Share News

సంస్కరణలతో సంపద

ABN , Publish Date - Apr 26 , 2026 | 04:05 AM

‘‘సంస్కరణలు సంపదను సృష్టిస్తాయి. రెవెన్యూ వస్తేనే సంక్షేమం చేయగలం. అభివృద్ధితోపాటు సంక్షేమం కూడా కీలకమైన అంశం’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

సంస్కరణలతో సంపద

  • టెక్నాలజీతోనే అభివృద్ధి చెందుతాం

  • పారిశ్రామికాభివృద్ధితోనే సంక్షేమం సాధ్యం

  • పెట్టుబడులకు ఏపీలో విస్తృత అవకాశాలు

  • హైదరాబాద్‌ ప్లస్‌ నగరంగా అమరావతి

  • మహిళలు సంకల్పిస్తే బిల్లు అమలవుతుంది

  • ముంబై ఎకనామిక్‌ టైమ్స్‌ కార్యక్రమంలో సీఎం

  • ప్రధాని రిఫార్మర్‌.. పెర్ఫార్మర్‌.. విన్నర్‌ అని వ్యాఖ్య

  • బెస్ట్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా చంద్రబాబు

  • అవార్డు అందించిన నిర్మలా సీతారామన్‌

అవార్డును స్వీకరించడం సంతోషంగా ఉంది. దీని ద్వారా మరికొన్ని పెట్టుబడులు ఏపీకి వస్తాయని ఆశిస్తున్నాను. ఏపీలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు రావాలని ఈ వేదిక నుంచి పారిశ్రామికవేత్తలను కోరుతున్నాను. ఏపీలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు ఇది సరైన సమయం. రాష్ట్రంలో స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌, స్పీడ్‌ ఆఫ్‌ డెలివరింగ్‌ గవర్నెన్స్‌ అనే విధానాల ద్వారా సుపరిపాలన అందిస్తున్నాం. ఏఐ డాక్టర్‌, ఏఐ ట్యూటర్‌, ఏఐ అగ్రానమి లాంటి సేవలు అందిస్తున్నాం.

- ముఖ్యమంత్రి చంద్రబాబు

అమరావతి, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): ‘‘సంస్కరణలు సంపదను సృష్టిస్తాయి. రెవెన్యూ వస్తేనే సంక్షేమం చేయగలం. అభివృద్ధితోపాటు సంక్షేమం కూడా కీలకమైన అంశం’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. నాలుగున్నర దశాబ్దాల తన రాజకీయ జీవితంలో సంస్కరణలకు ముందు, ఆ తర్వాతి భారతదేశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసే అవకాశం లభించిందని తెలిపారు. ముంబైలో ఎకనమిక్‌ టైమ్స్‌ ఎక్సలెన్స్‌ అవార్డుల కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. బెస్ట్‌ రిఫార్మర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ -2025 అవార్డును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేతుల మీదుగా ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. దేశంలో ఆర్థిక సంస్కరణల తర్వాత ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి సీఎంగా ఉండటం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సంస్కరణలకు అనుగుణంగానే విజన్‌ 2020ను అమలు చేశామని, ఇప్పుడు హైదరాబాద్‌ చూస్తున్న అభివృద్ధి ఫలాలు అవేనన్నారు.


ప్రధాని మోదీ కూడా ఇప్పుడు 2047 వికసిత్‌ భారత్‌కు రూపకల్పన చేశారని, అందులో ఏపీ అగ్రస్థానంలో ఉండాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు. 1990లో వచ్చిన ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకున్నామని, ఇప్పుడు క్వాంటం, ఏఐ లాంటి ఆధునిక టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చేశాయన్నారు. ఆ టెక్నాలజీలను అందిపుచ్చుకుని అభివృద్ధి దిశగా ఇప్పుడు ముందుకెళ్లాల్సి ఉందన్నారు. ‘‘భారత్‌కు అత్యుత్తమ ఫెర్మార్మర్‌.. రిఫార్మర్‌.. విన్నర్‌ ప్రధాని మోదీ. పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తేనే అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయి. మోదీ ప్రగతిశీల ఆలోచనలు ఉన్న నాయకుడు. నిబంధనల్ని సరళీకృతం చేయడం, పెట్టుబడుల్ని ప్రోత్సహించడం చేస్తున్నారు. పెట్టుబడులను ప్రోత్సహిస్తేనే సంపద పెరుగుతుంది.’’ అని స్పష్టం చేశారు.


