Share News

శనగనూనె కొనుగోలు చేయాలా?

ABN , Publish Date - Jun 21 , 2026 | 06:49 AM

అన్నదాతల పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకోవడంలో భాగంగా చిలకలూరిపేట మండలంలో రైతు నాగభూషణంకు చెందిన ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు.

శనగనూనె కొనుగోలు చేయాలా?

  • సతీమణి భువనేశ్వరికి చంద్రబాబు ఫోన్‌

  • రైతు పంట పరిశీలనలో ఆసక్తికర ఘటన

న్నదాతల పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకోవడంలో భాగంగా చిలకలూరిపేట మండలంలో రైతు నాగభూషణంకు చెందిన ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. తాము ఉత్పత్తి చేస్తున్న నాణ్యమైన కోల్డ్‌ ప్రెస్డ్‌ వేరుశెనగ నూనెను ఒకసారి వినియోగించి చూడాలని ఆ రైతు కోరగా, ముఖ్యమంత్రి స్పందించిన తీరు అక్కడ నవ్వులు పూయించింది. ఇంట్లో ఏదైనా వస్తువు కొనుగోలు చేయాలంటే తన సతీమణి భువనేశ్వరిని అడగాలని చెబుతూ, చంద్రబాబు అక్కడి నుంచే ఆమెకు ఫోన్‌ చేసి మాట్లాడారు. అనంతరం ఒక లీటరు కోల్డ్‌ ప్రెస్డ్‌ వేరుశనగ నూనెను కొనుగోలు చేశారు. అనంతరం ఆ క్షేత్రంలోని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని సందర్శించారు. స్థానికంగా లభించే వనరులతోనే జీవామృతం, ఘన జీవామృతం, వేపాస్త్రం వంటి సహజ వ్యవసాయ ఉత్పాదితాలను తయారు చేసి రైతులకు అందచేస్తున్న విధానాన్ని ఆయన ఆసక్తిగా పరిశీలించారు. ఈ కేంద్రం ద్వారా రైతులకు ప్రకృతి వ్యవసాయంలో శిక్షణ, ప్రదర్శనలు, సాంకేతిక సహాయాన్ని అందిస్తున్నట్లు నాగభూషణం వివరించారు. ఆ తర్వాత అక్కడి బొప్పాయి తోటను పరిశీలించిన ముఖ్యమంత్రి, రైతు ప్రేమతో అందించిన బొప్పాయి పండును రుచి చూశారు. బొప్పాయితో పాటు వివిధ రకాల పంటలను అంతర పంటలుగా సాగు చేయడం వల్ల జీవ వైవిధ్యం పెరగడంతో పాటు భూసారం, తేమ నిల్వ సామర్థ్యం మెరుగవుతాయని, చీడపీడల నివారణకు కూడా ఇది దోహదపడుతుందని రైతు నాగభూషణం వివరించారు. ముఖ్యమంత్రి ఆ విధానాలను ఎంతగానో మెచ్చుకుని రైతును అభినందించారు.

Untitled-3 copy.jpg

Updated Date - Jun 21 , 2026 | 06:50 AM