసీపీ నేతలకు విధ్వంస.. విమర్శ.. అవినీతి తప్ప రాష్ట్రాభివృద్ధి పట్టదని, అభివృద్ధి అంటేనే వారికి గిట్టదని సీఎం మండిపడ్డారు. అమరావతి నిర్మాణాలపై గొడ్డలి పార్టీ విమర్శలను దీటుగా ఎదుర్కోవాలన్నారు. ‘నిర్మాణ ఖర్చులపై దుష్ప్రచారాలను తిప్పికొడుతూ వాస్తవాలను సోదాహరణగా ప్రజలకు చెప్పాలి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జరుగుతున్న నిర్మాణం వ్యయం.. మన దేశంలోనే కాదు.. ఇతర దేశాల నిర్మాణ ఖర్చుల కంటే తక్కువ. అన్నీ పరిశీలించాకే నిర్మాణ ధరలను నిర్ణయించాం. ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతున్నాం. ఇక్కడ నిర్మాణాలు పూర్తయిన తర్వాత ప్రపంచం నలుమూలల నుంచి ప్రతి ఒక్కరూ వాటిని చూడడానికే ఇక్కడకు వస్తారు’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రాభివృద్ధిని గుడ్డిగా వ్యతిరేకిస్తూ విమర్శలు చేయడమే వైసీపీ నేతల లక్ష్యమని, వారి దుష్ప్రచారాలపై అప్రమత్తంగా ఉంటూ ఎక్కడికక్కడ నియంత్రించాలని మంత్రులకు సూచించారు. ఇటీవల తలెత్తిన పెట్రోలు, డీజిల్ సమస్యపైనా వాస్తవాలేమిటో ప్రజలకు వివరించాలన్నారు. రాష్ట్రంలో అత్యుత్తమ విధానాలు అమలు చేసేందుకు అధ్యయనం కోసం మంత్రులు చేపట్టిన సింగపూర్ యాత్రను కూడా తప్పుపట్టడం గొడ్డలి పార్టీకే చెల్లిందని విమర్శించారు. మంత్రుల బృందం అధ్యయనాలపై వ్యక్తిగతంగా తనకు నివేదికలు అందజేయాలని సూచించారు. సింగపూర్ అభివృద్ధి చెందిన తీరు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆ దేశం అనుసరిస్తున్న సుపరిపాలన విధానాలను తెలుసుకుని మన దగ్గర అమలు చేయడమే మంత్రుల పర్యటన ఉద్దేశమన్నారు.
భవిష్యత్ ఏఐ, ఐటీదే..
భవిష్యత్ మొత్తం కృత్రిమ మేధ (ఏఐ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)దేనని, ఒక స్థాయి ఉద్యోగాల నియామకాల్లో ఏఐ, ఐటీని తప్పనిసరి చేయాలని, ఈ విషయాన్ని మంత్రులందరూ అధ్యయనం చేసి, తగిన సూచనలు చేయాలని సీఎం కోరారు. వాటిపై పరిజ్ఞానం పెంచుకోకపోతే మంత్రులు కూడా వెనుకబడిపోతారని తెలిపారు. జలధార, జల హారతి కార్యక్రమంలో మంత్రుల భాగస్వామ్యం ఉండేలా చూడాలని మంత్రి నిమ్మల రామానాయుడికి ఆయన సూచించారు. పెరుగుతున్న ఎండలు, ఉషోగ్రతలపై ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం ఇస్తూ అప్రమత్తం చేయాలని, మంత్రులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. పీఎం సూర్యఘర్ లక్ష్యాల కోసం ఇంకా బాగా పనిచేయాలని విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌కు సూచించారు. ఈ సందర్భంగా సూర్యఘర్ కనెక్షన్ల లక్ష్యాలను మంత్రి సీఎంకు వివరించారు.
ఒక దశలో గూగుల్ రాలేమంది..
గూగుల్ డేటా సెంటర్‌ను తీసుకొచ్చే క్రమంలో చోటుచేసుకున్న పరిణామాలను సీఎం ప్రస్తావించారు. అమెరికా పర్యటనలో లోకేశ్ గూగుల్ ప్రతినిధులను కలిసి ఒప్పించిన తీరును వివరించారు. కేంద్ర ప్రభుత్వ పాలసీలతో ఉన్న సమస్యల వల్ల ఒకానొక దశలో గూగుల్ పెట్టుబడి పెట్టలేమని చెప్పిందన్నారు. కేంద్రంతో ఉన్న సఖ్యత వల్ల విధానాల్లో మార్పులు కూడా చేయించి.. గూగుల్ రాష్ట్రానికి తక్కువ కాలంలోనే వచ్చేలా జరిగిన కృషిని తెలియజేశారు. పుట్టపర్తి వద్ద ఏరోస్పేస్ డిఫెన్స్ క్లస్టర్‌కు వేగంగా అనుమతులు రావడం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినె్‌సలో భాగమని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఇందుకు కృషి చేసిన పరిశ్రమల కార్యదర్శి యువరాజ్‌ను కొనియాడారు.