గొడ్డలి పార్టీ కులం కుట్రలు
ABN , Publish Date - Jun 24 , 2026 | 03:58 AM
కులాల మధ్య చిచ్చు రాజేసేందుకు గొడ్డలి పార్టీ కుట్రలు పన్నుతోందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. వీటిని కలిసికట్టుగా తిప్పికొట్టాలని మంత్రివర్గ సహచరులకు సూచించారు.
కలిసికట్టుగా తిప్పికొట్టాలి
సంబంధం లేని విషయాల్లోకి డిప్యూటీ సీఎంను లాగే యత్నాలు
పవన్‌పై బురదజల్లుతుంటే.. మంత్రులు నోరు మెదపరా?
దుష్ప్రచారాలను తిప్పికొట్టడమే కాదు.. ప్రజలకు వాస్తవాలు చెప్పాలి
క్రిమినల్స్‌కు గొడ్డలి పార్టీ దన్ను
ఏ చిన్న ఘటన దొరికినా వాడుకోవాలని ఆ పార్టీ చూస్తోంది
క్యాబినెట్‌లో చంద్రబాబు వ్యాఖ్యలు
క్రిమినల్స్‌ను వెనకేసుకొస్తూ గొడ్డలి పార్టీ రాజకీయం చేస్తోంది. ఆ పార్టీ నేతలు ఊరూరా తిరుగుతూ కుల మీటింగ్‌లు పెడుతున్నారు. వారి లక్ష్యం కులాల మధ్య చిచ్చుపెట్టడమే. బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా ఉంటూ ఇలాంటి సంస్కృతిని ప్రోత్సహించడం వైసీపీకే చెల్లుతుంది.
- సీఎం చంద్రబాబు
అమరావతి, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): కులాల మధ్య చిచ్చు రాజేసేందుకు గొడ్డలి పార్టీ కుట్రలు పన్నుతోందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. వీటిని కలిసికట్టుగా తిప్పికొట్టాలని మంత్రివర్గ సహచరులకు సూచించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఎలాంటి సంబంధం లేని అంశాల్లోకి లాగి ఆయనకు కులాన్ని ఆపాదించాలని, బురదపులమాలని వైసీపీ ప్రయత్నిస్తోందని తప్పుబట్టారు. పవన్ కల్యాణ్‌ను అనవసర విషయాల్లోకి లాగి ఆయనపై బురదజల్లుతుంటే మంత్రులెవ్వరూ నోరుమెదపకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి కుట్రలను కలిసికట్టుగా తిప్పికొట్టకపోతే కూటమికి అర్థమేముంటుందని నిలదీశారు. ప్రతి విషయంలోనూ పైనుంచి ఆదేశాలు వస్తాయని ఎదురుచూడకూడదని మంత్రివర్గ సహచరులకు హితవు పలికారు. మంగళవారం సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది. అజెండా అంశాలపై చర్చించిన తర్వాత సీఎం పలు అంశాలపై సహచరులకు దిశానిర్దేశం చేశారు. వైసీపీది తొలి నుంచి క్రిమినల్ మనస్తత్వమేనని, అందుకే నేరగాళ్లకు కొమ్ముకాస్తూ వస్తోందని అన్నారు. సమాజం హర్షించని అంశాలనే గొడ్డలి పార్టీ తలకెత్తుకుంటుందన్నారు. కర్నూలు ఘటనను ప్రస్తావించారు. ‘కర్నూలు జిల్లాలో గంగమ్మ అనే మహిళ తన సమీప బంధువుతో అక్రమ సంబంధం ఏర్పరచుకుని.. అతడి సాయంతో సొంత కుమారుడినే హతమార్చింది.
ఆ తర్వాత తన కుమారుడు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు స్పందించడం లేదంటూ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సిట్ విచారణలో గంగమ్మే కొడుకును హతమార్చినట్లు తేలింది. ఆ తర్వాత అనారోగ్యంతో ఆస్పత్రిపాలైన గంగమ్మ అక్కడే మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని ఊరిలోకి తీసుకొచ్చేందుకు గ్రామస్థులు అంగీకరించలేదు. ఈ కేసులో నిందితులకు వైసీపీ అండదండలున్నాయి. ఊరంతా వద్దన్న విషయాన్ని వైసీపీ నేతలు తలకెత్తుకున్నారు. ఇలాంటి క్రిమినల్ మనస్తత్వం ఆ పార్టీలోనే కనిపిస్తుంది’ అని చంద్రబాబు వివరించారు. కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ ఘటనలోనూ వైసీపీ అదే తరహాలో ప్రవర్తిస్తోందని, ప్రభుత్వ చిత్తశుద్ధిని సాయికృష్ణ తల్లి, బంధువులు నమ్ముతుంటే గొడ్డలి పార్టీ కుల రాజకీయం చేస్తోందని సీఎం ధ్వజమెత్తారు. కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలు చాలా వరకు అదుపులో ఉన్నాయని.. కానీ వైసీపీ ఏ చిన్న ఘటన దొరికినా దాన్ని రాజకీయ లబ్ధికి వాడుకోవాలని చూస్తోందన్నారు. వైసీపీ కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని సహచరులకు సూచించారు. ఆ పార్టీ దుష్ప్రచారాలపై విమర్శలు చేయడం కన్నా.. ప్రజలకు వాస్తవాలు తెలియజేయడంపై దృష్టి పెట్టాలని కోరారు.
