Share News

ప్రజాసేవకు పునరంకితం

ABN , Publish Date - Jun 13 , 2026 | 03:48 AM

రాష్ట్రానికి తాము పెత్తందారులం కాదని, ప్రజా సేవకులమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కూటమి పాలన రెండేళ్ల విజయోత్సవంతో ప్రజాసేవకు పునరంకితమవుతున్నామని భావోద్వేగంతో ప్రకటించారు.

ప్రజాసేవకు పునరంకితం

  • పెత్తందార్లం కాదు.. ప్రజా సేవకులం

  • వైసీపీది విషపూరిత మనస్తత్వం.. వారికో లక్ష్యం, విజన్‌ లేనేలేవు

  • రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు గత ఎన్నికల్లో జనం విజ్ఞత ప్రదర్శించారు

  • కూటమికి 57శాతం ఓట్లు, 90శాతం సీట్లిచ్చారు.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం

  • వెంటిలేటర్‌పై ఉన్న ఏపీకి కేంద్రం ఆక్సిజన్‌ అందించింది

  • విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రాలుగా అన్ని జిల్లాల అభివృద్ధి

  • రెండేళ్లలో 23 లక్షల కోట్ల పెట్టుబడులు.. 3 ప్రాంతాలకూ కేటాయింపు

  • లక్ష కోట్లతో హార్టికల్చర్‌ హబ్‌గా సీమ.. స్టీల్‌ ప్లాంట్‌ 2028 నాటికి పూర్తి

  • తిరుపతి విజయోత్సవ సభలో సీఎం చంద్రబాబు

  • జిల్లా, నియోజకవర్గాల స్థాయుల్లోనూ సభలు నిర్వహించాలని పిలుపు

ఈ రెండేళ్లలో అన్నీ చేసేశామని, సాధించేశామని మేం చెప్పడం లేదు. మేం పెత్తనం చలాయించేవాళ్లం కాదు.. ప్రజా సేవకులుగా వ్యవహరిస్తున్నాం. పాలనను గాడిలో పెడుతున్నాం. దానికి కేంద్రం కూడా సహకరిస్తోంది.

కూటమిపై ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టను. అధికారులు తప్పు చేసినా ఉపేక్షించేది లేదు. నేతలు తప్పు చేస్తే వారిని దూరం పెడతాం. వారిని వదిలించుకునేందుకు ఏమాత్రం వెనుకాడం.

- సీఎం చంద్రబాబు

తిరుపతి, జూన్‌ 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి తాము పెత్తందారులం కాదని, ప్రజా సేవకులమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కూటమి పాలన రెండేళ్ల విజయోత్సవంతో ప్రజాసేవకు పునరంకితమవుతున్నామని భావోద్వేగంతో ప్రకటించారు. శుక్రవారం మధ్యాహ్నం తిరుపతి నగర శివారులో దామినేడు సమీపంలో ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ పేరిట నిర్వహించిన బహిరంగ సభను డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌, మంత్రి లోకేశ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం భారీ సంఖ్యలో హాజరైన కూటమి పార్టీల శ్రేణులను, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కూటమి ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో నిర్ణయాలు తీసుకుంటుంటే.. గొడ్డలి పార్టీ లేనిపోని దుష్ప్రచారాలు చేస్తోందని ఆరోపించారు. వైసీపీ నేతలకు అభివృద్ధిపరంగా ఒక లక్ష్యం, విజన్‌ అంటూ ఏదీ లేదని.. వారికున్నదల్లా విషపూరిత మనస్తత్వమేనని ధ్వజమెత్తారు.


మద్యనిషేధం అమలు చేశాకే ఓట్లు అడుగుతానన్న వ్యక్తి జే బ్రాండ్లతో ప్రజారోగ్యాన్ని దెబ్బతీశారని, మహిళల మంగళసూత్రాలను తెంచారని ఆరోపించారు. వారంలో సీపీఎస్‌ రద్దు చేస్తామని ఉద్యోగులకు హామీ ఇచ్చి.. రద్దు చేయకపోగా వారిని వేధించుకు తిన్నారని గుర్తుచేశారు. జాబ్‌ క్యాలెండర్‌ అని ఘనంగా ప్రకటించి ఒక్కసారి కూడా నోటిఫికేషన్‌ జారీ చేయలేదని, అమరావతిపై ఊసరవెల్లి రాజకీయాలు చేశారని.. ఇపుడు మావిగన్‌ అంటూ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అది మావిగనో లేక వాటికనో అని ఎద్దేవాచేశారు. అమరావతిని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు గత ఎన్నికల్లో ప్రజలు విజ్ఞత ప్రదర్శించారని కొనియాడారు. 57 శాతం ఓటు షేర్‌తో, 90 శాతం సీట్లు ఇచ్చి కూటమిని గెలిపించిన ఘనత వారిదేనన్నారు. పాలనను గాడిలో పెట్టి వారి నమ్మకాన్ని నిలబెట్టుకున్నామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయని, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తోందని తెలిపారు. పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌, రైల్వే జోన్‌ సహా కీలక అంశాల్లో అండగా నిలిచిందన్నారు. ప్రధానమంత్రిగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న మోదీని ఈ సందర్భంగా అభినందించారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..


ప్రజల ఆశీర్వాదంతో..

