త్వరలో స్థానిక ఎన్నికలు నిర్వహిద్దాం
ABN , Publish Date - May 08 , 2026 | 05:21 AM
రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికలు నిర్వహిద్దామని సీఎం చంద్రబాబు అన్నారు. స్వర్ణాంధ్ర విజన్-2047 సాధన కోసం రూపొందించిన 10 సూత్రాలపై గురువారం నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన సమీక్షించారు.
లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గిస్తే మరింత అభివృద్ధి సాధ్యం
పారిశ్రామిక పార్కులకు రోడ్, రైలు అనుసంధానం పెరగాలి
రాష్ట్రవ్యాప్తంగా 15 లేబర్ అడ్డాల నిర్మాణం
స్వర్ణాంధ్ర విజన్-2047 సాధన కోసం రూపొందించిన 10 సూత్రాలపై కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు సమీక్ష
అమరావతి, మే 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికలు నిర్వహిద్దామని సీఎం చంద్రబాబు అన్నారు. స్వర్ణాంధ్ర విజన్-2047 సాధన కోసం రూపొందించిన 10 సూత్రాలపై గురువారం నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించగలిగితే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ‘రైలు మార్గం ద్వారా ప్రతి కిలోమీటరుకు రూ.1.83 వ్యయం అవుతుంటే రహదారి మార్గంలో జరిగే రవాణాపై రూ.3.40 ఖర్చవుతోంది. రవాణా వ్యయం గణనీయంగా తగ్గించగలిగితేనే రాష్ట్రానికి పూర్తిస్థాయిలో ప్రయోజనాలు అందుతాయి. పారిశ్రామిక పార్కులకు రోడ్, రైలు కనెక్టివిటీ పెరగాలి. రాష్ట్రానికి రూ.లక్ష కోట్లకు పైగా విలువైన 64 జాతీయ రహదారి ప్రాజెక్టులు వస్తున్నాయి. రూ.64,000 కోట్ల విలువైన 624 రైల్వే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. వీటితో పాటు రూ.2లక్షల కోట్ల ప్రాజెక్టులు డీపీఆర్ దశలో ఉన్నాయి. ఎక్స్‌ప్రెస్, లోకల్ ట్రైన్స్ వంటి ప్రాజెక్టులు రాబోతున్నాయి. నాలుగు లేన్లతో రైల్వే మార్గాల విస్తరణ జరగబోతోంది. ఆర్వోబీలను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి. లాజిస్టిక్స్ పార్కులు వస్తే ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువ పడే అవకాశం ఉంది. దీనికి తగ్గట్టు కలెక్టర్లు ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాధార పంటలు, మెట్ట పంటలు, ఉద్యాన పంటలకు అనుగుణంగా నీటి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.
పశువుల దాణాకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రీన్ కవర్ పెరిగేలా అటవీశాఖ చర్యలు తీసుకోవాలి. స్వచ్ఛరథాల ద్వారా వ్యర్థాల సేకరణ, స్వచ్ఛ రహదారుల శుభ్రతపై దృష్టి పెట్టండి’ అని సూచించారు. ‘రాష్ట్రవ్యాప్తంగా 15 లేబర్ అడ్డాలు నిర్మిస్తున్నాం. పనికోసం రోడ్లమీద వేచి ఉండకుండా ఈ అడ్డాల్లో కూర్చుంటారు. పనిలేని సమయంలో అక్కడ కార్మికులకు నైపుణ్య శిక్షణ ఇస్తాం. సోలార్ రూఫ్‌టాప్, కుసుమ్ స్కీమ్‌లను అనుసంధానించి ప్రభుత్వ కార్యాలయాలపై సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలి. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలి. భవిష్యత్‌లో విద్యుత్ కొనుగోలుకు పైసా కూడా ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేనంతగా ప్రభుత్వ కార్యాలయాల వద్ద సోలార్ ఉత్పత్తి జరగాలి. పీఎం కుసుమ్ పథకం ద్వారా 22 లక్షల పంపుసెట్లకు సోలార్ పవర్ పెట్టుకుని ప్రయోజనాలు పొందవచ్చు’ అని సీఎం పేర్కొన్నారు.
కలెక్టర్లకు కార్యదర్శుల దిశానిర్దేశం
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఇంకా అందని కుటుంబాలకు అవి చేరేలా చర్యలు తీసుకోవాలని ఆర్థిక, ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి పీయూష్ కుమార్ సూచించారు. సీబీజీని సీఎన్‌జీతో కలిపి తయారుచేసే గ్యాస్ ఉత్పత్తి కార్యకలాపాలను యుద్ధప్రాతిపదికన ముందుకు తీసుకెళ్లాలని సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ చెప్పారు. పీఎం కుసుమ్ ద్వారా ప్రారంభించిన ప్లాంట్లను డిసెంబరు నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. విజయనగరం, విశాఖ, కాకినాడ, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు పనుల్లో వేగం పెంచాలన్నారు. కొత్త పోర్టులు, ఎయిర్‌పోర్టులకు సంబంధించి భూసేకరణ అడ్డంకులు తొలగించి ప్రక్రియ వేగవంతం చేయాలని కలెక్టర్లకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు సూచించారు. ఎయిర్‌పోర్టులకు సంబంధించి కలెక్టర్లు వ్యక్తిగతంగా తనిఖీ చేశాకే ప్రతిపాదనలు పంపాలని చెప్పారు. మార్కాపురం, మన్యం, పల్నాడు, నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాలు 15వ తేదీ నాటికి స్కిల్ డేటాను సమర్పించాలని నైపుణ్య శిక్షణ శాఖ కార్యదర్శి కోన శశిధర్ ఆదేశించారు. పీఎం సేతును పూర్తిస్థాయిలో ఉపయోగించుకుని ఐటీఐలను ప్రపంచస్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దాలని సూచించారు. ఈ పథకానికి ఐదేళ్లలో రూ.4,000 కోట్ల కేటాయింపులు ఉన్నాయని, ఇందులో 50శాతం కేంద్రం, రాష్ట్రం 33శాతం, పరిశ్రమలు 17శాతం ఖర్చు భరిస్తాయని వివరించారు. కలెక్టర్లు ఈ నిధులను వాడుకొని విద్యార్థుల నైపుణ్యాలు పెంచాలని పేర్కొన్నారు.
విద్యాశాఖకు ఒకే డ్యాష్‌బోర్డు
మంత్రి లోకేశ్
‘విద్యాశాఖ మొత్తానికి ఒకే డ్యాష్‌బోర్డు తీసుకొస్తున్నాం. పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్యల సూచీలు, విద్యార్థుల హాజరు, డ్రాపవుట్లు, మధ్యాహ్న భోజనం తదితర అంశాలన్నీ కేపీఐ డ్యాష్‌బోర్డులో ఉంటాయి’ అని మంత్రి లోకేశ్ తెలిపారు. ఫలితాలు మెరుగుపర్చుకునేందుకు ఈ బోర్డు కలెక్టర్లకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.