Share News

చంద్రబాబుకు ఈడీ క్లీన్‌చిట్‌!

ABN , Publish Date - Feb 02 , 2026 | 03:47 AM

స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది.

చంద్రబాబుకు ఈడీ క్లీన్‌చిట్‌!

  • స్కిల్‌ కేసులో ఆయన ప్రమేయంపై ఆధారాల్లేవు

  • విశాఖ పీఎంఎల్‌ఏ కోర్టులో అనుబంధ చార్జిషీటు

  • ఆయన పాత్ర లేదు.. నిందితుడిగా చేర్చలేం: ఈడీ

  • చార్జిషీటును పరిగణనలోకి తీసుకున్న కోర్టు

  • ఈ కేసులో గత నెలలోనే ఆయనకు సీఐడీ క్లీన్‌చిట్‌

  • నాడు నానా గగ్గోలు పెట్టిన జగన్‌ అండ్‌ కో

  • నేడు ఈడీ తేల్చేయడంతో మూతబడిన నోళ్లు

అమరావతి, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసులో కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఈ కేసులో కొందరు నిందితులు ప్రభుత్వ నిధులు మళ్లించినట్లు గుర్తించామని.. కానీ చంద్రబాబు పాత్ర మాత్రం లేదని పేర్కొంది. అందువల్ల ఆయన్ను ఈ కేసులో నిందితుడిగా చేర్చలేమని తెలిపింది. గత నెల 28న విశాఖపట్నంలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ (మనీలాండరింగ్‌ నిరోధక చట్టం) కోర్టులో తాను దాఖలు చేసిన అనుబంధ చార్జిషీటును న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుందని ఈడీ ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి.. తప్పుడు కేసులో చంద్రబాబును అరెస్టుచేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపునకు కారణమైన స్కిల్‌ కేసు కథ దాదాపు ముగిసినట్లేనని న్యాయనిపుణులు అంటున్నారు. చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేని ఈ కేసులో ఆయన్ను ఇరికించి, అక్రమంగా అరెస్టుచేసి 53 రోజులు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో పెట్టి.. సరైన సౌకర్యాలు కల్పించకుండా నరకయాతన పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన అవినీతికి పాల్పడ్డారనడానికి ఎలాంటి ఆధారాలూ లేవని, కేసును మూసివేయాలని దర్యాప్తు సంస్థ సీఐడీ కోరడంతో గత నెల 12న ఏసీబీ కోర్టు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీనిపై అప్పట్లో జగన్‌, వైసీపీ నాయకులు ఎంతో గగ్గోలు పెట్టారు. ఇప్పుడు ఈడీ కూడా చంద్రబాబు ప్రమేయం లేదని చెప్పడంతో వారి నోళ్లు మూతబడ్డాయి.


ఏమిటీ స్కిల్‌ కేసు..

స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ప్రాజెక్టు కింద రాష్ట్రవ్యాప్తంగా సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని 2014-19 నడుమ అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు రాష్ట్ర యువతలో నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి ఉద్దేశించినది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.3,300 కోట్లుగా అంచనా వేశారు. ఈ స్కిల్‌ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని.. రాష్ట్ర ఖజానాకు రూ.300 కోట్లు నష్టం వాటిల్లిందని ఆరోపిస్తూ వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023 సెప్టెంబరు 9వ తేదీ రాత్రి చంద్రబాబుని సీఐడీ అరెస్టు చేసింది. ఈ కేసులో ఆయన రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో 53 రోజులు గడిపారు. 2023 అక్టోబరు 31న హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. మరోవైపు.. ఈ కేసులో ఈడీ అంతకుముందే విచారణ మొదలుపెట్టింది. రాష్ట్రప్రభుత్వాన్ని మోసం చేసి.. సీమెన్స్‌ ప్రాజెక్టుకు కేటాయించిన నిధులను ఇతర ప్రయోజనాలకు మళ్లించి దుర్వినియోగం చేశారని సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తులో డీటీఎ్‌సపీఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వికాస్‌ ఖన్వేల్కర్‌, సీమెన్స్‌ ఇండస్ట్రీ సాఫ్ట్‌వేర్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాజీ ఎండీ సౌమ్యాద్రి శేఖర్‌ బోస్‌ అలియాస్‌ సుమన్‌ బోస్‌, వారి అనుచరులు ముకుల్‌ చంద్ర అగర్వాల్‌, సురేశ్‌ గోయల్‌.. షెల్‌ కంపెనీలను సృష్టించి తప్పుడు ఇన్వాయి్‌సల ఆధారంగా ప్రభుత్వ నిధులను మళ్లించినట్లు ఈడీ గుర్తించింది. ఇందుకు ఎంట్రీ ప్రొవైడర్ల సేవలు తీసుకుని కమీషన్లు చెల్లించినట్లు వెల్లడైంది.


ఈ కేసులో వికాస్‌, సుమన్‌ బోస్‌, అగర్వాల్‌, సురేశ్‌ గోయల్‌ను ఈడీ 2023 మార్చి 4న అరెస్టు చేసింది. 2023 ఏప్రిల్‌లో డిజైన్‌టెక్‌ సిస్టమ్స్‌ పేరిట ఉన్న రూ.31.20 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను జప్తు చేసింది. అనంతరం విశాఖలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో చార్జిషీటు దాఖలు చేయగా.. అదే ఏడాది మే నెలలో కోర్టు దానిని పరిగణనలోకి తీసుకుంది. తదుపరి దర్యాప్తులో ఎంట్రీ ప్రొవైడర్లకు సంబంధించిన బ్యాంకు బ్యాలెన్సులు, షేర్లను.. ఢిల్లీ, ముంబై, పుణే ప్రాంతాల్లోని స్థిరాస్తులను కలిపి రూ.23.54 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. దీంతో ఈ కేసులో మొత్తం జప్తుచేసిన ఆస్తుల విలువ రూ.54.74 కోట్లకు చేరింది. గత నెల 28న దాఖలుచేసిన అనుబంధ చార్జిషీటులో డిజైన్‌టెక్‌ సిస్టమ్స్‌, వికాస్‌, సుమన్‌ బోస్‌, ముకుల్‌ చంద్ర అగర్వాల్‌, సురేశ్‌ గోయల్‌ తదితరులను నిందితులుగా ఈడీ పేర్కొంది. ఇందులో ఎక్కడా చంద్రబాబు ప్రస్తావన లేదు. ఆయన ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలూ లేకపోవడంతో ఆయన్ను ఈ కేసులో నిందితుడిగా చూపలేమని స్పష్టం చేసింది. తదుపరి దర్యాప్తులో కొత్త అంశాలు వెలుగులోకి వస్తే తప్ప.. ఈ అనుబంధ చార్జిషీటే ఈ కేసులో చిట్టచివరిదని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి.


బాబు కడిగిన ముత్యం: మంత్రి అనగాని

సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా జగన్‌ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా చివరకు సత్యమే గెలిచిందని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. ఆ కేసు నుంచి కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటపడ్డారన్నారు.

Updated Date - Feb 02 , 2026 | 06:00 AM