రెండేళ్ల కిందట ఇదే రోజు ప్రజల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. ప్రధాని మోదీ, పవన్‌ కల్యాణ్‌తో కలిసి ‘ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దాం.. రాష్ట్రాన్ని కాపాడదాం’ అని పిలుపిచ్చాం. దానికి స్పందించిన ప్రజలు కూటమికి ఘన విజయాన్ని కట్టబెట్టారు. 2014లో రాష్ట్రాన్ని విభజన కష్టాలు చుట్టుముట్టాయి. 2019-24 మధ్య వైసీపీ పాలనతో రాష్ట్రంలో విధ్వంసం నెలకొంది. అన్ని రంగాల్లో సంక్షోభం.. వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. వైసీపీ విధ్వంసక పాలన 2019లో ప్రజావేదిక కూల్చివేతతో మొదలై.. రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల అప్పుతో ముగిసింది. నాడు వైసీపీ ప్రభుత్వంపై మూడు పార్టీలూ విడివిడిగా పోరాడాయి. ఎంతో మందిపై కేసులు పెట్టి జైళ్లకు పంపించారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా నన్నూ అరెస్టు చేశారు. 53 రోజులు జైల్లో ఉంచారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను అడుగడుగునా వేధించారు. మేమొచ్చేనాటికి ప్రభుత్వం వద్ద నిధుల్లేవు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్‌ ఇచ్చి బతికించింది. రెండేళ్లలో ప్రజలకు ఏం చేశామో, ఏమి చేయలేకపోయామో చెప్పడానికి మాతో పాటు మా కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నాం. సంక్షేమ, అభివృద్ధి పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నాం. ఎన్టీఆర్‌ భరోసా కింద అర్హులకు రూ.4 వేల నుంచి రూ.15 వేల దాకా అందిస్తున్నాం. రాష్ట్రంలో 63 లక్షల మందికి పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలుంటే అందరికీ రూ.15 వేల చొప్పున మంజూరు చేస్తున్నాం.


స్త్రీశక్తి పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నాం. ఇరాన్‌ యుద్ధంతో ధరలు పెరిగినా దీపం కింద ఉచిత వంట గ్యాస్‌ సిలిండర్లు ఇస్తున్నాం. మత్స్యకారుల సేవలో, ఆటో డ్రైవర్ల సేవలో, నేతన్నలకు ఉచిత విద్యుత్‌, అన్నదాత సుఖీభవ వంటి పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నాం. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతులకు నగదు చెల్లింపులు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్‌ ప్యానెళ్లు, బీసీలకు రాయితీపై సౌర విద్యుత్‌, ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు పీ4 వంటి నూతన ప్రయోగాలు చేపట్టాం. మెగా డీఎస్సీ ద్వారా 15,941 టీచర్‌ పోస్టులను భర్తీ చేయడంతో పాటు 5757 పోలీసు కానిస్టేబుళ్ల పోస్టులను కూడా భర్తీ చేశాం. ప్రభుత్వ ఉద్యోగులకు 23 నెలల వ్యవధిలో రూ.21 వేల కోట్ల బకాయిలు చెల్లించాం.


సీమ నెక్ట్స్‌ లెవల్‌కు..

మా ప్రభుత్వం విశాఖ, అమరావతి, తిరుపతి కేంద్రాలుగా అన్ని జిల్లాలనూ, 175 నియోజకవర్గాలనూ అభివృద్ధి చేస్తోంది. నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 ఎంఎ్‌సఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. రెండేళ్లలో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా వాటిని మూడు ప్రాంతాలకూ సమానంగా కేటాయిస్తున్నాం. రాయలసీమ అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. స్పేస్‌ సిటీ, డ్రోన్‌ సిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. కేవలం 36 రోజుల్లో ఐదో తరం ఫైటర్‌ జెట్‌ తయారీ ప్లాంట్‌ పుట్టపర్తిలో ఏర్పాటైంది. రాయలసీమ స్టీల్‌ ప్లాంట్‌ను 2028 నాటికి పూర్తిచేస్తాం. సీమను రూ.లక్ష కోట్లతో హార్టికల్చర్‌ హబ్‌గా అభివృద్ధిచేస్తున్నాం. కర్నూలు జిల్లా జొన్నవాడలో బంగారు గనులు గుర్తించాం. ఇక్కడ త్వరలో తవ్వకాలు కూడా ప్రారంభమవుతాయి. పరిపాలనకు అడ్డంకులు కల్పించేలా, ప్రజలను ఇబ్బంది పెట్టేలా ఉన్న చట్టాలను సమీక్షిస్తున్నాం. వాటిని రద్దు చేస్తాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విద్యుత్‌ చార్జీలను పెంచలేదు. తొలిసారి ట్రూ డౌన్‌ చేసి చార్జీలు తగ్గించాం. ఎమ్మెల్యేలు ప్రజాసేవకులే తప్ప పెత్తందార్లు కాదు. సేవాభావంతో కూటమి పార్టీల నేతలు కలిసికట్టుగా పనిచేయాలి. జనం మెచ్చేపాలన అందించాలి. కేంద్రంతో అనుసంధానం కలిగి ఉండాలి.. ఇవే ప్రాధాన్యాలుగా పెట్టుకుని పనిచేయాలి. రెండేళ్ల విజయోత్సవ సభలను నిర్వహించాలి. ప్రజాప్రతినిధులుగా శాశ్వతంగా కొనసాగేందుకు తగిన నడవడిక అలవరచుకోవాలి.

21వ శతాబ్ది ప్రధాని మోదీదే!

దేశంలో 21వ శతాబ్ది ప్రధాని మోదీదే. 2014లో ఆయన ప్రధాని అయ్యేనాటికి దేశంలో 91వేల కిలోమీటర్లు ఉన్న జాతీయ రహదారులు.. ఇపుడు 1.46 లక్షల కి.మీ.కి చేరుకున్నాయి. విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 160కి పెరిగింది. మోదీ సారథ్యంలో దేశం 2047 నాటికి తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తుంది.

Updated Date - Jun 13 , 2026 | 03:53 AM