వైసీపీది దింపుడుకళ్లం ఆశ!
ABN , Publish Date - Mar 31 , 2026 | 04:37 AM
ప్రభుత్వ వ్యతిరేకత, అసహనం వస్తాయని వైసీ పీ దింపుడు కళ్లం ఆశ పెట్టుకుని కూర్చుందని.. అది జరగదని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు.
ప్రభుత్వ వ్యతిరేకత కోసం చూస్తోంది.. అది జరగదు: సీఎం
ఎన్నికలప్పుడు నాయకులను వెతకడం ఇక ఉండదు
30 ఏళ్లు స్థిరంగా ఉండే నాయకత్వాన్ని తయారుచేస్తాం
కార్యకర్తలను కాచుకుంటాం.. ఒకట్రెండు రోజుల్లో రాష్ట్ర కమిటీలు: బాబు
కొందరు కార్యకర్తలు పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్నారు. త్వరలోనే యాక్షన్ ప్లాన్ అమలు చేసి కార్యకర్తలను ఆర్థికంగా బలోపేతం చేస్తాం. ఎథికల్ ఎకనమిక్ ఎంపవర్‌మెంట్ ద్వారా ఆదాయం పెంచే ప్రణాళికలు చేస్తున్నాం.
- టీడీపీ అధినేత చంద్రబాబు
తిరుపతి/నాయుడుపేట, మార్చి 30(ఆంధ్రజ్యోతి ): ప్రభుత్వ వ్యతిరేకత, అసహనం వస్తాయని వైసీ పీ దింపుడు కళ్లం ఆశ పెట్టుకుని కూర్చుందని.. అది జరగదని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. గత ఎన్నికల క న్నా ఇప్పుడు మనం మెరుగైన స్థా నంలో ఉన్నామని కార్యకర్తలతో అన్నారు. అభివృద్ధి, సుపరిపాలన, సంక్షేమ కార్యక్రమాలతో నియోజవర్గాలు దూసుకుపోతున్నాయని చెప్పా రు. సోమవారం తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేశారు. ఎన్నికలప్పుడు నాయకులను వెతికే సంప్రదాయాని కి ఫుల్‌స్టాప్ పెడుతున్నామన్నారు. రాబోయే 30 ఏళ్ల పాటు నాయకత్వం స్థిరంగా కొనసాగేలా ప్రణాళికలు వే స్తున్నామని తెలిపారు. కార్యకర్తను కళ్లలో పెట్టి చూసుకుంటామని.. పనిచేసేవారిని వెతుక్కుంటా వచ్చి దండ వే సి అభినందిస్తామన్నారు. రాజకీయాల్లో ఎత్తుగడలు ఉండాలని.. అప్పుడే గెలుపు సాధ్యమవుతుందని చెప్పా రు. 2019-24 కాలంలో వైసీపీ నాయకులు సమాజా న్ని అతలాకుతలం చేశారని.. ఎప్పుడూ చూడని విధ్వంసం చూశామని తెలిపారు. ఆ సమయంలో కార్యకర్తలను కాపాడుకోవడానికి రాత్రింబవళ్లూ మేలుకొన్నానని.. ప్రతి అడుగూ చాలా జాగ్రత్తగా వేశానని చెప్పారు. ‘మనల్ని మనం కాపాడుకోవడంతోపాటు ప్రజా చైతన్యం నింపడం మరో బాధ్యత. బీజేపీతో కలిసి ఉన్నప్పటికీ.. టీడీపీ పొత్తుతో ముందుకు పోతామని చెప్పిన పార్టీ జనసేన. తర్వాత బీజేపీ కలిసింది. పొత్తు లేకపోయినా గెలిచేవాళ్లమేమో! కానీ ఇంత మెజారిటీ వచ్చేది కాదు. నమ్మ కం, నిజాయితీతో 94 శాతం విజయాన్ని అందించిన ఘనత ప్రజలది. అభ్యర్థి ఎవరైనా రా ష్ట్రాన్ని, పార్టీని కాపాడుకోవాలని కార్యకర్త ప్రాణం పెట్టి పనిచేశారు. ప్రజలు సహకరించారు. దాదాపు 10 ఎన్నికలు చూశాను. 6 ఎన్నికల్లో గెలిచాం. ఈసా రి ఎప్పుడూ రానంత మెజారిటీ వచ్చిందంటే మీరు ఐక్యంగా పనిచేయ డం, వైసీపీపై వ్యతిరేకత ప్రధాన కారణాలు. మనం అప్రమత్తంగా ఉంటే మనల్ని ఓడించే శక్తి ఎవరికీ లేదు’ అని తేల్చిచెప్పారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..
సమర్థులకే పదవులు..
ఒకట్రెండు రోజుల్లో పార్టీ రాష్ట్ర కమిటీలు నియమిస్తు న్నాం. 60 వేల మంది కార్యకర్తలకు రేటింగ్ ఇచ్చా. ఎవరెవరు సమర్థంగా వ్యవహరిస్తున్నారో నావద్ద జాబితా ఉంది. ఆ మేరకే పదవుల్లో ప్రాధా న్యం ఉంటుంది. టీడీపీ శాశ్వతంగా అధికారంలో ఉండాలి. పదవులు అందరికీ వచ్చేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఎవరూ పుట్టుకతో నాయకుడు కాడు. ఎన్టీఆర్, అంబేడ్కర్, గాంధీజీ, నరేంద్రమోదీ, నాతో సహా కష్టపడ్డవాళ్లమే. తెలుగుజాతి ఎవరికీ ఇవ్వని గౌరవాన్ని నాకు ఇచ్చింది. దానిని నిలబెట్టుకుంటున్నా. పింఛన్ల సమయంలో మీరు కూడా అధికారుల వెంట ఉండాలి. రాష్ట్రవ్యాప్తంగా 63 లక్షల కుటుంబాలకు పింఛను ఇస్తున్నాం. వారిలో 80 శాతం ఓట్లు రావాలి కదా! నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేసేస్తున్నామని ప్రజలతో కలుపుగోలుతనంగా లేకపోతే నష్టమే. త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో గెలవకుంటే ఆ సీట్లో ఉన్న వ్యక్తిని మార్చేయాల్సి వస్తుంది.
వలస పక్షులతో జాగ్రత్త..
సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మొన్నటివరకు ఓ డాక్టర్. టీడీపీ సీటు ఇవ్వడంతో ఆమె ఎమ్మెల్యే అయ్యారు. కార్యకర్తలు ప్రాణం పెట్టి పనిచేస్తేనే ఎవరైనా గెలుస్తారు. అందరూ ఇది గుర్తుపెట్టుకోవా లి. అధికారంలోకి వచ్చాక అడ్డగోలుగా చేసేసుకోవాలనే నాయకులు 10శాతం ఉంటా రు. ఇలాంటి కోవలో వలస పక్షులు ఎక్కువగా ఉంటాయి. అధికారం ఎటుంటే అటు వాలిపోతుంటాయి.. పులికాట్ సరస్సుకు పక్షులు వచ్చినట్లు! వీళ్లను గమనించాలి.