ప్రజల ప్రాణాలే ప్రభుత్వ ప్రాధాన్యం
ABN , Publish Date - May 23 , 2026 | 06:27 AM
ఎండ తీవ్రత, వడగాడ్పుల దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ, ప్రజలను రక్షించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
ఎండ తీవ్రత, గాడ్పులపై అప్రమత్తంగా ఉండాలి
అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
అమరావతి, మే 22(ఆంధ్రజ్యోతి): ఎండ తీవ్రత, వడగాడ్పుల దృష్ట్యా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంటూ, ప్రజలను రక్షించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. శుక్రవారం అమరావతి సచివాలయంలో సీఎం అత్యవసర సమీక్ష నిర్వహించారు. ‘రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్రాంతాలను గుర్తించి, ఆ ప్రాంత ప్రజలకు నిరంతరం హెచ్చరికలు పంపాలి. ఎండ తీవ్రత మరీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పరిస్థితులను బట్టి, స్థానికంగా సెలవులు ప్రకటించాలి. ప్రజలకు ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం రద్దీ ప్రాంతాల్లో చల్లని మంచినీరు, మజ్జిగ, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలి. వడగాల్పుల నుంచి ఎలా రక్షించుకోవాలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్లు స్థానికంగా మీడియా సమావేశాలు నిర్వహించి, చెప్పాలి. మీడియాతో పాటు సామాజిక మాధ్యమాల ద్వారా నిరంతరం సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలి. ప్రజల ప్రాణాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం’ అని స్పష్టం చేశారు. ఎండ తీవ్రత నేపథ్యంలో 11గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకుండా ఉండాలని సూచించారు. ఈ అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవటానికి కలెక్టర్లు, మండల స్థాయి అధికారులు సన్నద్ధంగా ఉండాలన్నారు. ఎండతో ఇబ్బందిపడకుండా మూగ జీవాలు, పక్షులకు కూడా నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. ‘నీటి ఇబ్బందులున్న ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్లను ఏర్పాటు చేయాలి’ అని ఆదేశించారు రాష్ట్రంలో పచ్చదనం పెంపుపై దృష్టి సారించాలని సీఎం సూచించారు.