ముందుచూపు బడ్జెట్
ABN , Publish Date - Feb 02 , 2026 | 06:26 AM
‘కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను స్వాగతిస్తున్నా. దేశం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు ముందుచూపుతో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
అమరావతి/కుప్పం/శాంతిపురం,, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): ‘కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను స్వాగతిస్తున్నా. దేశం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు ముందుచూపుతో ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈమేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన చేశారు. ‘రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం దృష్టి సారించిన అంశాల్లో మరింత దూకుడుగా వెళ్లేందుకు ఈ బడ్జెట్ సహాయకారిగా నిలుస్తుంది. రాష్ట్రం అమలు చేస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానానికి ఈ బడ్జెట్ మరింత ఊతమిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎంఎ్‌సఎంఈలపై దృష్టి సారించింది. వీటిని మరింత బలోపేతం చేసేలా కేంద్ర బడ్జెట్ ఉపకరించనుంది. మహిళలు, రైతులు, యువత సాధికారత సాధించేలా బడ్జెట్ రూపకల్పన జరిగింది. 2047 వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు బడ్జెట్ దోహదపడుతుంది. ప్రధాని మోదీ నిర్దేశకత్వంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. సమతుల్య బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఏఐ సహా వివిధ టెక్నాలజీలు, నెక్ట్స్ లెవల్ ఆఫ్ రిఫార్మ్స్‌కు బడ్జెట్ దోహదపడుతుంది. రెన్యూవబుల్ ఎనర్జీ, వన్ గ్రిడ్ వన్ నేషన్ దిశగా బడ్జెట్ అడుగులు వేయిస్తోంది. స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాల సమ్మేళనంగా బడ్జెట్ రూపకల్పన చేయడం బాగుంది.
మెరుగైన జీవన ప్రమాణాలు, ఈజ్ ఆఫ్ లివింగ్‌కు ఈ బడ్జెట్ బాటలు వేస్తుంది. హైదరాబాద్ - బెంగళూరు, హైదరాబాద్ - చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ ద్వారా రాష్ట్రానికి ఎంతో ఉపయోగం కలుగుతుంది. తిరుపతి, అమరావతి వంటి ప్రాంతాలు ఈ కారిడార్‌లో కవర్ అవుతాయి. బెంగళూరు - చెన్నై హైస్పీడ్ కారిడార్ వల్ల పలమనేరు, చిత్తూరు తదితర ప్రాంతాలు కవర్ అవుతాయి. డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్‌లో ఏపీ కూడా ఉండటంతో అత్యంత విలువైన ఖనిజాలు వెలికి తీసి క్రిటికల్ ఎలకా్ట్రనిక్స్ తయారీకి ఉపయోగించుకునే అవకాశం ఏర్పడుతుంది. ఐఎస్ఎం 2.0 ద్వారా సెమీ కండక్టర్‌కు రూ.40 వేల కోట్లు కేటాయించారు. టెక్స్‌టైల్ సెక్టార్‌కు ఊతమిచ్చారు. ఇవి మన రాష్ట్రానికి ఎంతో ఉపకరిస్తాయి. కేంద్ర బడ్జెట్‌లో పర్యాటకానికి, ఆతిథ్య రంగానికి ప్రాధాన్యం ఇచ్చారు.’ అని చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.