Share News

ఉమ్మడి కుటుంబాలు మళ్లీ రావాలి!

ABN , Publish Date - Jun 29 , 2026 | 04:54 AM

ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చాలా బలమైనదని, అలాంటి వ్యవస్థ మళ్లీ రావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. జాతీయ ఇమ్యూనైజేషన్‌ డే సందర్భంగా ఆదివారం గుంటూరు జిల్లా ఉండవల్లిలోని..

ఉమ్మడి కుటుంబాలు మళ్లీ రావాలి!

  • అదే సమాజానికి, వ్యక్తులకు ఎంతో బలం

  • నాడు పిల్లలను విలువలతో పెంచడంలో నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలది కీలక పాత్ర

  • పిల్లల పెంపకంలో తండ్రులకూ బాధ్యత

  • సంతానం అంటే ‘సంపద’ అనే పరిస్థితి

  • ఎంత మంది పిల్లలను కన్నా ప్రోత్సహిస్తాం

  • ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి

  • చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన సీఎం

అమరావతి, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చాలా బలమైనదని, అలాంటి వ్యవస్థ మళ్లీ రావాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. జాతీయ ఇమ్యూనైజేషన్‌ డే సందర్భంగా ఆదివారం గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో చిన్నారులకు ఆయన పోలియో చుక్కలు వేశారు. అనంతరం చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడారు. పిల్లలను ఎత్తుకుని ఆడించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి, వ్యాక్సినేషన్‌ వివరాలు తెలుసుకున్నారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల టీకాలను నిర్ణీత సమయానికి తప్పనిసరిగా వేయించాలని సూచించారు. పిల్లల పెంపకం భారంగా ఉంటుందా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారుల తల్లులతో ముఖ్యమంత్రి మాట్లాడి వారి వివరాలు అడిగారు. ఉద్యోగానికి, ఉపాధికి వెళ్తున్న మహిళలు పిల్లల పెంపకంలో ఎలా సమన్వయం చేసుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. ఇంట్లో భర్త, పురుషులు కూడా పిల్లల పెంపకంలో బాధ్యత తీసుకోవాలని సీఎం సూచించారు. పిల్లల్ని కని, పెంచడం, వారి ఆలనాపాలనా చూసుకోవడం తల్లికి మాత్రమే పరిమితం చేయకూడదని చెప్పారు. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉంటే పిల్లల పెంపకంలో పెద్దవాళ్లు భాగస్వాములు అయ్యేవారని అన్నారు. పిల్లలను విలువలతో పెంచడంలో నాడు అమ్మమ్మలు, తాతయ్యలు, ఇతర కుటుంబ సభ్యులు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించేవారని గుర్తుచేశారు. సంతానాన్ని సమస్యగా, భారంగా చూసే విధానం పోవాలని, సంతానం అంటే సంపద అనే పరిస్థితి వస్తోందని అన్నారు. అందుకే ఇద్దరు అంత కంటే ఎక్కువ మంది పిల్లలు ఉండేలా ప్రభుత్వ పరంగా కూడా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో ముందుగా తల్లిదండ్రులకు అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఉమ్మడి కుటుంబాలే సమాజానికి, వ్యక్తులకు కూడా ఎంతో బలాన్ని ఇస్తుందని తెలిపారు.


49 లక్షల మందికి చుక్కల మందు

రాష్ట్రంలో పల్స్‌ పోలియో కార్యక్రమం అమలుకు చేసిన ఏర్పాట్లను ఆరోగ్యశాఖ అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు పల్స్‌ పోలియో కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఐదు సంవత్సరాలలోపు వయసున్న సుమారు 49.20 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ కమిషనర్‌ చక్రధర్‌బాబుతో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 29 , 2026 | 05:58 AM