‘అదిగదిగో పోలవరం’!
ABN , Publish Date - Jun 24 , 2026 | 05:15 AM
పోలవరం ప్రాజెక్టు వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి పూర్తవుతుందన్న విశ్వాసాన్ని రాష్ట్ర ప్రజల్లో కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
వచ్చే పుష్కరాల్లోపే పూర్తవుతుందన్న విశ్వాసం కల్పించాలి
ఈ దిశగా ప్రజల్లో ఆసక్తి పెంచాలి
ఈ వారంలో వెలిగొండలో పర్యటిస్తా
నిర్వాసితులకు పరిహారమిస్తా: సీఎం
అమరావతి, జూన్ 23(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి పూర్తవుతుందన్న విశ్వాసాన్ని రాష్ట్ర ప్రజల్లో కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రాజెక్టు పురోగతిని ఎప్పటికప్పుడు వీడియోలు, డ్రోన్లు, ఫొటోల ద్వారా ప్రజలకు వివరించాలన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలు వివిధ పరీక్షల ఫలితాల సమయంలో సాధించిన ప్రగతిని వివరిస్తున్నట్లుగా.. ‘అదిగదిగో పోలవరం’ అంటూ ఈ ప్రాజెక్టు ప్రగతిని ప్రజలకు చేరవేయాలని సూచించారు. 2019-24 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహనరెడ్డి పోలవరం ప్రాజెక్టుకు చేసిన విధ్వంసాన్ని ప్రజలకు వీడియోల రూపంలో వివరిస్తూనే .. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక సాధించిన ప్రగతిని కూడా ప్రజలకు విడమరిచి చెప్పాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మంగళవారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో జల వనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి తదితరులతో జల వనరుల శాఖ శ్వేత పత్రంపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా జల వనరుల శాఖ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌పై సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ శాఖ ప్రగతిని మీడియా ద్వారా ప్రజలకు వెల్లడించాలని మంత్రి నిమ్మల రామానాయుడికి సూచించారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుందని అన్నారు. కాగా.. కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న 36 ప్రాధాన్య ప్రాజెక్టులను 2028 నాటికి పూర్తి చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. రాష్ట్ర సాగునీటి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని పలు ఎత్తిపోతల పథకాలు నిర్వీర్యమయ్యాయని.. దాదాపు రూ.600 కోట్లతో వీటి పునరుద్ధరణపై నాలుగు రోజుల్లో అధికారులు నిర్ణయం తీసుకోవాలన్నారు. జల వనరులు, ఆర్థిక శాఖ అధికారులు సమీక్షించుకుని నిర్ణయాన్ని తనకు తెలియజేయాలని సూచించారు. ఈ వారంలోనే తాను వెలిగొండ ప్రాజెక్టును సందర్శించి నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజీని అందజేస్తానని సీఎం వెల్లడించారు. వెలిగొండ నిర్మాణం పూర్తికాకుండానే 2024 ఎన్నికలకు ముందు జాతికి అంకితమిచ్చినట్లుగా జగన్ ప్రకటించి కరువుపీడిత ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు.