Field Inspection: రెవెన్యూ సమస్యలు పరిష్కారం అవుతున్నాయా?
ABN , Publish Date - Jan 09 , 2026 | 05:52 AM
రైతులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంపై ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు రెవెన్యూ శాఖకు కీలక కార్యాచరణ అప్పగించారు.
నేడు క్షేత్రస్థాయి పరిశీలనకు చంద్రబాబు
తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో రైతులు, రెవెన్యూ సిబ్బందితో ముఖాముఖి
అమరావతి/రాజమహేంద్రవరం, జనవరి 8(ఆంధ్రజ్యోతి): రైతులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంపై ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు రెవెన్యూ శాఖకు కీలక కార్యాచరణ అప్పగించారు. దాని అమలు ఎలా ఉందో తెలుసుకోవడానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా శుక్రవారం తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో పర్యటించనున్నారు. అక్కడ జరుగుతున్న భూముల సర్వే, పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ, ఇతర రెవెన్యూ అంశాలపై రైతులతో సీఎం నేరుగా మాట్లాడతారు. క్షేత్ర స్థాయి పరిశీలనకు రైతుల భూముల వద్దకే ముఖ్యమంత్రి వెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాత రీసర్వే తీరు, గ్రామంలో రైతుల సమస్యలు, వాటికి ప్రభుత్వ పరిష్కారాలు, సిబ్బంది పట్ల రైతుల అభిప్రాయాలు ఇలా అనేక అంశాలపై సీఎం రైతులు, రెవెన్యూ అధికారులతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు. ఈ పర్యటనలో సీఎంతో పాటు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రెవెన్యూ ప్రత్యేక సీఎస్ జి.సాయిప్రసాద్, సీసీఎల్‌ఏ జి. జయలక్ష్మి, సర్వే డైరెక్టర్ కూర్మనాథ్, అదనపు సీసీఎల్‌ఏ వెంకట మురళితో పాటు పలువురు రెవెన్యూ అధికారులు పాల్గొంటారు. జగన్ హయాంలో జరిగిన రీసర్వే 1.0లో సమస్యలు, వాటికి పరిష్కారం దొరక్కపోవడం, ప్రస్తుతం జరుగుతున్న రీసర్వే 2.0లో రైతులు, భూ యజమానులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్న ఉదంతాలను ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చింది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రెవెన్యూశాఖ సమీక్ష నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులను రీసర్వే జరుగుతున్న గ్రామాలకు వెళ్లి రైతులు, భూ యజయానులతో మాట్లాడాలని, సమస్యలేమిటో తెలుసుకొని స్థానికంగానే పరిష్కారం చూపాలని సమీక్షలో చంద్రబాబు ఆదేశించారు. ఇప్పుడు స్వయంగా క్షేత్రస్థాయిలో రీసర్వే తీరు, పాస్‌పుస్తకాల అంశాన్ని పరిశీలించాలని నిర్ణయించి రాయవరం వెళుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆ గ్రామానికి తీసుకెళ్లడం ద్వారా రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ చిత్తశుద్ధి చాటిచెప్పాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన. రైతుల సమస్యలకు పరిష్కారాలు అక్కడే అధికారులతో చెప్పించే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు హెలీకాప్టర్‌లో ఉదయం 11 గంటలకు రాయవరం చేరుకుంటారు. ఉదయం 11.20 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు. పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తారు. 12.05 నుంచి 1.30 గంటల వరకూ ప్రజావేదిక సమావేశంలో పాల్గొంటారు. 2.05 నుంచి 3.35 వరకూ టీడీపీ కార్యకర్తలతో సమావేశమవుతారు. అంతకుముందు రాయవరంలో దివంగత మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. 3.45కి తాడేపల్లికి తిరుగుప్రయాణం అవుతారు.