Share News

రాష్ట్రానికి, కుప్పానికి ఉత్తమ పరిశ్రమలు తెస్తా

ABN , Publish Date - Jul 04 , 2026 | 04:00 AM

రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుంచీ ఓ పారిశ్రామికవేత్త రావాలని, అందులో కుప్పం నియోజకవర్గం ముందుండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.

రాష్ట్రానికి, కుప్పానికి ఉత్తమ పరిశ్రమలు తెస్తా

  • ప్రతి కుటుంబం నుంచీ ఓ పారిశ్రామికవేత్త రావాలి: సీఎం

  • కుప్పంలో రూ.9322 కోట్ల పెట్టుబడితో 27 పరిశ్రమలకు శ్రీకారం

  • పొగురుపల్లె సభా వేదిక నుంచే పలు పరిశ్రమలకు శంకుస్థాపన

  • పారిశ్రామికవేత్తలతో ఎంవోయూలు.. పెట్టుబడులు, ఉపాధి,

  • ఎప్పుడు పూర్తిచేస్తారో వారితోనే చెప్పించిన ముఖ్యమంత్రి

గుడుపల్లె/చిత్తూరు, జూలై 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుంచీ ఓ పారిశ్రామికవేత్త రావాలని, అందులో కుప్పం నియోజకవర్గం ముందుండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. మూడు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన గుడుపల్లె మండలం పొగురుపల్లెలో ‘స్వర్ణ కుప్పం-పెట్టుబడుల వేదిక’ పేరుతో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ వేదిక మీదే భారీ ఎత్తున పరిశ్రమలకు శంకుస్థాపనలు, ఎంవోయూలు కుదుర్చుకున్నారు. ఆయా పారిశ్రామికవేత్తలతో మాట్లాడించారు. ఎన్ని కోట్ల రూపాయలతో, ఎంత మందికి ఉపాధి లక్ష్యంతో, ఎప్పటిలోగా ప్రారంభించే లక్ష్యంతో పనులు చేస్తున్నారో వారితో చెప్పించి మాట తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ‘ప్రపంచంలోని ఉత్తమ పరిశ్రమలను రాష్ట్రానికి, కుప్పానికి తెస్తాం. రూ.9322 కోట్ల పెట్టుబడితో 27 పరిశ్రమలు కుప్పంలో ఏర్పాటు కానున్నాయి. వేల మందికి ఉపాధి లభిస్తుంది. 44 ఎకరాల ఎంఎ్‌సఎంఈ పార్కులో 167 మంది పారిశ్రామికవేత్తలకు ప్లాట్లు కేటాయిస్తాం. యువత కాలేజీకి వెళ్తున్నప్పుడే వ్యాపారాల గురించి ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. రాష్ట్రంలో 1.49 లక్షల మంది డ్వాక్రా మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగారు. ఈ అంశంలో మనం దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాం’ అని పేర్కొన్నారు. కుప్పంలో ఏర్పాటుచేసిన, చేస్తున్న పరిశ్రమలకు అన్ని రకాలుగా సహకరిస్తామని.. ఆ బాధ్యత తనదని చెప్పారు. కుప్పాన్ని దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలన్నదే తన కోరికగా పేర్కొన్నారు. ‘ప్రతి కుటుంబానికీ ఉపాధి, ప్రతి యువకుడికీ ఉద్యోగం లభించేలా చూస్తాం. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా వర్క్‌ఫోర్స్‌ను అందించే బాధ్యత తీసుకుంటా’ అని హామీ ఇచ్చారు.


కుప్పం.. అభివృద్ధి కేంద్రం

ప్రపంచంలోనే అతి పెద్ద ఫుట్‌వేర్‌ సంస్థగా ఉన్న అడిడాస్‌ కుప్పానికి వచ్చిందని.. టూ సీటర్‌ ట్రైనర్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ సంస్థను కూడా తెచ్చామని సీఎం తెలిపారు. ‘ఒకప్పుడు కుప్పం మారుమూల ప్రాంతం. ఇప్పుడు అభివృద్ధి కేంద్రం. ఇక్కడి బ్లూ గ్రానైట్‌కు మంచి డిమాండ్‌ ఉంది. అందుకే హెరిటేజ్‌ గ్రానైట్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేస్తున్నాం. కుప్పం తలసరి ఆదాయం రూ.2.11 లక్షలకు చేరింది. పీ4 విధానం ద్వారా 8 వేల కుటుంబాలను దత్తత తీసుకున్నాం. పొగురుపల్లెలో ఉత్తమ పారిశ్రామిక టౌన్‌షిప్‌ ఏర్పాటవుతుంది. గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌ శంకుస్థాపన చేసిన నాటి కంటే ఈ రోజు జరిగిన కార్యక్రమాలతోనే నాకు సంతోషంగా ఉంది’ అని చెప్పారు.


