మీ భవిష్యత్తు నా బాధ్యత..
ABN , Publish Date - Jun 28 , 2026 | 05:14 AM
‘వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణం ఒక చరిత్ర. ప్రాజెక్ట్ కోసం భూములు, ఇళ్లు, ఊళ్లు వదిలేసిన మీ త్యాగం వృథా కాదు. మీ దాతృత్వం వల్ల నాలుగు జిల్లాల్లోని 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
భూములిచ్చిన మీ త్యాగం వృథా కాదు
వెలిగొండ నిర్వాసితులకు సీఎం భరోసా
మీ స్ఫూర్తితో 23 లక్షల మందికి తాగునీరు
4 జిల్లాల్లో 4.47లక్షల ఎకరాలకు సాగునీరు
అన్యాయం జరగనీయను.. అండగా ఉంటా
ఏ ప్రభుత్వమైతే ఏమిలే అని అనుకోవద్దు
వైకుంఠపాళీ ఆడొద్దు
గొడ్డలి పార్టీ మాయలో పడొద్దు: చంద్రబాబు
బాధితులకు రూ.300 కోట్ల నమూనా చెక్కు అందజేసిన ముఖ్యమంత్రి
జాతికి అంకితం అంటూ... వెలిగొండ ప్రాజెక్టు వద్ద గత ప్రభుత్వం ఏర్పాటుచేసిన స్థూపాన్ని చూస్తే ఆశ్చర్యం వేసింది. ఎలా మోసం చేస్తారో, ఏ విధంగా ఏమారుస్తారో తెలియాలంటే ఇలాంటి వాటిని మ్యూజియంలో పెట్టి ప్రజలకు వివరించాలి. 7225 మంది నిర్వాసితులు ఉంటే, వైసీపీ హయాంలో కేవలం 96 మందికి మాత్రమే పునరావాసం కల్పించారు. మా ప్రభుత్వం నిర్వాసితులందరికీ పరిహారం చెల్లిస్తోంది. వైసీపీ కనీసం నిర్వాసితుల గోడు వినేందుకు కూడా అవకాశం ఇవ్వకపోగా, కేసులు పెట్టించింది. గొడ్డలి పార్టీకి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మీదే.
- సీఎం చంద్రబాబు
మార్కాపురం, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): ‘వెలిగొండ ప్రాజెక్ట్ నిర్మాణం ఒక చరిత్ర. ప్రాజెక్ట్ కోసం భూములు, ఇళ్లు, ఊళ్లు వదిలేసిన మీ త్యాగం వృథా కాదు. మీ దాతృత్వం వల్ల నాలుగు జిల్లాల్లోని 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. మీ పేరు చెప్పుకొని 23 లక్షల మంది ప్రజలు వెలిగొండ నీళ్లు తాగుతారు. వారి ఆశీస్సులతో మీ అందరి జీవితాలు మెరుగ్గానే ఉంటాయి. మీ భవిష్యత్తుకు అండగా నేనుంటా. మీ అందరి జీవితాల్లో ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత నేనే తీసుకుంటా.’’ అని వెలిగొండ ముంపు గ్రామాల నిర్వాసితులు, రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటవానిపల్లి వద్ద శనివారం వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు పరిహారం కింద మొదటి విడత రూ.300 కోట్లు నమూనా చెక్కును సీఎం అందజేశారు.
వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కాలువను పరిశీలించిన ఆయన, అక్కడి పొలాల్లో రైతులు, నిర్వాసితులతో మాట్లాడారు. వెలుగొండకు 1996లో నేనే శంకుస్థాపన చేశా. ఇప్పుడు నేనే పూర్తి చేసుతన్నా. ప్రస్తుత లెక్కల ప్రకారం ప్రాజెక్ట్ పూర్తి కావడానికి రూ.10,580 కోట్లు అవసరం. ఇప్పటి వరకు రూ.6,736 కోట్లు ఖర్చు చేశాం. ఇందులో రూ.759 కోట్లు గత రెండేళ్లలోనే ఖర్చు పెట్టాం. ఇప్పుడు నిర్వాసితుల కోసం రూ.905 కోట్లు మంజూరు చేశాం. అందులో రూ.300 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. గత వైసీపీ ఐదేళ్లలో కేవలం రూ.980 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. మేం నిర్వాసితుల కోసమే రూ.905 కోట్లు, నిర్మాణ పనులకు రూ.3వేల కోట్లకు పైగా వెచ్చిస్తున్నాం. గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన బిల్లులను కూడా రూ.140 కోట్లు చెల్లించాం. 2014-19 మధ్య కాలంలోనే చాలా వరకు టన్నెల్ పనులు చేశాం. నిర్వాసితులకు గత ప్రభుత్వం పరిహారం ఇవ్వలేదు. సొరంగాల్లో మట్టిని, రెండో టన్నెల్‌లో ఇరుక్కుపోయిన టన్నెల్ బోరింగ్ యంత్రాన్ని కూడా తొలగించలేదు. అవేమీ చేయకుండానే జాతికి అంకితం చేసింది. ఇది డ్రామానో లేక మోసమో మీరే గ్రహించాలి.’’ అని అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే....
