డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం!
ABN , Publish Date - Feb 14 , 2026 | 02:46 AM
డ్రగ్స్ మాఫియా ఆగడాలను సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ మాఫియాపై తమ ప్రభుత్వం ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని కొనసాగిస్తుందన్నారు.
ఆగడాలను సహించేది లేదు: చంద్రబాబు
జాతీయ స్థాయిలో ‘బెస్ట్ ప్రాక్టీస్ స్టేట్’గా ఏపీ
ఈగల్ నివేదిక-2025ను విడుదల చేసిన సీఎం
అమరావతి, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): డ్రగ్స్ మాఫియా ఆగడాలను సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ మాఫియాపై తమ ప్రభుత్వం ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని కొనసాగిస్తుందన్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలపై కట్టుదిట్టమైన పోరాటానికి నిదర్శనంగా నిలిచిన ‘ఈగల్’ వార్షిక నివేదిక-2025ను శుక్రవారం సచివాలయంలో సీఎం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీ పోలీసు వ్యవస్థ సాధించిన ఫలితాలతో మన రాష్ట్రం ‘బెస్ట్ ప్రాక్టీస్ స్టేట్’గా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని, నార్కో కోఆర్డినేషన్ సెంటర్ (ఎన్‌సీవోఆర్‌డీ) ప్రాధాన్యాలకు అనుగుణంగా రాష్ట్రం మెరుగ్గా నిలిచిందని ప్రశంసించారు. డ్రగ్ నిరోధక వ్యవస్థను సాంకేతిక, ఇంటెలిజెన్స్ ఆధారితంగా రూపుదిద్దిన ఈగల్ బృందాన్ని సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత అభినందించారు. డ్రగ్ మాఫియా ఆగడాలపై చర్యలతో పాటు ప్రజలకు అవగాహన కల్పించడం, కమ్యూనిటీ భాగస్వామ్యం, డీ-అడిక్షన్‌పై దృష్టి సారించడం ప్రశంసనీయమని హోంమంత్రి పేర్కొన్నారు. డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. ఇంటెలిజెన్స్ ఆధారిత చర్యలు, అంతర్రాష్ట్ర సమన్వయం, ఆర్థిక దర్యాప్తు వ్యవస్థను బలోపేతం చేయడం వల్ల ఈగల్ సాంకేతికంగా బలమైన సంస్థగా మారిందని వివరించారు. కార్యక్రమంలో ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ, ఎస్పీ కె.నాగేశ్‌బాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.