గ్యాస్ నిరంతర సరఫరా
ABN , Publish Date - Mar 17 , 2026 | 05:10 AM
గృహ వినియోగదారులకు వంట గ్యాస్ (ఎల్‌పీజీ) సిలిండర్ల సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
సిలిండర్లను బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తే కఠిన చర్యలు: సీఎం
ఆస్పత్రులు, బడులు, గుళ్లకు ఇబ్బంది ఉండకూడదు
ఒకటిన్నర రోజుల్లోనే డెలివరీ ఇస్తే ప్రజల్లో ఆందోళన ఉండదు
వినియోగం తగ్గించడానికి హోటళ్ల సంఘాలతో మాట్లాడండి
యుద్ధం ముగిశాక కూడా కొన్ని రోజులు ఇబ్బందులు ఉండొచ్చు
వాటినీ అంచనా వేసుకోవాలి: చంద్రబాబు.. సరఫరాపై సమీక్ష
5 రోజులుగా సగటున 2.90 లక్షల సిలిండర్ల డెలివరీ: మనోహర్
అమరావతి, మార్చి 16(ఆంధ్రజ్యోతి): గృహ వినియోగదారులకు వంట గ్యాస్ (ఎల్‌పీజీ) సిలిండర్ల సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ముఖ్యంగా ఆస్పత్రులు, పాఠశాలలు, దేవాలయాలకు ఇబ్బంది రాకుండా నిరంతర సరఫరా ఉండాలని స్పష్టం చేశారు. ఎల్‌పీజీ సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు తరలిపోకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలన్నారు. అలా తరలించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో వంటగ్యాస్ నిల్వలు, బుకింగ్, సరఫరా తదితరాలపై సోమవారం ఆర్టీజీఎస్ నుంచి సీఎం సమీక్ష నిర్వహించారు. పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు ఓఎన్జీసీ, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ సహా గ్యాస్ సరఫరా కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిల్వలు, సరఫరా పరిస్థితులపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 17,209 టన్నుల వంటగ్యాస్ నిల్వలు ఉన్నాయని, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఐవోసీఎల్‌లకు చెందిన 1,154 ఏజెన్సీల ద్వారా గ్యాస్ సరఫరా అవుతోందని చెప్పారు. సిలిండర్ల డెలివరీ సందర్భంగా వినియోగదారుల నుంచి ఓటీపీ తీసుకునే విధానాన్ని అమలు చేయడం ద్వారా డొమెస్టిక్ సిలిండర్లు దుర్వినియోగం కాకుండా చూస్తున్నామని చెప్పారు. ఓటీపీల విషయంలో ఏమైనా ఇబ్బందులుంటే.. స్వర్ణ గ్రామం/స్వర్ణ వార్డు కార్యాలయాల ద్వారా సమన్వయం చేసుకుంటూ ఆర్టీజీఎస్ నుంచి సాంకేతిక సహాయాన్ని ఆయా గ్యాస్ సరఫరా సంస్థలకు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. సాధారణ పరిస్థితుల్లో ఒకటిన్నర రోజుల్లోనే డెలివరీ జరిగేదని.. ఇప్పుడు రెండున్నర రోజులు పడుతోందని తెలిపారు. గతంతో పోల్చుకుంటే రీఫిల్ బుకింగ్ గడువు పెరిగిందని, ఈ క్రమంలో ఇదివరకటి మాదిరిగానే ఒకటిన్నర రోజుల్లోనే డెలివరీ ఇవ్వగలిగితే ప్రజల్లో ఆందోళన ఉండదని సీఎం అన్నారు.

అన్న క్యాంటీన్లకు ఇబ్బందులున్నాయా?
అన్న క్యాంటీన్లకు గ్యాస్ సరఫరా విషయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా అని ముఖ్యమంత్రి ఆరా తీశారు. రాష్ట్రవ్యాప్తంగా 17 కేంద్రీకృత కిచెన్ల ద్వారా అన్న క్యాంటీన్లకు ఆహారం సరఫరా అవుతోందని.. వాటికి ఎలాంటి ఇబ్బందుల్లేవని, పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నామని అధికారులు చెప్పారు. దీంతోపాటు ఆస్పత్రులు, స్కూళ్లు, హాస్టళ్లు, దేవాలయాల్లో రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. ఎల్‌పీజీ వినియోగం తగ్గించుకునేలా హోటళ్ల అసోసియేషన్లతో సంప్రదింపులు జరపాలని సూచించారు.
కిరోసిన్ సరఫరా చేస్తే..!
రాష్ట్రవ్యాప్తంగా చిన్న వ్యాపారులు రోజువారీ అవసరాలకు ఇబ్బందులు పడకుండా, వారి జీవనోపాధికి ఆటంకం కలగకుండా ఉండేలా గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా కిరోసిన్ సరఫరా చేసే అంశాన్ని పరిశీలించాలని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రతిపాదించారు. సీఎం స్పందిస్తూ.. ఎల్‌పీజీకి ప్రత్యామ్నాయ విధానాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. ఇండక్షన్ స్టవ్‌లను కూడా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఓఎన్జీసీ, గెయిల్, బీజీఎల్ వంటి సంస్థలతో ఇంటింటికీ గ్యాస్ పైపులైన్ కనెక్షన్లు ఇచ్చే సంస్థలను సమన్వయం చేసుకోవాలని సూచించారు.
మనకు మరింత గ్యాస్!
కేంద్ర ప్రభుత్వం ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు త్వరలోనే మరింత వంటగ్యాస్ కేటాయింపులు చేయనుందని అధికారులు తెలిపారు. వివిధ ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లకుండా తీసుకోవలసిన చర్యలపైనా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
వదంతులు నమ్మి జనం బారులు
వంట గ్యాస్ దొరకడం లేదన్న వదంతులు నమ్మేసి వినియోగదారులు ఎక్కువగా ఏజెన్సీల దగ్గర క్యూ కడుతున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. సీఎం సమీక్ష అనంతరం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘సాధారణ రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 2.81 లక్షల గ్యాస్ సిలిండర్లు బుకింగ్ జరిగేవి. ఇప్పుడు ఒక్కసారిగా బుకింగ్‌లు చేయడంతో సర్వర్లు జామ్ అయ్యే పరిస్థితి నెలకొంటోంది. రాష్ట్రంలో గృహావసరాలకు ఎల్‌పీజీ కొరత లేదు. గృహావసరాలకు వినియోగించాల్సిన సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగించినా, బ్లాక్ మార్కెట్‌కు తరలించినా 6ఏ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించాం. దీంతో ఈ 5 రోజుల్లోనే 616 కేసులు నమోదయ్యాయి. 2,500 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేశాం’ అని మంత్రి మనోహర్ తెలిపారు.