Share News

కల్తీ నెయ్యిని హెరిటేజ్‌కు ముడిపెడతారా?

ABN , Publish Date - Feb 14 , 2026 | 02:48 AM

తిరుమల లడ్డూ వ్యవహారం చాలా సున్నితమైన అంశమని సీఎం అసెంబ్లీలో స్పష్టం చేశారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిందే కాక ఆ వివాదంలోకి హెరిటేజ్‌ సంస్థను తీసుకు రావడంపై మండిపడ్డారు.

కల్తీ నెయ్యిని హెరిటేజ్‌కు ముడిపెడతారా?

  • దాని బ్రాండ్‌ను దెబ్బతీసే యత్నాలు: సీఎం

  • ఆ పత్రికవి తప్పుడు ఆరోపణలు: కుటుంబరావు

తిరుమల లడ్డూ వ్యవహారం చాలా సున్నితమైన అంశమని సీఎం అసెంబ్లీలో స్పష్టం చేశారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిందే కాక ఆ వివాదంలోకి హెరిటేజ్‌ సంస్థను తీసుకు రావడంపై మండిపడ్డారు. ‘ఆ సంస్థ ప్రభుత్వం నుంచి ఒక్క పైసా తీసుకున్న చరిత్ర లేదు. కల్తీ నెయ్యి వ్యవహారాన్ని హెరిటేజ్‌కు ముడిపెట్టి ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. హెరిటేజ్‌ అనేది ఫ్యామిలీ బిజినెస్‌. దాని బ్రాండ్‌ దెబ్బతీసేలా జగన్‌ రోతపత్రికలో అవాస్తవ కథనాలు ప్రచురిస్తున్నారు. గతంలో రాయలసీమలో ఫ్యాక్షన్లో భాగంగా కక్ష తీర్చుకునేందుకు చీనీ చెట్లను నరికేసేవారు. ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బతీయడం ఫ్యాక్షనిస్టులకు అలవాటు. ఇప్పుడు ఇలాంటి వ్యవహారాన్నే వారు నడిపిస్తున్నారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య ఘటనలో ఎన్నో నాటకాలాడారు. ఆ పత్రికలో నారాసుర రక్తచరిత్ర అని రాశారు. వాళ్లు చేసిన నేరాల నుంచి తప్పించుకోవడానికి ఇతరులపై నెట్టేసే ప్రయత్నాలు చేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు. మరోవైపు.. హెరిటేజ్‌ ఫుడ్స్‌పై వైసీపీ, జగన్‌ రోతపత్రిక చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధాలు, కల్పిత కథలతో కూడినవేనని స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్‌ వైస్‌ చైర్మన్‌ కుటుంబరావు అన్నారు. హెరిటేజ్‌ వెబ్‌సైట్‌ నుంచి ఒక ఫొటోను తీసుకుని.. అందులో ఒక కాలమ్‌ను ఉద్దేశపూర్వకంగా తొలగించి జగన్‌ పత్రిక ప్రచురించిందని విమర్శించారు. దేశంలో ఆ పత్రిక కంటే పెద్దవైన దైనిక్‌ జాగరణ్‌, దైనిక్‌ భాస్కర్‌ పత్రికల ప్రస్తుత మార్కెట్‌ క్యాప్‌ రూ.1,500 కోట్లుగా ఉంటే.. 2008లోనే ఆ పతికకు రూ.3500 కోట్ల వాల్యుయేషన్‌ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఇది క్విడ్‌ ప్రో కో కాదా అని నిలదీశారు.

ధన్యవాద తీర్మానానికి ఆమోదం

ఈ నెల 11న బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయసభలనుద్దేశించి రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని శాసనసభ శుక్రవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. టీడీపీ సభ్యుడు మద్దిపాటి వెంకటరాజు ప్రవేశపెట్టి.. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు బలపరచిన తీర్మానాలను స్పీకర్‌ అయన్నపాత్రుడు సభ ముందుంచగా.. సభ ఆమోదించింది.

Updated Date - Feb 14 , 2026 | 02:48 AM