ట్యాంపర్ చేస్తే జైలుకే!
ABN , Publish Date - Feb 07 , 2026 | 03:44 AM
‘భూమి అంటే మనకు నమ్మకం. విశ్వాసం.. అమ్మతో సమా నం. భూమితో మనకున్న అనుబంధాన్ని ఎవరూ చెరపలేరు. భూమి మీ ఆస్తి.. మీ భవిష్యత్.
మీ భూమిపై ఎవరి కన్నూ పడకుండా రక్షిస్తా.. రైతులకు సీఎం భరోసా
వైసీపీ హయాంలో అన్నదాతల భూములనూ 22ఏలో పెట్టి కాజేసే కుట్రలు
భూ సమస్యలు పరిష్కారమయ్యేవరకు ప్రతి నెలా 9న మీ ముందుకొస్తా
ప్రభుత్వ రాజముద్రతో పాస్‌పుస్తకాలు 2027 డిసెంబరు నాటికి అందరికీ ఇస్తాం
క్యూఆర్ కోడ్‌తో మీ ఫోన్‌లోనే భూమి వివరాలు చూసుకోవచ్చు
సీమ లిఫ్టుపై వైసీపీ అధినేత డ్రామాలు
ఐదేళ్లు రసాయనాలతో లడ్డూ కల్తీ చేశారు
అయినా సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చిందంటున్నారు
ఆయన బాబాయే కల్తీ జరిగిందని చెప్పారు
కర్నూలు జిల్లా కలుగొట్ల సభలో సీఎం వెల్లడి
ఎక్కడ ఏ పొరపాట్లూ లేకుండా భూరికార్డులు తయారు చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. 2027 డిసెంబరు నాటికి ప్రతి ఒక్కరికీ పాస్‌పుస్తకం జారీ చేసి భూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం.
- సీఎం చంద్రబాబు
కర్నూలు, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ‘భూమి అంటే మనకు నమ్మకం. విశ్వాసం.. అమ్మతో సమా నం. భూమితో మనకున్న అనుబంధాన్ని ఎవరూ చెరపలేరు. భూమి మీ ఆస్తి.. మీ భవిష్యత్. దానిపై ఇతరులు కన్నేయకుండా సర్వహక్కులు కల్పిం చాం. డిజిటల్ పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఇస్తున్నాం. మీ రికార్డులు ఎవ రూ ట్యాంపర్ చేయలేరు.. చేస్తే జైలు కు వెళ్లడం తథ్యం..’ అని సీఎం చంద్రబాబు రైతులకు భరోసా ఇచ్చారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్లలో ‘మీ భూమి- మీ హక్కు’ గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడారు. పట్టాదార్ పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు. వాటిలో అన్ని వివరాలూ సక్రమంగా ఉన్నాయో లేదో వారినే అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనివిధంగా భూ సమస్యలపై ఫిర్యాదులు వెల్లువలా వస్తున్నాయని.. వస్తున్న ఫిర్యాదుల్లో 80 శాతం అవేనని చెప్పారు. భూ సమస్యలు పరిష్కారమయ్యే వరకు ప్రతి నెలా 9వ తేదీన రైతుల వద్దకు వస్తానన్నారు. అధికారులు కూడా లంచాలకు స్వస్తి చెప్పి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. పరామర్శల పేరిట జగన్ చేస్తున్న బలప్రదర్శనలపై మండిపడ్డారు. బల ప్రదర్శన ఎన్నికలప్పుడు చూపించాలని. మిగిలిన సమయాల్లో ప్రజా సేవకు అంకితం కావాలని అన్నారు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే తాటతీస్తానని వైసీపీ నేతలను ఘాటుగా హెచ్చరించారు. చిత్రగుప్తుడిలా అన్నీ రాసుకుంటుంటాని చెప్పారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..
మీ భూమిపై ఆయన ఫొటోలా?
తాతలు, తండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిపై ఫొటోలు వేసుకోవడానికి జగన్ ఎవరు? మీ భూమిపై వేరేవాళ్ల ఫొటోలెందుకు..? నువ్విచ్చావా...మీ నాన్న ఇచ్చాడా..? మీ తాత ఇచ్చాడా..? ల్యాండ్ టైటిలింగ్ యాక్టుతో.. వివాదాలు ఉన్న భూములపై పెత్తనం చేయడానికి పులివెందుల నుంచి తెచ్చుకున్న మనుషులతో పొలాలు, స్థలాలు కాజేసే కుట్రలు చేశారు. మీ జుట్టు జగన్ చేతుల్లో పెట్టుకుని పాలించాడు. సర్వే రాళ్లపై తన బొమ్మలు వేసుకోవడానికి రూ.700 కోట్ల ప్రజాధనం ఖర్చు చేయడం అత్యంత దుర్మార్గం. ప్రతి ఊరిలోనూ ఆ పార్టీ రౌడీలకు మీ భూములు తక్కువ ధరకు ఇస్తే సరేసరి.. లేదంటే 22-ఏలో పెట్టేశారు. లక్షల ఎకరాలు కాజేశారు. కూటమి ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేశాం. ఇక నుంచి మీ భూమిపై ఎవరూ కన్నేయకుండా క్యూఆర్ సెక్యూరిటీతో పట్టాదార్ పాస్‌పుస్తకాలు ఇస్తున్నాం. క్యూఆర్ కోడ్‌తో మీ ఫోన్‌లోనే భూమి వివరాలు చూసుకోవచ్చు. మీ రికార్డులన్నీ భద్రంగా ఉంటాయి. ఎవరైనా తారుమారు చేసే ప్రయత్నం చేస్తే జైలుకు పంపించేలా నిబంధనలు పెట్టాం. పటిష్ఠంగా సర్వే ప్రక్రియ చేపడుతున్నాం. ఈ నెలలో రాష్ట్రంలో 279 గ్రామాల్లో సర్వే చేసి 1.16 లక్షల మంది రైతులకు పాస్‌పుస్తకాలు జారీ చేశాం. ఏప్రిల్‌లోగా 18 లక్షల పాస్ పుస్తకాల జారీ లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటి వరకు 37.40 లక్షలు సిద్ధమయ్యాయి. ఇంకా 9,500 గ్రామాల్లో సర్వే చేయాల్సి ఉంది. 62 లక్షల పాస్‌పుస్తకాలు జారీ చేయాలి.
రాయలసీమ లిఫ్టు పేరిట డ్రామాలు
ముచ్చుమర్రి లిఫ్టు, పోతిరెడ్డిపాటు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ ప్రాజెక్టులకు కృష్ణా జలాలను ఎత్తిపోస్తే కరువు నేల సస్యశ్యామలం అవుతుంది. ఈ ప్రాజెక్టున్నీ పెట్టుకుని.. వైసీపీ నేతలు రాయలసీమ లిఫ్టు పేరిట డ్రామాలు ఆడుతున్నారు. ఎలాంటి అనుమతులూ లేవని దానిని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్‌జీటీ) ఆపేసింది. అయినా మళ్లీ డ్రామాలకు తెరతీశారు. కల్తీ నెయ్యిని వినియోగించి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రతిష్ఠను దెబ్బతీశారు. ఐదేళ్లు రసాయనాలతో తయారైన కల్తీనెయ్యితో ప్రసాదం తయారు చేయించారు. కానీ కల్తీ కాలేదంటూ సీబీఐ క్లీన్‌చిట్ ఇచ్చిందని జగన్ మాట్లాడుతున్నారు.. ఆయన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డే కల్తీ జరిగిందని చెప్పారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. అప్పటి లడ్డూకు.. ఇప్పుడు అందిస్తున్న లడ్డుకు తేడా ఉందా.. లేదా తమ్ముళ్లూ (ఇప్పుడే బాగుందంటూ... టీడీపీ కార్యకర్తలు బిగ్గరగా నినాదాలు వేశారు)..! జగన్ హయాంలో శ్రీశైలం లడ్డూలో కూడా కల్తీ జరిగింది. శనీశ్వరుడిలా జగన్ పోలవరాన్ని గోదాట్లో ముంచేశాడు. డయాఫ్రం వాల్ కొట్టుకుపోయేలా చేసి రూ.400 కోట్లు దుర్వినియోగం చేశాడు. ఇప్పుడు మళ్లీ రూ.వెయ్యి కోట్లతో వాల్ నిర్మిస్తున్నాం. గోదావరి పుష్కరాల నాటికి పోలవరం పూర్తిచేసి జాతికి అంకితం చేస్తా. ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తాం. కడప జిల్లాలో రాయలసీమ ఉక్కు పరిశ్రమను పూర్తి చేసి తీరతాం.