మోసం చేయడంలో గొడ్డలిపార్టీ దిట్ట
‘‘మోసం చేయడంలో గొడ్డలి పార్టీ దిట్ట. కళ్లార్పకుండా అబద్ధాలు చెప్తూ, మనం తేరుకునేలోపే మో సం చేస్తారు. ఇటీవల అక్కడక్కడా జరుగుతున్న డిజిటల్ అరెస్టులు లాంటి ఘటనల తరహాలోనే ఆ పార్టీ మోసాలూ ఉంటాయి. ‘ఏ ప్రభుత్వం ఉంటే మాకేమిలే’ అనే భావనతో మీరు ఉండొద్దు. ప్రజల జీవితాలను ఎలా విధ్వంసం చేయొచ్చో గత ప్రభు త్వం నిరూపించింది. రాష్ట్రానికి జీవనాడిలాంటి పోలవరం డయాఫ్రం వాల్ కొట్టుకుపోయేలా చేశారు. కానీ 2027 మార్చి నాటికి పోలవరం జాతికి అంకి తం చేసే లక్ష్యంతో మా ప్రభుత్వం పనులు చేస్తోం ది. ఇన్ని పనులు చేస్తున్న ప్రభుత్వాన్ని విస్మరించి కులం, మతం, పార్టీ అంటూ వైకుంఠపాళీ ఆట ఆడి, గొడ్డలి పార్టీ మాయలో పడొద్దు. మీ అభివృద్ధి చూసే బాధ్యత నాది. నాకు సహకరించే బాధ్యత మీది. నన్ను చూడండి. టీడీపీని చూడండి. ఎన్డీయేను చూ సి అండగా నిలబడండి. ప్రజలు ఆమోదించే వ్యక్తులనే వచ్చే ఎన్నికల్లో నేను ఎంపిక చేస్తాను. ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తాం. ఆదరించండి.’’
30 ఏళ్ల ముందుచూపున్న వ్యక్తిని నేను
‘నేనెప్పుడు కూడా 30 ఏళ్ల ముందుచూపుతో పనులు చేపడతాను. ఆనాడు హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్టు, ఇతర ప్రాజెక్ట్‌ల నిర్వాసితులు అక్కడ కొన్న ఆస్తులు ఈరోజు కోట్ల విలువకు చేరాయి. మార్కాపురం ప్రాంతానికి కృష్ణాజలాలు ఇవ్వాలనే ఆలోచన 1985లోనే ఎన్టీఆర్ చేశారు. 1995లో నేను ప్రకాశం పర్యటనకు వచ్చిన ప్రతిసారీ వెలిగొండ గురించే ప్రజలు అడిగేవారు. సక్రమంగా పనులు జరిగి ఉంటే 10 ఏళ్ల క్రితమే ఇది పూర్తయ్యేది. ప్రాజెక్ట్ రావడం ద్వారా వనరులు పెరుగుతాయి. ఇటీవల తుంగభద్ర డ్యాంకు గేట్లు పెట్టేందుకు సహకరించా. ఈ సీజన్ కాపాడాం. నదుల అనుసంధానంతోపాటు భూగర్భజలాలను పెంచాలి. అందుకే జలధార కార్యక్రమం ప్రారంభించాం. లక్ష కోట్లతో రాయలసీమ హార్టికల్చర్ హబ్ ద్వారా మార్కాపురం ప్రజలకు మేలు చేస్తాం.’’
నిర్వాసితుల్లో ఒక్కొక్కరిదీ ఓ దీనగాధ
‘వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులు తరతరాల నివాసాలను వదిలి, భూములను త్యాగం చేశారు. వారి కుటుంబాల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాధ. పుట్టిన ఊరు నుంచి వెళ్లిపోవాలంటే ఎవరికైనా బాధ కలుగుతుంది. ఏ ఒక్క నిర్వాసిత కుటుంబం నష్టపోకుండా వెలిగొండ పూర్తి చేస్తా. ఇది నా గ్యారెంటీ. ప్రాజెక్ట్ ద్వారా లబ్ధి పొందే ప్రజలే కాకుండా నిర్వాసితులు కూడా ఆనందంగా ఉండేలా చూసే బాధ్యత ప్రభుత్వానిది. నిర్వాసితుల కోసం కాలనీలను ఏర్పాటు చేస్తున్నాం. అన్ని విధాలా మార్కాపురం జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నాది. నాకు అండగా నిలవండి.’’ అని చంద్రబాబు కోరారు. దానికి ముందు.. వెలిగొండ ఫీడర్ కాలువ పనులను ఆయన పరిశీలించారు. గడువులోపు పనులు పూర్తి చేయకపోతే కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెడతానని హెచ్చరించారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు నిమ్మల, గొట్టిపాటి, డోలా, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు.