Share News

సామాన్యులూ కంపెనీలు పెట్టాలి!

ABN , Publish Date - Jun 19 , 2026 | 03:50 AM

రాష్ట్రంలో పెద్దఎత్తున జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి ఫలాలు పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు అందేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

సామాన్యులూ  కంపెనీలు పెట్టాలి!

  • ఉద్యోగాలకే వారు పరిమితం కాకూడదు

  • పేద, మధ్యతరగతి వర్గాలకు

  • పారిశ్రామికాభివృద్ధి ఫలాలు అందాలి

  • స్టార్ట్‌పల ద్వారా వారిని ప్రోత్సహించాలి

  • దీని కోసం ఎకోసిస్టం రూపొందించాలి

  • 40ు ఇథనాల్‌ బ్లెండ్‌కు కేంద్రం అంగీకారం

  • ఇథనాల్‌ పరిశ్రమలతో రైతులకు ప్రయోజనం

  • సెమీకండక్టర్‌ పరిశ్రమలను ప్రోత్సహిద్దాం

  • ఈవీ ఫాస్ట్‌ చార్జింగ్‌ బ్యాటరీల ఉత్పత్తిపై దృష్టి

  • అనుమతిచ్చాక ప్రాజెక్టులు మొదలెట్టాల్సిందే

  • పారిశ్రామిక ప్రాంతాల వద్ద తక్కువ ధరకు ఇళ్లు

  • ఎస్‌ఐపీబీలో అధికారులకు సీఎం ఆదేశం

  • రూ.30,515 కోట్ల పెట్టుబడులకు ఆమోదం

  • 50 కంపెనీల ద్వారా 29,677 ఉద్యోగాలు

రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలకు తగ్గట్లుగా, ట్రెండ్స్‌ను అనుసరించి విద్యాశాఖ కరిక్యులమ్‌ తయారు చేయాలి. రోబోటిక్స్‌ లాంటి ఆధునిక టెక్నాలజీ కోర్సులు కూడా మన విద్యావ్యవస్థలో ఉండాలి. ప్రాజెక్టులకు సంబంధించిన నాన్‌ సీరియస్‌ ప్లేయర్స్‌కు ఏపీలో చోటులేదు. ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చాక వెంటనే పనులు మొదలు పెట్టాలి.

- సీఎం చంద్రబాబు

అమరావతి, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెద్దఎత్తున జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి ఫలాలు పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు అందేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పరిశ్రమలు, కంపెనీలను ధనికులు మాత్రమే స్థాపించగలరన్న అభిప్రాయం పోయేలా చొరవ తీసుకోవాలని స్పష్టం చేశారు. సామాన్యులు కూడా స్టార్టప్‌ కంపెనీలు ఏర్పాటు చేసేలా ప్రోత్సహించాలని, దీని కోసం రాష్ట్రంలో తగిన పారిశ్రామిక ఎకో సిస్టమ్‌ను రూపొందించాలని చెప్పారు. గురువారం వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 18వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రూ. 30,515 కోట్లతో 50 పెట్టుబడి ప్రతిపాదనలను ఆమోదించారు. వీటి ద్వారా 29,677 ఉద్యోగాలు రానున్నాయని కంపెనీలు తమ ప్రతిపాదనల్లో వెల్లడించాయి.


సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ‘‘పేద, మధ్య తరగతి వర్గాలకు ఉద్యోగాలు కల్పించడమే కాకుండా సామాన్యులు కూడా కంపెనీలు స్థాపించే అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలి. స్టార్టప్‌ కంపెనీలకు పెద్దఎత్తున ప్రోత్సాహం ఇవ్వాలి. దీనికోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ సేవలను సద్వినియోగం చేసుకునేలా చూడాలి. ఆర్టీఐహెచ్‌ పరిధిలో స్టార్టప్‌ కంపెనీలకు వెంచర్‌ క్యాపిటలిస్టుల నుంచి పెట్టుబడులు వచ్చేలా చూడాలి. ఈ విఽధానాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలి. అనుబంధంగా ఎకోసిస్టమ్‌ ఏర్పాటుపై అధికారులు దృష్టి పెట్టాలి. పనులు ప్రారంభించని సంస్థలతో అధికారులు టచ్‌లో ఉంటూ ఫాలోఅప్‌ చేయాలి.