కుప్పానికి వస్తున్న పరిశ్రమలివీ..

  • ఫుట్‌వేర్‌ మొదలుకుని, ఎయిర్‌క్రాఫ్ట్‌ ఉత్పత్తుల వరకు వివిధ ప్రముఖ కంపెనీలకు చెందిన ప్లాంట్ల నిర్మాణాలకు చంద్రబాబు శుక్రవారం భూమిపూజ చేశారు. కొన్నిటిని ప్రారంభించారు.

  • హ్వాసింగ్‌ గ్రూప్‌ (అడిడాస్‌ ఫుట్‌వేర్‌ తయారీ యూనిట్‌) రూ.899 కోట్ల పెట్టుబడితో 20,145 మందికి ఉపాధి కల్పించనుంది.

  • రూ.2081 కోట్లతో అథా గ్రూప్‌ బ్యాటరీ అనోడ్‌ మెటీరియల్‌ త యారీ యూనిట్‌ పెట్టనుంది. 2600 మందికి ఉపాధి లభిస్తుంది.

  • పయనీర్‌ క్లీన్‌ యాంప్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.150 కోట్ల పెట్టుబడితో టూ సీటర్‌ ట్రైనర్‌ విమానాల తయారీ యూనిట్‌ నెలకొల్పుతోంది. 1400 మందికి ఉపాధి కల్పన దీని లక్ష్యం.

  • న్యూట్రీ ఫీడ్స్‌ అండ్‌ ఫార్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.180 కోట్ల పెట్టుబడితో చికెన్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుచేసింది. 2210 మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. ఇప్పటికే 400 మందికి నియామకపత్రాలను కూడా అందించారు. ఈ యూనిట్‌ను సీఎం శుక్రవారం ప్రారంభించారు. ఈ నెలలోనే కంపెనీ ఉత్పత్తి ప్రారంభించనుంది.

  • ఎంఏఎఫ్‌ క్లోతింగ్‌ రూ.200 కోట్ల పెట్టుబడితో గార్మెంట్స్‌ తయారీ యూనిట్‌ పెడుతోంది. 4060 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఇన్‌ఫేజ్‌ వరల్డ్‌ పార్క్‌ రూ.137 కోట్ల పెట్టుబడితో పవర్‌ ఎలక్ర్టానిక్స్‌ ఎక్వి్‌పమెంట్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటు చేస్తోంది. 650 మందికి ఉపాధి లభించనుంది.

  • ఇస్కాన్‌ వేదిక్‌ కల్చలర్‌-స్పిరిచ్యువల్‌ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నారు.

  • ఆయా పరిశ్రమలకు విద్యుత్‌ సౌకర్యం కోసం రూ.952 కోట్లతో ఏపీ ట్రాన్స్‌కో మూడు సబ్‌స్టేషన్లు నిర్మించింది.

  • రూ.599 కోట్ల వ్యయంతో బీసీ, ఓసీ కుటుంబాలకు రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్రాజెక్టు అమలు చేయనున్నారు. 46,596 మందికి లబ్ధి కలుగుతుంది.

  • పొగురుపల్లెలో 44.58 ఎకరాల్లో ఏపీఐఐసీ ఏర్పాటుచేసిన ఎంఎ్‌సఎంఈ పార్కును కూడా సీఎం ప్రారంభించారు. ఇందులో 167 పారిశ్రామిక ప్లాట్లను సిద్ధం చేశారు. ఈ నెల నుంచి వాటిని కేటాయించనున్నారు. ఈ పార్కుతో కుప్ప ంలోని చిన్న మధ్య తరహా పరిశ్రమలన్నీ ఒకే చోట ఉంటాయి.

Updated Date - Jul 04 , 2026 | 04:03 AM