Share News

ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందే!

ABN , Publish Date - Feb 14 , 2026 | 02:52 AM

కుప్పం నియోజకవర్గ ప్రజల్లో నేను మరింత అందుబాటులో ఉంటే బాగుండు అనే భావన ఉంది. దీన్ని సరిదిద్దేందుకు తరచూ కుప్పంకు వస్తాను.

ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందే!

  • ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ముందుకు సాగడం ద్వారా ఉత్తమ ఫలితాలు

  • చిత్తూరు ప్రజాప్రతినిధులతో భేటీలో సీఎం చంద్రబాబు

  • తన నియోజకవర్గ పనితీరునూ విశ్లేషించుకున్న సీఎం

  • ఎమ్మెల్యేల పనితీరుపై ప్రోగ్రెస్‌ రిపోర్టు అందజేత

అమరావతి, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): ‘కుప్పం నియోజకవర్గ ప్రజల్లో నేను మరింత అందుబాటులో ఉంటే బాగుండు అనే భావన ఉంది. దీన్ని సరిదిద్దేందుకు తరచూ కుప్పంకు వస్తాను. ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండే విషయంలో మీరైనా, నేనైనా ఏ మాత్రం రాజీ పడే ప్రసక్తే ఉండకూడదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల పరస్పర సమన్వయంతో పాలనలో వేగం పెంచేందుకు ప్రారంభించిన ‘ప్రజాప్రతినిధులతో భేటీ’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన చిత్తూరు జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం సమావేశమయ్యారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌ రెడ్డితో పాటు కలెక్టర్‌, ఎస్పీలు కూడా హాజరయ్యారు. సుమారు 2 గంటలపాటు వివిధ అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో స్వయంగా తన నియోజకవర్గానికి సంబంధించిన అంశాలనూ చంద్రబాబు చర్చించడం గమనార్హం. చిత్తూరు జిల్లా ప్రజాప్రతినిధులందరి పనితీరు బాగుందని, అలాగని సంతోష పడకుండా ఎక్కడ వెనుకబడి ఉన్నామో.. దానిపై దృష్టి సారించి మెరుగుపర్చుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేలు, అధికారులు కలిసి ముందుకు సాగడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించవచ్చన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై కూటమి ప్రభుత్వ ముద్ర కనబడేలా పనిచేయాలన్నారు. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు విషయంలో ప్రజల్లో సానుకూల దృక్పథం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం చర్చించారు. 20 నెలల్లో స్థానికంగా తీసుకున్న చర్యలు, వచ్చిన ఫలితాలు, రాజకీయ స్థితిగతులు, రానున్న 3-4 నెలల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పరిష్కరించాల్సిన అంశాలపై ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రజల సమస్యలపై ప్రజాప్రతినిధులు ఇచ్చే ప్రతిపాదనలకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు.


తొలిసారి ఎమ్మెల్యేలు మరింత అందుబాటులో..

‘చిత్తూరు జిల్లాలో నేను, అమర్నాథ్‌ రెడ్డి తప్ప మిగిలిన వారంతా తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లే. తొలిసారి ఎమ్మెల్యేలు ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలి. ప్రజల్లో కలిసిపోయి వారి సమస్యలు పరిష్కరించాలి’ అని చంద్రబాబు సూచించారు. వివిధ మార్గాల ద్వారా తాను తెప్పించుకున్న సర్వేలు, నివేదికల ఆధారంగా వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను ఎమ్మెల్యేలతో పంచుకున్నారు. ప్రధానంగా ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండటం, మీడియా, సోషల్‌ మీడియాలో చొరవ చూపడం, స్థానిక సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టడం, అధికారులతో సమన్వయం చేసుకోవడం, పార్టీ కార్యక్రమాల నిర్వహణ, ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించడం, పొలిటికల్‌ యాక్టివిటీ చేయడం వంటి అంశాలపై ఎమ్మెల్యేల పనితీరు గురించి సవివరంగా చర్చించారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

ప్రతి ఎమ్మెల్యే పనితీరుపై నివేదికను సీల్డ్‌ కవర్‌లో సీఎం చంద్రబాబు వారికి అందజేశారు. అందులో ఎమ్మెల్యే పనితీరు ఆధారంగా.. రాష్ట్రస్థాయిలో ఏ స్థానంలో ఉన్నారు, జిల్లా స్థాయిలో ఏ స్థానంలో ఉన్నారనే దానిపై ర్యాంకులు ఇచ్చారు. బాగా పనిచేసిన వారిని అభినందిస్తూ.. వెనుకబడిన వారికి సూచనలు చేశారు. అధికారులతో కలిసి ప్రజాసమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేలు కృషి చేయాలని, అధికారులు కూడా ఆయా సమస్యలపై మరింత వేగంగా స్పందించాలని సూచించారు. నియోజకవర్గ విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌ యూనిట్‌ కార్యాలయాల వినియోగం ఎలా జరుగుతుందని ఆరా తీశారు. ఆ కార్యాలయాలు, సిబ్బందిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. శాంతి భద్రతల విషయంలో మరింత కఠినంగా ఉండాలని ఎస్పీని ఆదేశించారు.

Updated Date - Feb 14 , 2026 | 02:52 AM