రాయితీలివ్వకుంటే హోటళ్లు ఎందుకు పెడతారు?
రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసే ఫైవ్‌స్టార్ హోటళ్లకు పన్ను రాయితీల అంశం చర్చకు వచ్చినప్పుడు మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ.. హోటళ్ల యాజమాన్యాలకు పన్ను రాయితీలు ఇవ్వడం కన్నా నేరుగా వినియోగదారులకు లబ్ధి చేకూరేలా రాయితీలు కల్పిస్తే బాగుంటుందని సూచించారు. సీఎం స్పందిస్తూ.. రాజధానిలో పెద్ద హోటళ్లు రావాలంటే పన్ను రాయితీలు కల్పించాల్సిందేనని.. లేకుంటే అమరావతిలో హోటళ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం వారికి ఏముంటుందని ప్రశ్నించారు. చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పర్యాటక మంత్రి దుర్గేశ్ మద్దతు పలికారు.
గీతం విద్యాసంస్థలో 45మీ. ఎత్తు వరకు స్కూల్ భవన నిర్మాణం చేపట్టేందుకు తాత్కాలిక ఫైర్ ఎన్‌వోసీ మంజూరుకు సంబంధించిన అంశం చర్చకు వచ్చిన సమయంలో.. చంద్రబాబు, లోకేశ్ బయటకు వెళ్లారు. తమ ప్రమేయం లేకుండా మంత్రివర్గ సహచరులు నిర్ణయించాలని సీఎం సూచించారు. ఈ అంశానికి క్యాబినెట్ ఆమోదించింది.
విశాఖలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆధ్వర్యంలో ఓ డేటా సెంటర్ ఏర్పాటుకు రంగం సిద్ధమైందని, త్వరలో వివరాలు వెల్లడిస్తామని సీఎం తెలిపారు.
డేటా సెంటర్ల నీటివాడకం, విద్యుత్ వాడకంపైనా వైసీపీ పథకం ప్రకారం దుష్ప్రచారం చేస్తోందని లోకేశ్ అన్నారు. వాస్తవాలతో వాటిని తిప్పికొట్టాలని కోరారు. పవన్ కల్యాణ్ జోక్యం చేసుకుని.. ఎకరా సాగుకు ఎంత నీరు అవసరమని ప్రశ్నించారు. డేటా సెంటర్‌కు ఎంత నీరు అవసరమని అడిగారు. సాగుకు ఇబ్బంది లేకుండా సముద్రంలో కలిసే వృథా జలాలనే డేటా సెంటర్లకు వాడుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సీఎం ఆయనకు వివరించారు.
సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠినంగా ఉండాలని పలువురు మంత్రులు సీఎంకు సూచించారు.
3న కడప స్టీల్‌కు శంకుస్థాపన..
వైఎస్ కుటుంబం రాయలసీమకు ఉక్కు కర్మాగారం అంటూ ఏళ్ల తరబడి ఊరిస్తూ వచ్చిందని.. కూటమి దానిని సాకారం చేయనుందని సీఎం తెలిపారు. జూలై 3న కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయబోతున్నామని క్యాబినెట్ సహచరులతో చెప్పారు. ‘ప్రతి మంత్రీ అన్ని శాఖలపై అవగాహన పెంచుకోవాలి. తమ శాఖ పరిధిలోని అంశం కాదని కూర్చోకుండా ప్రతి అంశంపై స్పందించాలి. డీఎస్సీ సహా వివిధ అంశాలపై చేసే అసత్యప్రచారాలను మంత్రులంతా దీటుగా తిప్పికొట్టాలి. కర్నూలు జిల్లా జొన్నగిరి గ్రామాన్ని స్వర్ణగిరి అనే పేరుతో పిలవాలి. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం’ అని తెలిపారు.
ఇంటింటికీ టీడీపీ జూలై 15కి వాయిదా
క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రులతో కలిసి లోకేశ్ డిన్నర్ చేశారు. ఈ సందర్భంగా.. సర్ జరిగే సమయంలో ‘ఇంటింటికీ టీడీపీ’ కార్యక్రమం నిర్వహించడం ఇబ్బందిగా ఉంటుందని పలువురు మంత్రులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అధినేత చంద్రబాబుతో మాట్లాడి జూలై 15కి వాయిదా వేద్దామని లోకేశ్ చెప్పారు. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. గురువారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉంది.