ఉగ్రవాద ముఠాల తరహాలో జగన్ ఆపరేషన్!
ABN , Publish Date - Sep 24 , 2026 | 03:54 AM
ధర్నాలు.. ఆందోళనల పేరుతో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం గొడ్డలి పార్టీ నేతలకు ఆనవాయితీగా మారిందని, దీనిని కట్టడి చేసేందుకు రైల్వే భద్రత చట్టం తరహాలో కఠిన చట్టం తీసుకురావలసిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
ఉగ్రవాద ముఠాల తరహాలో జగన్ ఆపరేషన్!
బెంగళూరులో కూర్చుని రాష్ట్రంలో ధ్వంసరచన: సీఎం
శాప్ ఆఫీసుపై దాడి చేసినవారితోఅర్ధరాత్రి వరకూ జగన్ మంతనాలు
ప్రభుత్వ ఆస్తుల ధ్వంసంవారికి ఆనవాయితీగా మారింది
వీటి కట్టడికి రైల్వే భద్రత చట్టం తరహాలో కఠిన చట్టం తేవాలి
నేటికల్లా ముసాయిదా సిద్ధం చేయండి
వైసీపీ గూండాల దాడిని ఎండగట్టాలి
స్థానికంలో అన్ని స్థానాలూ గెలవాలి
కూటమి ఐక్యతకు విఘాతం కలగొద్దు
క్యాబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు
సమష్టిగా సాగుదాం.. సమన్వయ భేటీలో ఎన్‌డీఏ నిర్ణయం
అమరావతి, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ధర్నాలు.. ఆందోళనల పేరుతో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం గొడ్డలి పార్టీ నేతలకు ఆనవాయితీగా మారిందని, దీనిని కట్టడి చేసేందుకు రైల్వే భద్రత చట్టం తరహాలో కఠిన చట్టం తీసుకురావలసిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. జగన్ ఆపరేషన్ అంతా ఉగ్రవాద ముఠాల తరహాలో ఉంటోందన్నారు. బెంగళూరులో కూర్చుని రాష్ట్రంలో ధ్వంస రచనకు ప్రణాళికలు రచిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయం ముసుగు కప్పుకొని రౌడీయిజం చేస్తున్నారని ధ్వజమెత్తారు. శాప్ కార్యాలయం వద్ద విధ్వంసం సృష్టించినవారిని తన వద్దకు పిలిపించుకుని జగన్ అర్ధరాత్రి వరకు మంతనాలు చేయాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో అజెండా అంశాలపై చర్చ తర్వాత రాజకీయ, వర్తమాన అంశాలపై ముఖ్యమంత్రి సహచరులతో మాట్లాడారు. ప్రధానంగా శాప్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులపై గొడ్డలి పార్టీ గూండాల దాడి, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసంపై చర్చ జరిగింది. టీచర్లపై దాడి ఒక ఎత్తయితే.. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వైసీపీ రౌడీయిజానికి పరాకాష్ఠగా సీఎం అభివర్ణించారు.
‘రైల్వే ఆస్తులకు నష్టం కలిగిస్తే పదేళ్ల నుంచి జీవితఖైదు కూడా విధించేలా చట్టాలు ఉన్నాయి. నాన్‌బెయిలబుల్ క్రిమినల్ కేసులు పెట్టేలా రైల్వే భద్రత చట్టాన్ని రూపొందించారు. నిందితుల నుంచి నష్టపరిహారాన్ని కూడా రాబడతారు. రాష్ట్రంలోనూ అదే స్థాయిలో కఠిన చట్టాన్ని రూపొందించాలి. దీని ముసాయిదాను గురువారం నాటికి నా ముందుంచాలి’ అని ఆదేశించారు. వైసీపీ గూండాలు శాప్ కార్యాలయం వద్ద చేసిన విధ్వంసాన్ని పత్రికల్లో ప్రజలకు అర్థమయ్యేలా రాశారని.. మంత్రులు కూడా వారి దాడిని ఎండగట్టాలని ఆదేశించారు.
స్థానిక ఎన్నికలను సీరియ్‌సగా తీసుకోండి..
స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలూ గెలిపించుకుని రావలసిన బాధ్యత ఇన్‌చార్జి మంత్రులదేనని సీఎం స్పష్టం చేశారు. వీటిని నాయకులంతా సీరియస్‌గా తీసుకోవాలన్నారు. ఎన్నికల సంఘం ఎప్పుడు షెడ్యూల్ ప్రకటించినా ప్రభుత్వం సన్నద్ధంగా ఉందన్నారు. స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీల ఐక్యత ఎంతో కీలకమని, దానికి ఎట్టి పరిస్థితుల్లో విఘాతం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టంచేశారు. కాగా, రాష్ట్రంలో పడుతున్న వర్షాలు ఆశాజనకంగా ఉన్నాయని, మున్ముందు వర్షాలు పడకపోయినా రైతులకు నష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని సీఎం అన్నారు. అవసరమైతే వెదర్ ఇన్సూరెన్స్ చేయించే అంశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. ఉత్తరాంధ్రలో తుఫాను వల్ల ఎలాంటి నష్టం జరగకుండా తగిన ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.