విద్యుత్తు సంస్కరణలతో మిగులు సాధించాం

‘‘ఏపీలో విద్యుత్తు సంస్కరణలను అమలు చేసి మిగులు విద్యుత్తును సాధించాం. రాష్ట్రంలో వినియోగదారులకు మేలు కలిగేలా నియంత్రణ కమిషన్‌ను కూడా తీసుకొచ్చాం. సౌర, పునరుద్పాదక విద్యుత్తును పెద్ద ఎత్తున ప్రోత్సాహిస్తున్నాం. ఇప్పుడు గ్రీన్‌ ఎనర్జీ, బ్యాటరీ, పంప్డ్‌ స్టోరేజీ, గ్రీన్‌ అమ్మోనియా లాంటి రంగాల్లో విద్యుత్తు ఉత్పత్తి కావాలి. అప్పుడే ఇంధన రంగంలో భారత్‌ అగ్రస్థానంలో ఉంటుంది. డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌ లాంటి ఇంధనాలతోపాటు విద్యుత్తు ఉత్పత్తి అనేది కీలకం. తక్కువ వ్యయంతో విద్యుత్తు ఉత్పత్తి చేస్తేనే మనకు ప్రయోజనాలు ఉంటాయి. 500 గిగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ ఉత్పాదన చేయాలని ప్రధాని లక్ష్యం విధిస్తే అందులో ఏపీ 160 గిగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 90 గిగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి దిశగా ముందడుగు వేశాం. ప్రొజ్యూమర్‌ అనే విధానంలో పెద్ద ఎత్తున విద్యుత్తు ఉత్పాదన చేస్తాం. డేటా సెంటర్లకు పెద్ద ఎత్తున విద్యుత్తు కావాలి. గూగుల్‌ విశాఖలో 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెడుతోంది. ఈ నెల 28న విశాఖలో గూగుల్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నాం.’’

మహిళలు సంకల్పిస్తే రిజర్వేషన్‌ బిల్లు అమలు

‘‘మహిళా రిజర్వేషన్‌ బిల్లు విషయంలో కేంద్రం నిర్ణయం సరైనదే. లింగ సమానత్వం, మహిళలకు సమాన అవకాశం కల్పించేందుకు తీసుకువచ్చిన బిల్లు అది. మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకించాయో అర్థం కాని పరిస్థితి. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న సీట్ల కంటే 50 శాతం మేర సీట్లు పెరుగుతున్నాయి. మహిళలకు, పురుషులకు ఎక్కువ అవకాశాలు దక్కి ఉండేవి. కానీ ప్రతిపక్షాల తీరు వల్ల మహిళలు అవకాశం కోల్పోయారు. దేశంలోని మహిళలంతా గట్టిగా సంకల్పించుకుంటే ఈ బిల్లు ఎలాగైనా అమలవుతుంది. మూడు దశాబ్దాల క్రితం జనాభా నియంత్రణను గట్టిగా అమలు చేశాం. ఇప్పుడు జనాభా కొరతను ఎదుర్కొంటున్నాం. అందుకే జనాభా నిర్వహణ ప్రక్రియను చేపట్టాలని పాపులేషన్‌ మేనేజ్‌మెంట్‌ పాలసీ రూపొందించాం.’’ అని సీఎం వివరించారు.

Updated Date - Apr 26 , 2026 | 04:08 AM