వైసీపీ కొత్త డ్రామా!
ABN , Publish Date - Jun 30 , 2026 | 04:12 AM
వైసీపీ ఓ క్రిమినల్ పార్టీ అని, రౌడీయిజాన్నే నమ్ముకుందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ‘‘శుభ కార్యాలకు వెళ్లినా, పరామర్శలకు వెళ్లినా గొడ్డలి పార్టీ నేతల వెంట రౌడీ షీటర్లు ఉండాల్సిందే.
మొన్న 3 రాజధానులు.. నిన్న మావిగన్ మాట.. నేడు అమరావతి పరిరక్షణట!
ద్వంద్వ విధానాలను ప్రజలకు చెప్పండి
అధికారం కోసం ఎంతకైనా తెగించే పార్టీ
రైతుల పరామర్శలో రౌడీషీటర్లు ఎందుకు?
క్రిమినల్ పార్టీ.. రౌడీయిజాన్నే నమ్ముకుంది
పవన్‌పై విమర్శలు తిప్పికొట్టండి
సాయికృష్ణ నేరచరితుడే అయినా.. చట్టప్రకారమే శిక్షించాలి!
మంత్రులతో భేటీలో సీఎం వ్యాఖ్యలు
అమరావతి, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ఓ క్రిమినల్ పార్టీ అని, రౌడీయిజాన్నే నమ్ముకుందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ‘‘శుభ కార్యాలకు వెళ్లినా, పరామర్శలకు వెళ్లినా గొడ్డలి పార్టీ నేతల వెంట రౌడీ షీటర్లు ఉండాల్సిందే. ఆ పార్టీ నైజాన్ని నిత్యం ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మనపై ఉంది. అధికారం కోసం వారు ఎలాంటి పనులకైనా బరితెగిస్తారు.వారి అమరావతి పర్యటనే దీనికి నిదర్శనం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. సచివాలయంలో సోమవారం మధ్యాహ్నం అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం లంచ్ సమావేశం నిర్వహించారు. అమరావతిని మొన్నటి వరకు వ్యతిరేకించడంతోపాటు, అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టే రోజు కూడా మావిగన్ అని మాట్లాడి వైసీపీ నేతలు నవ్వులపాలయ్యారని సీఎం తెలిపారు. అలాంటిది ఇప్పుడు అమరావతి పరిరక్షణ సమితి పేరుతో కొత్త డ్రామాకు తెర లేపారన్నారు. వైసీపీ ద్వంద్వ విధానాన్ని జనంలోకి తీసుకెళ్లాలని ఆయన మంత్రులకు సూచించారు. అసలు రాజధాని అమరావతిని తాము గుర్తించబోమని చెప్పి, మూడు రాజధానుల స్థానంలో మావిగన్ అంటూ ప్రతిపాదించిన జగన్ ఇప్పుడు రైతు పరిరక్షణ సమితి పేరుతో నేతలను పంపడం ఏమిటని, పరామర్శలకు వెళ్లే వారు రౌడీషీటర్లను వేసుకుని దండయాత్ర మాదిరిగా వెళతారా అని సీఎం ప్రశ్నించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన వ్యక్తులే రాజధానికి వైసీపీ నేతలతో కలిసి వెళ్లిన దృశ్యాలు మీడియాలో వైరల్ అయ్యాయన్నారు. పరామర్శకు వెళ్లేటప్పుడు రౌడీషీటర్లను ఎందుకు తీసుకెళ్లాలని నిలదీశారు. ఈ అంశాలన్నింటినీ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన మంత్రులను కోరారు.
అనితపై అమర్నాథ్‌వి అసభ్యకర వ్యాఖ్యలు
హోంమంత్రి అనితపై వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు అసహ్యకరమైనవని, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి చర్చకు పెట్టాలని మంత్రులను సీఎం చంద్రబాబు కోరారు. ‘‘ఒక మహిళ అని కూడా చూడకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటం ఏమిటి? దీనిపై వైసీపీ వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. సోషల్ మీడియాలో కూడా అనితకు సానుభూతిగా పోస్టులు పెడుతున్నారు.’’ అని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులు స్పందిస్తూ.. ఈ విషయంపై మంత్రులందరం వేగంగా స్పందించామని, అనిత కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుందని హుందాగా మాట్లాడారని సీఎంకు తెలిపారు. అనితను దూషించిన అమర్నాథ్ జగన్‌ను కలవడానికి వెళితే....శభాష్ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు పత్రికల్లో వచ్చాయని మంత్రి అనగాని తెలపగా, ఇటువంటి అంశాలనే ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం సూచించారు. విజయవాడ కృష్ణలంక పోలీసుస్టేషన్‌లో జరిగిన కస్టోడియల్ డెత్‌పై ప్రభుత్వం తీసుకున్న చర్యలపైనా సమావేశంలో చర్చ జరిగింది. ఈ ఘటనలో మరణించిన సాయికృష్ణ నేరచరిత్ర గురించి ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనాన్ని మంత్రులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. నేరచరిత్ర ఉన్నప్పటికీ పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని వ్యవహరించకూడదని, చట్ట ప్రకారమే శిక్షించాలని సీఎం అన్నారు. అందుకే ప్రభుత్వం ఈ ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయిస్తోందని, సిట్‌ను కూడా నియమించామన్నారు. సీఐ నాగరాజుపై హత్య కేసు నమోదు చేసి, అరెస్టు కూడా చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. సాయికృష్ణ ఘటనపై ప్రభుత్వం బాగా స్పందించిందని మంత్రులు వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై కొంతమంది వైసీపీ నేతలు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని సీఎం సూచించారు. పవన్‌ను ఓ కులానికే పరిమితం చేయాలనే ఉద్దేశంతో ఆయనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. వైసీపీ కుట్రలను ఎక్కడికక్కడ ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రులు నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.