కాకి లెక్కలు కాదు.. కరెక్టు లెక్కలు చెప్పండి
కలుగొట్ల పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు గ్రామ ప్రగతిని వివరిస్తూ.. గ్రామ తలసరి ఆదాయం రూ.26,800గా ఉన్నట్లు చెప్పారు. చంద్రబాబు జోక్యం చేసుకుని.. కర్నూలు జిల్లా తలసరి ఆదాయం రూ.1.85 లక్షలు, ఎమ్మిగనూరు నియోజకవర్గం తలసరి ఆదాయం రూ.1.25 లక్షలు, కలుగొట్ల తలసరి ఆదాయం రూ.26,800 అంటే ఎలా? కాకి లెక్కలు చెప్పకండి. కలెక్టర్, ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులు సభకు వచ్చేటప్పుడు చదువుకుని రావాలి. లెక్కలు తెలియకుండా, తెలుసుకోకుండా సమావేశాలకు రావొద్దు’ అని చురకలంటించారు.
మా ఆస్తిపై భరోసా వచ్చింది
గత వైసీపీ ప్రభుత్వం జగన్ ఫొటోతో పాస్ పుస్తకాలు ఇచ్చిందని.. అది తమకు నచ్చలేదని కలుగొట్టకు చెందిన రైతు బుడగ జంగాల నడిపన్న చెప్పారు. ‘ఇప్పుడు ప్రభుత్వ రాజముద్రతో పాస్‌పుస్తకం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. అది చూస్తే మా ఆస్తికి భద్రత, దానిపై భరోసా, నమ్మకం కలుగుతున్నాయి. బుడగ జంగాలకు కులం సర్టిఫికెట్ లేక పిల్లలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మీరే ఆదుకోవాలి’ అని సభాముఖంగా సీఎంను కోరారు. చంద్రబాబు స్పందిస్తూ.. బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చడంపై కేంద్రం చట్టం చేయాల్సి ఉందని.. చట్టం వచ్చే వరకు రిజర్వేషన్ తప్ప ఎస్సీలకు అందే పథకాలన్నీ వారికి అందించాలని ఆదేశించానని చెప్పారు. కార్యక్రమంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, నిమ్మల రామానాయుడు, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ప్రత్యేక సీఎస్ సాయిప్రసాద్, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, కలెక్టర్ సిరి తదితరులు పాల్గొన్నారు.
తాడేపల్లి హెలిప్యాడ్ కోసం పదెకరాలు కాజేశారు!
జగన్ తాడేపల్లి వద్ద ఇల్లు కట్టుకున్నారు. అక్కడే హెలిప్యాడ్ కోసం పదెకరాలు బలవంతంగా కాజేశారు. 70 ఏళ్ల నుంచి రైతు అనుభవంలో ఉన్న ఆ భూమిని 22-ఏలో పెట్టేసి వివా దం సృష్టించారు. ఈ బాగోతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కేవలం హెలిప్యాడ్ నిర్మాణం కోసం ప్రైవేటు భూమిని దొంగతనంగా ప్రభుత్వ భూమిగా మార్చివేసి ఆయన తీసుకున్నారు.