Share News

కేంద్ర నిధులు మురిగిపోతే అధికారులదే బాధ్యత

ABN , Publish Date - Feb 10 , 2026 | 03:40 AM

ప్రభుత్వ శాఖలన్నీ కేంద్ర పథకాల ద్వారా వచ్చిన నిధుల్ని తక్షణం ఖర్చు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అవి మురిగిపోతే అధికారులనే బాధ్యులను చేస్తామని హెచ్చరించారు.

కేంద్ర నిధులు మురిగిపోతే అధికారులదే బాధ్యత

  • వాటిని తక్షణమే ఖర్చుచేయాలి: ముఖ్యమంత్రి

  • వ్యాపారులను వేధించొద్దు

  • పన్నులు పూర్తిస్థాయిలో వసూలు చేయాలి

  • దేవదాయ శాఖ పనితీరుపై అసంతృప్తి

  • ఆన్‌లైన్‌పై శాఖలన్నిటికీ మార్చి 31 డెడ్‌లైన్‌

  • అన్ని వర్గాల అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి

  • సంక్షేమంతోనే అసమానతలు తగ్గుతాయి

  • సమష్టి కృషితో లాభాల బాటలో విశాఖ స్టీల్‌

  • మంత్రులు, కార్యదర్శుల భేటీలో చంద్రబాబు

19 నెలల్లో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలనూ గాడిన పెట్టాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నాం. సంక్షేమ పథకాలు అవసరమా అనే చర్చను లేవనెత్తుతున్నారు. కానీ అసమానతలు తగ్గించేందుకు, జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి అవి అవసరమే.

- చంద్రబాబు

అమరావతి, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ శాఖలన్నీ కేంద్ర పథకాల ద్వారా వచ్చిన నిధుల్ని తక్షణం ఖర్చు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అవి మురిగిపోతే అధికారులనే బాధ్యులను చేస్తామని హెచ్చరించారు. మంత్రులు, అధికారులు టెక్నాలజీని అందిపుచ్చుకోవడం లేదని ఆక్షేపించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులతో ముఖాముఖి సమావేశం జరిగింది. ఇందులో కలెక్టర్లు కూడా వర్చువల్‌గా పాల్గొన్నారు. సీఎం మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ఖజానాకు నష్టం రాకూడదు. పన్నులు పూర్తిస్థాయిలో వసూలు చేయాలి. అలాగని వ్యాపారులను వేధించి వసూలు చేయొద్దు’ అని చెప్పారు. ఆన్‌లైన్‌ సేవలు, వాట్సాప్‌ గవర్నెన్స్‌ వినియోగం, ప్రచారంలో ఆశించిన ఫలితాలు రావడం లేదన్నారు. ‘టెక్నాలజీని ప్రజలు వాడరు. మనమూ వాడడం లేదు. ఇప్పటికీ కొందరు మంత్రులు, హెచ్‌వోడీలు టెక్నాలజీని భూతంలా చూస్తున్నారు. ఈ విషయంలో వెనక్కి వెళ్లేది లేదు. ఇకపై శాఖల వారీగా కూడా నివేదికలు కోరతాం’ అని తేల్చిచెప్పారు. కొన్ని శాఖలు చాలా పాతకాలం విధానాలనే పాటిస్తున్నాయన్నారు. ‘మనమిత్ర’ వినియోగంలో దేవదాయ శాఖ పనితీరుపై పెదవి విరిచారు. ఆ శాఖకు మళ్లీ చెప్పనని.. తీరు మారాలని హెచ్చరించారు. ఇప్పటికీ 91ు సేవలు మాన్యువల్‌గానే ఉన్నాయని, టికెట్లు కూడా ఆన్‌లైన్‌లో పెట్టలేకపోతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. గతం కంటే ఇప్పుడు మాన్యువల్‌ సేవల వినియోగం పెరిగిన శాఖల నుంచి వివరణ కోరాలని అధికారులను ఆదేశించారు. కళ్లు మూస్తే అందరూ కలిసి దీనిని ఫెయిల్‌ చేస్తారని కటువుగా వ్యాఖ్యానించారు. మార్చి 31 డెడ్‌లైన్‌గా పెట్టుకుని అన్ని శాఖలూ ఆన్‌లైన్‌లోకి మారాలన్నారు. ఏఐ వినియోగంలో సమస్యలు పరిష్కరించేవారికి ప్రైజ్‌ మనీ ఇస్తే బాగుంటుందని ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్‌ సూచించగా సీఎం అంగీకరించారు. వెంటనే నిధులివ్వాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. రిజర్వాయర్లలో నీట మట్టాలను వెల్లడించే రిజర్వాయర్‌ సెన్సస్‌ అమలుపై సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. దీని అమలులో ఎందుకు ఆలస్యం జరుగుతోందని ప్రశ్నించారు. వెంటనే ఆ కాంట్రాక్టరును తన వద్దకు తీసుకురావాలని.. ఒకవేళ రాకపోతే పోలీసులను పంపించి తీసుకొస్తామని హెచ్చరించారు. ఇష్టముంటే చేయాలని లేదంటే.. వదిలేసి వెళ్లిపోవాలన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..


అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లకు కేవైసీ..

అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లపై కలెక్టర్లు చొరవ చూపాలి. 1,04,727 పీడీ ఖాతాల్లో ఉన్న అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్ల విలువ రూ.148 కోట్లు. ఈ పీడీ ఖాతాలన్నిటికీ కేవైసీ సమర్పించాల్సి ఉండగా రూ.34 కోట్ల డిపాజిట్లకు చెందిన 7,742 ఖాతాలకు మాత్రమే కేవైసీ చేయించారు. సంస్కరణల ప్రాతిపదికన సాస్కీ కింద వచ్చే ప్రాజెక్టుల నిధులు త్వరితగతిన వచ్చేలా చూడాలి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రాష్ట్రానికి రూ.26,021 కోట్లు వచ్చే అవకాశముంది. ఈ నిధులను ఎప్పటికప్పుడు ఖర్చు చేసి యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు సమర్పించాలి. గత ప్రభుత్వం ఆర్థిక విషయాల్లో దుర్మార్గంగా వ్యవహరించింది. 14 శాతం వడ్డీకి రుణాలు తెచ్చి అప్పుల భారం మోపింది. వాటిని 9 శాతానికి తగ్గించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాం. కానీ కొన్ని బ్యాంకులు ఆంగీకరించడం లేదు. మన ఆర్థిక పరిస్థితి ఇలా ఉంటే.. మీరేమో (అధికారులు) కేంద్ర నిధులు వాడరు.. పైగా మాకు సలహాలిస్తారు. జీరామ్‌జీ పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. ఎక్సైజ్‌, వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ర్టేషన్లు, పురపాలక విభాగాలన్నీ సమర్థంగా పనిచేయాలి. అటవీ శాఖ ఎర్రచందనం విక్రయించి ఆదాయం సంపాదించాలి. పరిశ్రమలకు అనుమతులు సులభతరం చేయాలి. ఒక రైస్‌ మిల్లు పెట్టాలంటే 39 కార్యాలయాల్లో అనుమతులు తీసుకోవాలంటే ఎలా?


నిబద్ధతతో అమలుచేయాలి..

ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వాటిని నిబద్ధతతో క్షేత్ర స్థాయిలో అమలుచేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది. సూపర్‌ సిక్స్‌ సూపర్‌ హిట్‌ అయింది. రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌గా, కోస్తాను ఆక్వా హబ్‌గా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టాం. ధాన్యం కొనుగోళ్లకు రూ.10,000 కోట్లను 48 గంటల్లో చెల్లించేశాం. సాగునీటి ప్రాజెక్టులకు ఇప్పటివరకూ రూ.24,000 కోట్లు ఖర్చు చేశాం. విశాఖలో గూగుల్‌, ఇతర సంస్థలు కూడా డేటా సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నాయి. రోడ్ల మరమ్మతుల కోసం రూ.1,000 కోట్లు ఖర్చు చేశాం. మరో రూ.3,000 కోట్లతో రోడ్లు నిర్మిస్తున్నాం. 9.88 శాతం వృద్ధిరేటు సాధించాం. త్వరలో రెండంకెల వృద్ధిరేటు సాధిస్తాం. పోలవరం ప్రాజెక్టును 2027 పుష్కరాల నాటికి పూర్తిచేసి జాతికి అంకితం చేస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పూర్తి సహకారంతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ లాభాల బాటలో పడింది. పాత చట్టాలు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా లేవు. వాటిని పూర్తిగా తొలగిద్దాం. 2-3 రోజుల్లో అన్ని శాఖల్లో ఉన్న పాత చట్టాలను బయటకు తీయాలి. ఈ బడ్జెట్‌ సమావేశాల్లోనే పాత చట్టాలను తొలగించడం లేదా సవరణ చేసే ప్రక్రియ పూర్తి కావాలి.

తాడేపల్లి హెలిప్యాడ్‌ కోసం అధికార దుర్వినియోగం

తాడేపల్లి ప్యాలెస్‌ వద్ద హెలిప్యాడ్‌ కోసం ఓ ప్రైవేటు భూమిని అమ్మాలంటూ యజమానిని ఒత్తిడి చేయగా ఆయన నిరాకరించారు. దీంతో ఆ భూమిని 22ఏలో పెట్టేసి అధికార దుర్వినియోగం చేశారు. ఇది ఒక్క తాడేపల్లిలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా జరిగింది. భూవివాదాలు లేకుండా పకడ్బందీగా సర్వే ప్రక్రియ చేపడుతున్నాం. క్యూఆర్‌ కోడ్‌తో సహా ఇతర భద్రతా ఫీచర్లతో రాజముద్రతో కూడిన పాస్‌ పుస్తకాలు అందిస్తున్నాం.


లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలి: ఉపముఖ్యమంత్రి

రాష్ట్రాభివృద్ధి కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. పల్లెపండుగ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని మంత్రులు, కార్యదర్శులకు గుర్తు చేశారు. జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా 28,000 కోట్ల విలువైన పనులు మంజూరయ్యాయని, రూ.10,000 కోట్ల పనులు జరుగుతున్నాయన్నారు. అటవీ శాఖ ద్వారా నగర వనాలతో పాటు వివిధ కార్యక్రమాలను చేపడుతున్నట్టు వెల్లడించారు. నిధుల కొరత ఉన్నప్పటికీ నిర్దేశిత గడువులోగా లక్ష్యాలను చేరుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి ప్రధాని మోదీ పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపారు.

Updated Date - Feb 10 , 2026 | 03:41 AM