Veligonda Project: 24న వెలిగొండకు చంద్రబాబు
ABN , Publish Date - Jan 19 , 2026 | 04:08 AM
సీఎం చంద్రబాబు ఈ నెల 24న మార్కాపురం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు క్షేత్ర పర్యటనకు వెళ్లనున్నారు.
అమరావతి, జనవరి 18(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు ఈ నెల 24న మార్కాపురం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు క్షేత్ర పర్యటనకు వెళ్లనున్నారు. దావోస్ నుంచి వచ్చిన వెంటనే వెలిగొండకు వెళ్తానని ఆయన జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి తదితరులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్టును ఈ ఏడాదిలో వేగంగా పూర్తి చేయాలన్న ఆకాంక్షతో పాటు ఎన్నికలకు ముందు పనులు పూర్తికాకున్నా ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేసిన నాటి సీఎం జగన్ చేసిన మోసాన్ని రాష్ట్ర ప్రజల ముందుంచే ద్విముఖ వ్యూహంతో ప్రభుత్వం ఉంది. వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్‌తో సహా ప్రధాన పనులు పూర్తికాకుండానే దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రకాశం జిల్లా వాసులను మోసగించేలా.. జగన్ ఎన్నికలకు ముందు 2024 మార్చిలో ప్రాజెక్టును అట్టహాసంగా ప్రారంభించారు. ప్రాజెక్టుకు సమీపంలోనే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపడితే.. జగన్ నిర్వాకం బయటపడుతుందని, దూరంగా బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ నెల 24 నాటి పర్యటనలో ఇంకా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు పనులను ప్రజలకు ప్రత్యక్షంగా చూపించడం ద్వారా జగన్ మోసాన్ని బట్టబయలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పెండింగ్ పనులన్నీ ఈ ఏడాదిలోనే పూర్తి చేయడం ద్వారా ప్రాజెక్టులపై ఉన్న చిత్తశుద్ధిని ప్రజలకు చెప్పాలని భావిస్తోంది.
ప్రాజెక్టు పూర్తికి రూ.2,041 కోట్లు అవసరం
వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే రూ.2,041.98 కోట్లు వ్యయం చేయాల్సి ఉంది. టన్నెళ్లు, ప్రధాన కాలువ పనులకు రూ.637.43 కోట్లు అవసరం. కాలువలు, డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ కోసం రూ.341.68 కోట్లు అవసరమవుతాయి. సహాయ, పునరావాసం పనుల కింద ఏడు కాలనీల నిర్మాణం కోసం రూ.37 కోట్లు కావాలి. 7,321 నిర్వాసిత కుటుంబాల కోసం రూ.886.55 కోట్లు అవసరమవుతాయి. భూసేకరణ (1233.41 ఎకరాలు) కోసం రూ.139.32 కోట్లు కావాలి. ఈ పనులన్నింటినీ ఈ ఏడాది జూన్ నాటికి పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థ హామీ ఇస్తోంది.