ఆటోమేషన్‌లో పారిశ్రామిక అనుమతులు

ఇథనాల్‌ తయారీ విషయంలో ఏపీ ముందడుగు వేయాలి. వాహనాల ఇంధనంలో 40 శాతం ఇథనాల్‌ బ్లెండ్‌ చేసేందుకు కేంద్రం అంగీకరించింది. ఇథనాల్‌ తయారీ పరిశ్రమను ప్రోత్సహిస్తే రైతులకు ప్రయోజనం కలుగుతుంది. బయో ఫ్యూయల్‌ రంగాన్ని మరింత ప్రోత్సహించాల్సి ఉంది. సోలార్‌, విండ్‌, పంప్డ్‌ స్టోరేజీతో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌ టెక్నాలజీదే భవిష్యత్తు. లిథియం అయాన్‌ బ్యాటరీల ఉత్పత్తి, ఈవీలకు ఫాస్ట్‌ చార్జింగ్‌ బ్యాటరీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. సెమీ కండక్టర్ల పరిశ్రమలను ఎక్కువగా ప్రోత్సహించాలి. మైక్రో ఇరిగేషన్‌ రైతుల కోసం పరికరాల తయారీ పార్కును ఏర్పాటు చేయాలి. అమరావతిలో ఏఐ, అల్గారిథమ్స్‌ క్వాం టమ్‌ అప్లికేషన్ల రూపకల్పన మొదలైంది. క్వాంటమ్‌ వ్యాలీకి సంబంధించిన ఎకోసిస్టమ్‌ కల్పించండి. ప్రాజెక్టుల అనుమతులు, భూ కేటాయింపులు వంటివాటిని పారిశ్రామికవేత్తలకు సులభంగా అందేలా చూడండి. ఆటోమోటివ్‌ పరిశ్రమలకు శ్రీసిటీ సహా అనంతపురం జిల్లా కూడా కీలకం. తిరుపతి శ్రీసిటీలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ తయారీ పరిశ్రమ వస్తోంది. పుట్టపర్తిలో ఐదో తరం ఫైటర్‌ జెట్‌ విమాన తయారీ పరిశ్రమ వస్తోంది.


హోటల్‌ గదులు పెరగాలి

పర్యాటకులు రాష్ట్రంలో ఎక్కువ కాలం ఉండేలా హోటల్‌ రంగాన్ని విస్తృతంగా పెంచాలి. గదులు ఎక్కువ సంఖ్యలో నిర్మించాలి. మహీంద్రా క్లబ్‌ సంస్థ బీచ్‌ రిసార్ట్స్‌, పులికాట్‌ సరస్సు వద్ద కూడా ప్రాజెక్టుల ఏర్పాటుకు ఆసక్తి చూపుతోంది. అరకు లాంటి ప్రాంతాల్లోనూ ఐటీడీఏ భాగస్వామ్యంతో మహీంద్రా ప్రాజెక్టుల ఏర్పాటుకు అవకాశం ఉంది. కొత్తగా అభివృద్ధి చెందుతున్న పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రాలను గుర్తించాలి. తిరుపతి, అమరావతి, విశాఖల్లో బాబారామ్‌దేవ్‌ యోగా కేంద్రాల ఏర్పాటుకు అవకాశం ఉంది. గండికోట, పోలవరం ప్రాజెక్టు, అనంతపురం, కర్నూలు వద్ద పెద్దఎత్తున హోటళ్లు రావాలి. సూర్యలంక బీచ్‌ మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేయాలి. పర్యాటకరంగాన్ని పెద్దఎత్తున ప్రోత్సహించాలి. పారిశ్రామిక ప్రాంతాల వద్ద తక్కువ ధరలో ఇళ్ల నిర్మాణం జరిగేలా చూడాలి’’ అని సీఎం స్పష్టం చేశారు.


ప్రాజెక్టులు గ్రౌండింగ్‌ అయ్యాకే.. : లోకేశ్‌

ప్రాజెక్టులు గ్రౌండింగ్‌ అయ్యాకే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని మంత్రి లోకేశ్‌ స్పష్టం చేశారు. ఎస్‌ఐపీబీ సమావేశంలో మాట్లాడుతూ, భూకేటాయింపులు జరిగిన తర్వాత వేగంగా ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అప్పుడే జీఎస్టీ సహా వివిధ మార్గాల ద్వారా రాష్ట్రానికి ఆదాయం వస్తుందన్నారు. ఆ తర్వాత పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇవ్వవచ్చన్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్‌ కాలేజీలను స్థానిక పరిశ్రమలతో మ్యాపింగ్‌ చేసేందుకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధిని పెంచుతున్నామని అన్నారు. ఆంధ్రా వర్సిటీలో రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ పరిశోధనపై సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా ఇటీవల తన రష్యా పర్యటన వివరాలను లోకేశ్‌ ఎస్‌ఐపీబీలో వివరించారు.


  • ఎస్‌ఐపీబీలో ఆమోదం పొందిన పెట్టుబడుల ప్రతిపాదనల్లో కొన్ని..

  • అనంతపురంలో ఎన్టీపీసీ రెన్యువబుల్‌ ఎనర్జీ రూ. 6,000 కోట్ల పెట్టుబడి. 750 ఉద్యోగాలు

  • కృష్ణా జిల్లాలో ఆరాధ్య బయోఫ్యూయల్స్‌ రూ. 75.78 కోట్ల పెట్టుబడి, 402 మందికి ఉద్యోగాలు

  • చిత్తూరులో సమయ్‌ బయో సీఎన్జీ రూ. 120 కోట్ల పెట్టుబడి, 260 ఉద్యోగాలు

  • కాకినాడలో శ్రీవాయు బయోఫ్యూయల్స్‌ రూ. 57.22 కోట్ల పెట్టుబడి, 150 మందికి ఉద్యోగాలు

  • అనకాపల్లిలో ఆంధ్రా బయో ఎనర్జీ రూ. 96.40 కోట్ల పెట్టుబడి, 150 మందికి ఉద్యోగాలు

  • ఎన్టీఆర్‌ జిల్లాలో విక్‌సిత్‌ అగ్రి గ్రీన్‌ ఎనర్జీ రూ. 141.55 కోట్ల పెట్టుబడి, 518 మందికి ఉద్యోగాలు

  • అనకాపల్లిలో కంట్రోల్‌-ఎస్‌ డేటా సెంటర్‌ రూ. 2788 కోట్ల పెట్టుబడి, 160 మందికి ఉద్యోగాలు

  • తిరుపతి జిల్లాలో జెట్‌ స్పాట్‌ ఇండియా రూ. 740 కోట్ల పెట్టుబడి, 1,019 మందికి ఉద్యోగాలు

  • విశాఖలో ఇన్‌ఫినిక్స్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌ రూ. 170 కోట్ల పెట్టుబడి, 4,000 మందికి ఉద్యోగాలు

  • ఎక్లాట్‌ హెల్త్‌ సొల్యూషన్స్‌ రూ. 50 కోట్ల పెట్టుబడి, 1,000 మందికి ఉద్యోగాలు

  • శ్రీసిటీలో ఇ-ప్యాక్‌ డ్యూరబుల్‌ రూ. 1,084.31 కోట్ల పెట్టుబడి, 1,600 మందికి ఉద్యోగాలు

  • తిరుపతి జిల్లాలో అంబర్‌ఎంటర్‌ ప్రైజెస్‌ రూ. 445 కోట్ల పెట్టుబడి, 1,250 మందికి ఉద్యోగాలు

  • తిరుపతి జిల్లాలో ఎంసీఎ్‌సఈఎక్స్‌ ఇండియా రూ. 347 కోట్ల పెట్టుబడి, 1,633 మందికి ఉద్యోగాలు

  • అమరావతిలో వరుణ్‌ హాస్పిటాలిటీ సర్వీసెస్‌ రూ. 539 కోట్ల పెట్టుబడి, 600 మందికి ఉద్యోగాలు

  • ప్రకాశం జిల్లాలో జెఎ్‌సడబ్ల్యు స్టీల్స్‌ రూ. 1,230 కోట్ల పెట్టుబడి, 155 మందికి ఉద్యోగాలు

  • నెల్లూరులో వయోనా ఎనర్జీ రూ. 468 కోట్ల పెట్టుబడి, 1,600 మందికి ఉద్యోగాలు

  • చిత్తూరులో అఫరాన్‌ ప్యానెల్స్‌ రూ. 1,123 కోట్ల పెట్టుబడి, 1,200 మందికి ఉద్యోగాలు

  • తిరుపతిలో ప్రీమియర్‌ ఎనర్జీస్‌ రూ. 3,936 కోట్ల పెట్టుబడి, 540 మందికి ఉద్యోగాలు

Updated Date - Jun 19 , 2026 | 06:05 AM